యూవీ కంపైలర్‌.. కరోనా కిల్లర్‌...! - UV Device Designed by Siddipet Youngster
close
Published : 26/11/2020 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూవీ కంపైలర్‌.. కరోనా కిల్లర్‌...!


 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా మానవుల జీవన విధానాన్నే మార్చేసింది. మాస్క్‌‌, శానిటైజర్‌ లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితిని తీసుకొచ్చిందీ మహమ్మారి. ఏడాది కాలంగా యావత్‌ ప్రపంచాన్ని వేధిస్తోంది. వైరస్ అంటుతుందేమోనన్న భయంతో వేటినైనా ముట్టుకుంటే చేతులను శుభ్రపరచుకుంటున్నాం. మరి నిత్యం వాడే మెుబైల్‌ ఫోన్‌, పర్సుల్లాంటి వస్తువుల సంగతేంటీ? శుభ్రం చేయాలి కదా! కానీ అందుకోసం కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. మరెలా అంటే ఆ సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందంటున్నాడు ఆ కుర్రాడు. అతి తక్కువ ధరలో వైరస్‌ను అంతం చేసే యూవీ పరికరాన్ని రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు. అతడే భార్గవ్‌.

సిద్దిపేటకు చెందిన అతడు టీఎమ్‌ఆర్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. బయటి నుంచి తీసుకువచ్చే వస్తువులను శుభ్రపరిచే పరికరాలు పెద్దగా అందుబాటులో లేవని, ఉన్నా ధరలు భగ్గుమంటున్నాయని గ్రహించాడు. దాంతో అతి తక్కువ ధరలో ఓ పరికరాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. యువీ కిరణాలకు సూక్ష్మజీవులను అంతమొందించే శక్తి ఉందని తెలిసిన భార్గవ్‌.. దాని ఆధారంగా చేసుకుని ఇంట్లో వాడే వస్తువులతో ‘యూవీ కంపైలర్‌ వైరస్‌ కిల్లర్‌’ ను రూపొందించాడు. చిన్న యూవీలైట్‌, అట్టపెట్టె, రిఫ్లెక్సన్‌ కవర్‌ తదితరాలే ఆ పరికరం తయారీలో వాడాడు. కేవలం రూ. 500 వందలతో దీనిని తయారు చేయవచ్చని చెబుతున్నాడు. ఈ పరికరంలో శుభ్రం చేయాలనుకున్న వస్తువులను అయిదు నుంచి పది నిమిషాలు ఉంచితే చాలంటున్నాడు. గతంలో ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక శానిటైజేషన్‌ పరికరాన్నీ  రూపొందించానని వివరించాడు. సంపాదన కోసం కాకుండా పదిమందికీ ఉపయోగపడాలన్న విధంగా పరికరాలను తయారు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యేలోగా మరిన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని