పేద దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్ ‌బీమా.. - WHO announces COVID Vaccine Insurance Scheme
close
Updated : 30/10/2020 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేద దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్ ‌బీమా..

92 దేశాల ప్రజలకు రక్షణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ

బ్రస్సెల్స్: కొవిడ్‌ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే.. వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఓ కొవిడ్ బీమా పథకాన్ని ప్రకటించారు. ఇందుకుగాను ‘కోవాక్స్’‌ ప్రమోటర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ‘గావి’ సంయుక్తంగా ఓ సహాయక నిధిని ఏర్పాటు చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో కోవాక్స్‌ కూటమి ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ వాడకంపై భయాలు, సందేహాలను తొలగించేందుకే బీమా పథకాన్ని చేపట్టినట్టు కోవాక్స్‌ వివరించింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి పర్యవేక్షించనున్నాయి.

దేశాలపై ఆర్థిక భారం పడకుండా..

తొలి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డిసెంబర్‌ నాటికి సిద్ధం కాగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. వచ్చే సంవత్సరాంతం లోగా రెండు వందల కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీకి కోవాక్స్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బీమా పథకం వల్ల ఆఫ్రికా, ఆగ్నేయాసియాల్లో ఉన్న 92 అల్పాదాయ దేశాల ప్రజలకు రక్షణ లభించనుంది. కరోనా వ్యాక్సిన్‌ వాడటం వల్ల అనుకోని దుష్ప్రభావాలు సంభవించినపుడు వైద్య సహాయం కోసం ఆయా ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడకుండా ఈ ఏర్పాటు ఉపకరిస్తుందని ప్రతినిధులు వివరించారు. ఈ పథకం ద్వారా ఆయా దేశాలకు జులై, 2022 వరకు కోవాక్స్‌ బీమా రక్షణ లభించనుంది. అయితే ఈ కరోనా బీమా సదుపాయం కేవలం పేద దేశాలకు మాత్రమేనని, మధ్య తరహా దేశాలకు వర్తించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీదారులే భరించాల్సిన ఈ బాధ్యతను.. వారు సానుకూలంగా స్పందించకపోవటంతో తాము నిర్వహిస్తున్నట్టు కోవాక్స్‌ వివరించింది. బాధితులు వైద్య సహాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా వారికి త్వరగా ఉపశమనం అందేలా ఈ బీమా పథకం ఉపకరిస్తుందని సంస్థ తెలిపింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని