30 ఐపీఓలు.. రూ.30,000 కోట్లు! - Thirty thousand crores from thirty IPOs
close
Published : 04/12/2020 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 ఐపీఓలు.. రూ.30,000 కోట్లు!

2021లో ఐపీఓల కోలాహలం 
కల్యాణ్‌ జువెలర్స్‌తో బోణీ.. ఎల్‌ఐసీ మెగా ఐపీఓ కూడా!
 

దిల్లీ: కొత్త సంవత్సరంలో (2021) పబ్లిక్‌ ఇష్యూల మోత మోగనుంది. 30కి పైగా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.30,000 కోట్లకు పైగా సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2020లోనూ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓలు)లు బాగానే సందడి చేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 ఐపీఓలు పూర్తవ్వగా.. సమీకరించిన నిధుల విలువ దాదాపు రూ.25,000 కోట్లు. బర్గర్‌ కింగ్‌ ఐపీఓ నేటితో ముగియనుంది. ఈ సంస్థ రూ.810 కోట్లు సమీకరిస్తోంది.  ఈ ఏడాది రెండో అర్ధభాగం పబ్లిక్‌ ఇష్యూలకు బాగా కలిసొచ్చింది. స్టాక్‌ మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండటం కలిసొచ్చింది. 2019తో పోలిస్తే 2020లోనే ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ అధికంగా జరిగింది. గతేడాది రూ.12,369 కోట్లు మాత్రమే కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించాయి.

వినియోగ ఆధారిత కంపెనీలే ఎక్కువ..

2021లో ఐపీఓలకు వెళ్లే కంపెనీల్లో వినియోగ ఆధారిత రంగానికి చెందినవి ఎక్కువగా ఉండనున్నాయి. కల్యాణ్‌ జువెల్లర్స్, ఇండిగో పెయింట్స్, స్టవ్‌ క్రాఫ్ట్, సంహి హోటల్స్, అపీజై సురేంద్ర పార్క్‌ హోటల్స్, న్యూరెకా, మిసెస్‌ బెక్టార్స్‌ ఫుడ్, జొమాటోలు ఐపీఓ ప్రణాళికలను వెల్లడించాయి. వీటిల్లో ఎక్కువ భాగం 2021 తొలి త్రైమాసికంలోనే జరిగే అవకాశం ఉన్నందున.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని అద్భుత పనితీరుతో ఐపీఓ మార్కెట్‌ ముగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఎల్‌ఐసీ ఇష్యూ వస్తే అదరహో..

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూను వచ్చే ఏడాది ప్రభుత్వం చేపడితే.. పబ్లిక్‌ ఇష్యూల పరంగా 2021 ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఎల్‌ఐసీ మెగా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులతో.. 2021లో ఐపీఓల నిధుల సమీకరణ రికార్డు భవిష్యత్‌లో బద్దలయ్యే అవకాశం ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎల్‌ఐసీ తర్వాత మిగిలిన పబ్లిక్‌ ఇష్యూల్లో కల్యాణ్‌ జువెలర్స్‌ అతిపెద్ద ఐపీఓగా ఉండనుంది. ఈ ఆభరణాల విక్రయ సంస్థ రూ.1,750 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కల్యాణ్‌ జువెలర్స్‌ ఐపీఓకు సెబీ అనుమతిని ఇచ్చినందున.. 2021లో మొట్టమొదటి ఐపీఓ ఈ సంస్థదే ఉండొచ్చు. ఇండిగో పెయింట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1000 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. 

‘2021లో పబ్లిక్‌ ఇష్యూలకు ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగ్గా ఉండటం ఇందుకు కారణం. గత మూడేళ్లుగా చాలా నాణ్యమైన కంపెనీలు ఐపీఓకు వచ్చి.. మదుపర్లకు ఆకర్షణీయ ప్రతిఫలాన్ని పంచాయి’ 
-వి.జయశంకర్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని