ఊర్మిళ ఎమ్మెల్సీగా నామినేట్‌ అవుతున్నారా?  - Urmila Matondkar To Be Nominated As MLC
close
Published : 31/10/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊర్మిళ ఎమ్మెల్సీగా నామినేట్‌ అవుతున్నారా? 

శివసేన నేతలేమంటున్నారు..

ముంబయి: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ మాజీ నేత ఊర్మిళ మతోంద్కర్‌ను శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జూన్‌లో మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్‌ కోటాలోని 12 స్థానాలు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేయాల్సి ఉంది. దీనిపై నిన్న  కేబినెట్‌ భేటీ అయి 12 మంది జాబితాపై చర్చించగా.. ఆ జాబితాలో ఊర్మిళ పేరు కూడా ఉందంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం స్పందించారు. ‘ఊర్మిళను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తుందన్న ఊహాగానాలను నేనూ విన్నాను. అది రాష్ట్ర కేబినెట్‌  హక్కు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే దీనిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపారు. ఈ జాబితాపై గోప్యత పాటిస్తున్నారా? అని రాష్ట్ర మంత్రి అనిల్‌ పరాబ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇందులో రహస్యమేమీ లేదు. మూడు పార్టీల (శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీ) నేతలు జాబితాను ఖరారు చేస్తారు. దాన్ని సీఎంకు సమర్పిస్తారు. ఆయన ఈ జాబితాను గవర్నర్‌కు పంపుతారు’’ అని వివరించారు.

శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన 12 స్థానాలను ప్రభుత్వం సిఫారసు మేరకు పలు రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ నామినేట్‌‌ చేయనున్నారు. అయితే, కూటమి ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు చెరో నలుగురు చొప్పున పేర్లను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఇటీవల ఎన్సీపీలో చేరిన ఏక్‌నాథ్‌ ఖడ్సేతో పాటు శివసేన నేత, మరాఠా నటుడు అదేశ్‌ బండేకర్‌, గాయకుడు ఆనంద్‌ షిండే పేర్లు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముంబయి నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఊర్మిళ ఓటమిపాలయ్యారు. అనంతరం ముంబయి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారశైలి నచ్చకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవల బాలీవుడ్‌ నటి ముంబయిని పీవోకేతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఊర్మిళ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని