Tughlaq durbar movie Review: రివ్యూ: తుగ్లక్‌ దర్బార్‌ - Vijay Sethupathi Tughlaq durbar movie Review
close
Published : 12/09/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tughlaq durbar movie Review: రివ్యూ: తుగ్లక్‌ దర్బార్‌

చిత్రం: తుగ్లక్‌ దర్బార్‌‌; న‌టీన‌టులు: విజయ్‌ సేతుపతి‌, పార్తీబన్‌, రాశీఖన్నా‌, మంజిమా మోహన్‌ త‌దిత‌రులు; ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస‌; సంగీతం: గోవింద్‌ వసంత; కూర్పు: ఆర్‌. గోవిందరాజ్‌‌; నిర్మాణం: సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌; కథ,  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిల్లీ ప్రసాద్‌ దీన్‌దయాళన్‌; విడుద‌ల‌: 10-09-2021‌

విజయ్‌ సేతుపతి సినిమాలను ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా చూస్తారు. అంతగా తను ఎంచుకొనే పాత్రలు, కథలతో ఆ ఎదురుచూపులకు న్యాయం చేస్తాడనే నమ్మకాన్ని ఏర్పరుచుకున్న నటుడాయన. తమిళ నటుడైనప్పటికీ తెలుగునాట ఆయన సినిమాలకు మంచి ఆదరణే ఉంది. ఇటీవలే ‘లాభం’ సినిమాతో పలకరించిన సేతుపతి.. రెండు రోజుల వ్యవధిలోనే ‘తుగ్లక్‌ దర్బార్‌’ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైందీ చిత్రం. మరి మక్కళ్‌ సెల్వన్‌ ఈ సినిమాతో మళ్లీ ఆకట్టుకున్నాడా? లేదా? అనేది తెలుసుకుందాం..

కథేంటంటే: రాయప్ప (పార్తీబన్‌) పేరు మోసిన రాజకీయ నాయకుడు. పార్టీ  ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ మహిళ ప్రసవిస్తుంది. ఆ బిడ్డకు సింహాచలం (విజయ్‌ సేతుపతి) అని రాయప్ప పేరు పెడతాడు. ముద్దుగా సింహం అని పిలుస్తారు. కొన్నాళ్లకు సింహాచలం తల్లి ఆడబిడ్డకు జన్మినిచ్చి కన్నుమూస్తుంది. ఆ బాధలో తాగుడుకు బానిసై తండ్రి కూడా చనిపోతాడు. కన్నతల్లి మరణానికి కారణమైందనే కోపంతో సింహాచలం చెల్లెలితో సరిగా మాట్లాడడు. పార్టీ ప్రచార సభలోనే పుట్టిన సింహాచలానికి రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాయప్పను విపరీతంగా ఆరాధిస్తాడు. అభిమాన నాయకుడి పోస్టర్ల కోసం కన్నతల్లి ముక్కుపుడకను కూడా అమ్మేందుకు వెనకాడడు. అక్రమంగానైనా సరే రాజకీయాల్లో ఎదగాలనుకుంటాడు. ఈ క్రమంలోనే రాయప్పకు దగ్గరై ముఖ్య అనుచరుడిగా నమ్మకాన్ని గెలుచుకుంటాడు. తన అవకాశాలను కాజేస్తున్నాడనే కోపంతో సహ అనుచరుడొకరు మందు సీసాతో సింహాచలం తలపై బలంగా కొడతాడు. అప్పటి నుంచి  స్ప్లిట్‌ పర్సనాలిటీతో వింతగా ప్రవర్తిస్తుంటాడు. రాయప్ప రాజకీయాల్లో పోటీచేసే అవకాశం ఇవ్వడంతో సింహాచలం కార్పొరేటర్‌గా గెలుస్తాడు. అనంతరం తనుండే కాలనీవాసుల భూములను కార్పొరేట్‌ శక్తులకు అమ్మేస్తూ సంతకాలు చేస్తాడు. సింహాచలంలో అంతర్లీనంగా ఉండే మంచి వ్యక్తి బయటకొచ్చి ఆ అక్రమాలకు అడ్డుపడుతుంటాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగా సింహాచలం ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అక్రమంగా ఎదగాలనుకునే సింహాచలం కల తీరిందా? లేక తన ఏరియా ప్రజలను కాపాడుకోవాలనే తనలోనే ఉన్న మరో వ్యక్తి ఆశయం నెరవేరిందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఎలా ఉందంటే: అవినీతి రహిత రాజకీయాలతో ముందుకెళ్తే ప్రజలూ వారికి అండగా నిలబడతారనే కాన్పెప్ట్‌తో తెరకెక్కింది ‘తుగ్లక్‌ దర్బార్‌’. మంచి, చెడు ఇలా రెండు వ్యక్తిత్వాలుండే ఈ స్ప్టిట్‌ పర్సనాలిటీతో రాసుకున్న పాయింట్‌ బాగానే ఉంది. కానీ దాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. రక్తి కట్టించేందుకు కావాల్సినన్ని మలుపులున్నా, వాటిని అనుకూలంగా మార్చుకోలేకపోయాడు. రాయప్పను ఆరాధిస్తూ అతడికి దగ్గరవడం, రాజకీయంగా ఎదిగే క్రమంలో ఏం చేశాడనే సన్నివేశాలతో మొదటి అర్ధభాగం సాగుతుంది. భగవతి పెరుమాళ్‌తో వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. సింహాచలంలోని మంచి వ్యక్తి బయటకొచ్చి  అక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలతో రెండో అర్థభాగం కొనసాగుతుంది. అయితే స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉందని తెలిసిన తర్వాత అద్భుతమైన సన్నివేశాలు పడతాయేమో అని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. ముగింపు కూడా ఊహకందేదే. సిస్టర్‌ సెంటిమెంట్‌ అంతంత మాత్రమే. చెల్లెలితో యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే ‘ఇదంతా సాధారణం, మనమే సర్దుకుపోవాలి’ అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక సొంత చెల్లెలిని కిడ్నాప్‌ చేసి డబ్బు తీసుకోవాలనుకోవడం మరో వింత. ఇలాంటి సన్నివేశాలతో సినిమా అంతా నిస్సారంగా సాగిపోతుంది. రాశిఖన్నాతో వచ్చే లవ్‌ట్రాక్‌ కూడా మెప్పించదు. రాజకీయ నేపథ్యంలో మంచి సినిమాగా రూపుదిద్దే అవకాశాలున్నా చివరకు యావరేజిగా మిగిలిపోయింది.

 

ఎవరెలా చేశారంటే: విజయ్‌ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమానంతా ఆయన భుజాల మీదే మోసుకొచ్చాడు. స్ప్లిట్‌ పర్సనాలిటీతో బాధపడే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. కరుణాకరణ్‌, భగవతి పెరుమాళ్‌లతో వచ్చే కామెడీ సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేశాడు. రాయప్పగా పార్తీబన్‌ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. రాశిఖన్నాకు అంతగా ప్రాధాన్యం లభించలేదు. పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఇక చెల్లెలిగా మంజిమా మోహన్‌ చక్కగా నటించింది. కానీ ఆమెకు బలమైన సన్నివేశాలు పడలేదు. సేతుపతి, మంజిమా మోహన్‌ మధ్య వచ్చే సీన్లను మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. ముగింపు కూడా ఆశాజనకంగా ఉండదు. మిగతా నటీనటులు పరిధి మేర నటించారు. గోవింద్‌ వసంత అందించిన సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే ఉన్నా, చెప్పుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది.
బలాలు
విజయ్‌ సేతుపతి 

కామెడీ సన్నివేశాలు

సాంకేతిక బృందం పనితీరు

-బలహీనతలు
స్ర్కీన్‌ప్లే
లవ్‌ట్రాక్

చివరగా: ఇదో యావరేజ్‌ దర్బార్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని