ఇదే చివరి మహమ్మారి కాదు: WHO హెచ్చరిక - This will not be the last Pandemic says WHO
close
Published : 08/09/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే చివరి మహమ్మారి కాదు: WHO హెచ్చరిక

మరిన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్‌ఓ
ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని ప్రభుత్వాలకు సూచన

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు సంక్షోభంలోకి వెళ్లడంతో ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక జారీ చేసింది. లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్న మహమ్మారి, ఇదే చివరిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ హెచ్చరించారు. ‘వైరస్‌ ఉత్పాతాలు, మహమ్మారి విజృంభణలు నిజజీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తోంది. రాబోయే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలి. ఇందులోభాగంగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చుచేయాల్సిన అవసరం ఉంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ స్పష్టంచేశారు.

స్పానిష్‌ ఫ్లూ మొదలుకొని సార్స్‌, మెర్స్‌, ఎబోలా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వైరస్‌లు విజృంభిస్తూ మానవాళికి సవాల్‌ విసురుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం కరోనావైరస్‌తోనే ఈ ప్రమాదం ముగిసిపోలేదని, రానున్న రోజుల్లో మరిన్ని మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు అప్రమత్తంగా, మరింత సన్నద్ధతతో ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

ఇదిలాఉంటే, కేవలం ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. దేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రపంచంలో, స్వల్ప ఆదాయ దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ అందకపోతే అది మరింత విస్తరించే ప్రమాదం ఉంటుందని తేల్చిచెప్పింది. అందుకే, ప్రతిదేశానికీ వ్యాక్సిన్‌ అందించడం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. అందుకోసం కరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు సమానంగా అందేలా ‘కొవ్యాక్స్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. తద్వారా టీకా తయారుచేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భారత్‌ను భాగస్వామిగా చేర్చుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే చర్చలు జరుపుతోంది. ఈ కార్యక్రమంలో చేరమని అమెరికా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని