విజిల్స్‌ పడాలంటే మీసం తిప్పాల్సిందే! - Tollywood actors new style in Mustache
close
Published : 06/10/2020 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజిల్స్‌ పడాలంటే మీసం తిప్పాల్సిందే!

థియేటర్‌లో అభిమానులతో విజిల్స్‌ వేయించే కొన్ని సన్నివేశాలుంటాయి. ప్రతినాయకుడికి సవాల్‌ విసురుతూ పంచ్‌డైలాగ్‌లు కొడుతూ హీరో మీసం తిప్పి తొడగొడితే థియేటర్‌లో కూర్చొన్న ప్రతి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి సన్నివేశం పండాలంటే కథానాయకుడి పాత్ర, ఆహార్యం కూడా అంతే గంభీరంగా కనిపించాలి. మాస్‌ లుక్‌లో అదరగొట్టడానికి హీరోల స్టైల్‌లో చేసే మార్పు మీసాలు పెంచడం. మరీ ముఖ్యంగా పోలీస్‌ పాత్రల్లో కనిపించే కథానాయకులందరూ మీసాలు తిప్పిన వారే. త్వరలో రాబోయే చిత్రాల్లోనూ పలువురు కథానాయకులు మీసం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మీసంతో కనిపించి అభిమానులను అలరించారు. -ఇంటర్నెట్‌డెస్క్‌

యాడ్‌ షూట్‌ కోసం సరికొత్తగా మహేశ్‌

గ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తెరపై మీసంతో కనిపించడం చాలా అరుదు. అప్పుడెప్పుడో వచ్చిన ‘నాని’లో ఇటీవల వచ్చిన ‘భరత్‌ అనే నేను’ సినిమాల్లో మహేశ్‌ మీసకట్టుతో కనిపించారు. అదీ కొద్దిసేపు మాత్రమే. తాజాగా ఓ యాడ్‌ షూట్‌లో కోర మీసంతో దర్శనమిచ్చారాయన. ప్రస్తుతం మహేశ్‌లుక్‌ అభిమానులను అలరిస్తోంది. మీసంతోనూ మహేశ్‌ సూపర్‌గా ఉన్నారంటూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఇక ఆయన తన తర్వాతి చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మరి ఇందులో మహేశ్‌లుక్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు

 

పోరాట యోధులిద్దరూ..

న్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రల్లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ సందడి చేయనున్నారు. ఇప్పటికే అల్లూరి గెటప్‌లోని రామ్‌చరణ్‌ లుక్‌, టీజర్‌ బయటకు వచ్చాయి. కోర మీసంతో మన్నెందొరగా చెర్రీ లుక్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ లుక్‌ కూడా ఇలానే మీసంతో గంభీరంగా ఉంటుందని టాక్‌. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్‌ మొదలు పెట్టిన వెంటనే ఎన్టీఆర్‌ పాత్ర పరిచయానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించి టీజర్‌ను విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి చెప్పారు. నవంబరులో ఈ సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

బాలయ్య మరింత మాస్‌గా..

బాలకృష్ణ-బోయపాటి శ్రీను.. ఈ కాంబినేషన్‌ వినగానే ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలే గుర్తొస్తాయి. కాగా, ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. తాజాగా ఈ పాత్రకు సంబంధించి బాలకృష్ణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ అవగాహన కార్యక్రమానికి సంబంధించి పాల్గొన్న వీడియోలో కాస్త వెరైటీగా మీసాలు పెంచి కనిపించారు బాలకృష్ణ. ఇక మరి వెండితెరపై ఎలా కనిపిస్తారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

 

‘క్రాక్‌’ పోలీస్‌గా రవితేజ

‘విక్రమార్కుడు’, ‘బెంగాల్‌ టైగర్‌’ తదితర చిత్రాల్లో పోలీస్‌ గెటప్‌లో అలరించారు రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లి, మిగిలిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో రవితేజ వీర శంకర్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కోర మీసం తిప్పుతూ ఆయన డైలాగ్‌లు చెబుతున్న టీజర్‌ విశేషంగా అలరిస్తోంది. ఇక వెండితెరపై మరింత మాస్‌గా కనిపిస్తారనడంలో ఎలాంటి సందేశం లేదు.

 

నారప్ప మీసం తిప్పుతాడప్ప

వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేశ్‌ పల్లెటూరి వ్యక్తి ‘నారప్ప’గా కనిపించనున్నారు. గడ్డం, మీసాలతో మాస్‌ లుక్‌లో ఉన్న వెంకటేశ్‌ ఫొటోలు ఇప్పటికే అభిమానులను అలరిస్తున్నాయి. ప్రియమణి, ప్రకాశ్‌రాజ్‌, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

 

‘లూసిఫర్‌’ కోసం మీసం తిప్పుతారా?

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘లూసిఫర్‌’. తెలుగులో చిరంజీవి కీలక పాత్రలో దీన్ని తెరకెక్కించునున్నారు. అందులో మోహల్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రను చిరు పోషించనున్నారు. గతేడాది ‘సైరా’ కోసం మీసం తిప్పిన చిరు, ఇటీవల క్లీన్‌ షేవ్‌తో, ఆ తర్వాత గుండు(మేకప్‌)తో దర్శనమిచ్చి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. మరి ‘లూసిఫర్‌’ పాత్ర ఆహార్యాన్ని తెలుగులోనూ అలాగే కొనసాగించాలంటే చిరు మీసం తిప్పాల్సి ఉంటుంది.

వీరే కాదు, గతంలో ప్రభాస్‌(బాహుబలి), నాని(వి)లతో సహా పలువురు కథానాయకలు పాత్ర డిమాండ్‌ చేసిన ప్రతిసారీ మీసం తిప్పనవాళ్లే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని