అందుకే ‘ఆది పురుష్‌’గా ప్రభాస్‌ను తీసుకున్నాం - This is the reason Director Om Raut chose Prabhas to play Lord Ram in the film
close
Updated : 25/08/2020 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘ఆది పురుష్‌’గా ప్రభాస్‌ను తీసుకున్నాం

ముంబయి: ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. భారీ బడ్జెట్‌తో పాటు 3డీలోనూ దీన్ని రూపొందిస్తున్నారు. అయితే, ఎంతోమంది బాలీవుడ్‌ నటులు ఉండగా, ప్రభాస్‌నే ఎందుకు ‘ఆది పురుష్‌’లో కథానాయకుడిగా తీసుకున్నారని దర్శకుడు ఓం రౌత్‌ను ప్రశ్నించగా ఆయనేమన్నారో తెలుసా?

‘‘ప్రభాస్‌ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. ఆయన పర్సనాలిటీ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు ఇలా ప్రభాస్‌లో ‘ఆది పురుష్‌’ పాత్రను నేను చూశా. ఒక వేళ ప్రభాస్‌ కాకపోయి ఉంటే ఈ సినిమా చేసేవాడిని కాదు’’ అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చారు. ‘ఆది పురుష్‌’లో రాముడిని జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు’ అని అడగ్గా.. ఇప్పుడే ఆ విషయాలు మాట్లాడటం తొందరపాటు అవుతుందని, ప్రస్తుతం తమ బృందం కథను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కష్టపడుతోందన్నారు.

‘‘ఇది ప్రభు రామ్‌ కథ. ఇతిహాసగాథలో ఒక భాగం. నా ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నా. ప్రస్తుతం వివిధ రకాలుగా సన్నద్ధమవుతున్నాం. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. అందుకు సంబంధించిన నోట్స్‌ను సైతం సిద్ధం చేశాం. టెక్నాలజీ దృష్టి కోణం నుంచి చూస్తే, ఎంతో పరిశోధన, ప్రామాణికత అవసరం. రకరకాల స్టోరీబోర్డ్‌లు, సెట్స్‌, పాత్రల చిత్రీకరణ ఇలా అనేక వాటిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఓంరౌత్‌ చెప్పుకొచ్చారు.

‘‘తానాజీ’ సెట్స్‌పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్‌’ గురించి ఆలోచన ఉంది. చాలా పరిశోధనలు చేసి, ఒక రఫ్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసుకున్నా. నా టీమ్‌కు కథ చెప్పిన తర్వాత వాళ్లు చాలా ఉత్సుకతకు లోనయ్యారు. మొదటి రెండు నెలలు ఆ రఫ్‌ డ్రాఫ్ట్‌ను పూర్తిగా తిరగరాశాం. స్క్రీన్‌ప్లేను అప్‌డేట్‌ చేశాం. కథావస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని తీర్చిదిద్దే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత నేను ప్రభాస్‌ను కలిసి కథ వినిపించా’’ అని ఓం రౌత్‌ అన్నారు.

‘ఆది పురుష్‌’ చిత్రాన్ని 2021లో మొదలు పెట్టి, 2022లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్‌, కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌లు నిర్మిస్తున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్‌ వరల్డ్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె కథానాయిక. ఈ రెండు చిత్రాల తర్వాత ‘ఆది పురుష్‌’ ఉంటుంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని