టీకా వేయించుకున్నా మాస్క్‌ తప్పదా! - Wearing Mask Must even if you Take Vaccine
close
Published : 23/12/2020 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా వేయించుకున్నా మాస్క్‌ తప్పదా!


 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కొవిడ్‌ టీకాను కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రారంభించారు. రేపోమాపో మన దగ్గరా అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకుంటే కరోనా ప్రమాదం తొలగిపోయినట్టేనని, ఇకపై మాస్కు ధరించాల్సిన పనుండదని, భౌతిక దూరం పాటించాల్సిన అవసరమూ లేదని చాలామంది భావిస్తుంటారు. అయితే టీకా తీసుకున్నప్పటికీ కొంతకాలం వరకు మాస్క్‌ ధరించటం, భౌతికదూరం పాటించటం తప్పనిసరి అంటున్నారు అమెరికా పరిశోధకులు. 

ఉదాహరణకు తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకా విషయానికి వస్తే... దీన్ని వేయించుకున్నాక 3 వారాల తరువాత రెండో మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మోడెర్నా రూపొందించిన టీకా విషయంలోనైతే 4 వారాల అనంతరం రెండో మోతాదు అవసరమవుతుంది. మొదటి టీకా తీసుకున్నాక ఎంతో కొంత రక్షణ లభించటం నిజమే కావొచ్చు. కానీ రెండో మోతాదు తీసుకున్నాకే మనం పూర్తి భరోసాతో ఉండొచ్చు. 

అంతేకాదు.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఇన్ఫెక్షన్‌ రాకుండా కాపాడతాయా? కేవలం లక్షణాలు తగ్గటానికే తోడ్పడతాయా? అన్నది ప్రస్తుతానికి తెలియదు. అంటే టీకా తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్‌ బారినపడే అవకాశం ఉంది. ఒకింత తక్కువ స్థాయిలోనే అయినా వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పంపిణీ మొదలైనా కోట్లాది టీకాలను సరఫరా చేయటానికి నెలలు పడుతుంది. మరోవైపు పిల్లలపై కొవిడ్‌ టీకా ప్రయోగ పరీక్షలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇవి సురక్షితంగా సమర్థంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైతే గానీ పిల్లలకు ఇవ్వటం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అందువల్ల టీకాతో గానీ.. సహజంగా గానీ..ఎక్కువమంది రోగనిరోధక శక్తిని సంతరించుకునే వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని