close

తాజా వార్తలు

Updated : 03/12/2020 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరంగేట్రానికి ఈ సినీ వారసులు రెడీ

సెలబ్రిటీలందు బాలీవుడ్‌ సెలబ్రిటీలు వేరయా.. ఎందుకంటే వాళ్లకు ఉండే క్రేజ్‌ అలాంటిది మరి. వాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా బాగానే ఫాలోయింగ్‌ వచ్చి పడుతుంది. సినిమా తెరపై కాలేజీ కుర్రాళ్లలా కనిపించే హీరో.. హీరోయిన్లకు కాలేజీ చదువు పూర్తి చేసిన వారసులుంటారు. మరి.. కాలేజీ చదువులు పూర్తయ్యాయి.. తర్వాతి అడుగు ఎటువైపు..? అంటే.. బీటౌన్‌వైపే అంటున్నారు చాలామంది. ఇంతకీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వెండితెరకు పరిచయమవడానికి సిద్ధంగా ఉన్న స్టార్‌ వారసులెవరు..? ఓసారి చూద్దామా..

కింగ్‌ఖాన్‌ కూతురు మరి..!

సినిమాల్లోకి రాకముందే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులను సంపాదించుకుంది షారుఖ్‌-గౌరీల గారలపట్టి సుహానాఖాన్‌. డైలీ సీరియల్‌లా రోజుకో ఫొటో పెడుతూ తన బాలీవుడ్‌ ఎంట్రీకి మరెంతో సమయం లేదని చెప్పకనే చెబుతోంది. షారుఖ్‌ సైతం తన కూతుర్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌కు కూడా సుహానాను తీసుకెళ్లారు షారుఖ్‌. ఇదంతా తన కూతుర్ని వెండితెరకు పరిచయం చేసేందుకేనన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఇప్పటికే ‘ది గ్రే పార్ట్‌ ఆఫ్‌ బ్లూ’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించి తండ్రిబాటలో అడుగులు కలిపిందీ చిన్నది. ఆ సినిమాలో నటనతో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ స్టడీస్ కోర్సు పూర్తి చేసింది. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు కొన్ని నాటకాలకు కథలు రాసింది.

మిస్‌ పర్‌ఫెక్ట్‌ డైరెక్టర్‌ కావాలని..

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో మిషాల్‌ అనే కుర్రాడితో కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిపిన ఐరా తాజాగా.. ఆమీర్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ఖాన్‌తో ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అందానికి అందం.. తెలివీ ఉన్న ఈ చిన్నదాని రాక కోసం ఉత్తరాది సినీ అభిమానులు చాన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె యూరిపైడ్స్‌ మెడియా అనే థియేట్రికల్‌ డ్రామాకు దర్శకత్వం వహించింది. ఆ విషయంలో ‘ప్రౌడ్ ఆఫ్‌ యూ’ అంటూ ఆమీర్‌ఖాన్‌ తన కుమార్తెను ఆకాశానికెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. బాలీవుడ్‌లోకి రావాలని వాళ్లు కోరుకుంటే.. వాళ్లంతట వాళ్లే స్వయంగా ఎదగాలని కోరుకుంటానని తన వారసులు బాలీవుడ్‌ ఎంట్రీకి ఇవ్వకనే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు.

షనయా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బన్‌గయా..!

సంజయ్‌కపూర్‌ కూతురు షనయాకపూర్‌. ఇప్పటికే బాలీవుడ్‌ రంగప్రవేశం చేసేసిందండోయ్‌. అయితే.. నటించే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇప్పటికే సినీ ఇండస్డ్రీకి హాయ్‌ చెప్పింది. తన సోదరి జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గుంజన్‌ సక్సేనా’కు ఈ అమ్మడు పనిచేసింది. ఈసారి పెద్ద ప్రాజెక్టు ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ డైరెక్టర్ల సంఖ్య తక్కువగా ఉండే బాలీవుడ్‌లో ఈమె ఎలా రాణిస్తుందోనన్నది ఆసక్తికరం.

ఆఫర్‌ కొట్టేసిన అహాన్‌ పాండే

మరో సెలబ్రిటీ వారసుడు అహాన్ పాండే కూడా బీటౌన్‌లో దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గతేడాది బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అతని సోదరి అనన్యపాండే ఇప్పటికే అరడజను సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసింది. అందులో పూరి-విజయ్‌ దేవరకొండల చిత్రం కూడా ఉంది. ఇదిలా ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న చిక్కీ పాండే వారసుడు అహాన్‌ సైతం ఓ బాలీవుడ్‌ సినిమా కోసం యష్‌రాజ్ ఫిల్మ్‌తో కలిసి పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్‌ కూడా ఓ పాత్ర చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శివ రావెల్ దర్శకత్వం వహించనున్నారు.

తండ్రికి జిరాక్స్‌ కాపీ.. అహన్‌శెట్టి

అహన్‌శెట్టి.. సునీశ్‌శెట్టి కుమారుడు. అచ్చం తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డట్లు కనిపించే అహన్‌లో హీరో లక్షణాలకు కొదవలేదు. తన కుమార్తె అథియాశెట్టిని ఇప్పటికే సినిమాల్లోకి తీసుకొచ్చిన సునీల్‌శెట్టి.. కుమారుడ్ని కూడా బాలీవుడ్‌కు పరిచయం చేసే పనిలో పడ్డారట. అహన్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. తెలుగులో మంచి హిట్‌ కొట్టిన ‘ఆర్‌ఎక్స్‌100’కు హిందీ రీమేక్‌లో అహన్‌ హీరోగా నటిస్తున్నాడు. యూఎస్‌ యూనివర్సిటీలో యాక్టింగ్‌ అండ్‌ ఫిల్మ్ మేకింగ్‌ కోర్సులో డిగ్రీ పూర్తి చేశాడు. సల్మాన్‌ఖాన్‌ని విపరీతంగా అభిమానించే అహన్‌.. గిటార్‌ బాగా వాయిస్తాడు. అంతేకాదు.. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ మనోడికి మంచి పట్టు ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన