వైట్‌హౌస్‌ ఓ భూతాల కొంప: పూరీ - White House is Haunted house says puri in his Puri Musings
close
Updated : 21/11/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైట్‌హౌస్‌ ఓ భూతాల కొంప: పూరీ

అందుకే.. ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉండలేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్‌హౌస్‌(శ్వేత సౌధం) ఓ భూతాల కొంప అని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ట్రంప్‌ కూడా ఆ భవనంలో ఉండేందుకు ఇష్టపడలేదని అన్నారు. ఒకవేళ మీరు అమెరికా అధ్యక్షులైతే ఆ భవనంలో మాత్రం ఉండొద్దని సూచిస్తున్నారు. ‘పూరీ మ్యూజింగ్స్‌లో’ భాగంగా ఆయన వైట్‌హౌస్‌ కష్టాలపై మాట్లాడారు.
‘‘మీరు కానీ.. అమెరికా అధ్యక్షులు అయితే మీకు వైట్‌హౌస్‌ ఇస్తారు. జీతం సంవత్సరానికి 4లక్షల డాలర్లు. మన ఇండియాలో సంవత్సరానికి దాదాపు రూ.3కోట్లన్నమాట. ఇతర ఖర్చుల కోసం రూ.50వేలు ఇస్తారు. పదవి తర్వాత 2లక్షల డాలర్ల చొప్పున జీవితాంతం పెన్షన్‌ ఇస్తారు. వైట్‌ హౌజ్‌ అనేది చాలా పెద్ద భవనం. 130 గదులు ఉంటాయి. 55,000 స్క్వేర్‌ఫీట్‌ కన్‌స్ట్రక్షన్‌. అధ్యక్షుడికి రెండో అంతస్తు కేటాయిస్తారు. పడకగదిని మీకు ఇష్టం వచ్చినట్లు అలంకరించుకోవచ్చు. కానీ.. అక్కడ ఉండే పురాతన సామగ్రిని మాత్రం ముట్టుకోకూడదు. కావాలంటే కర్టన్లులాంటివి మార్చుకోవచ్చు. అక్కడకు మారినప్పుడు మీపాత సామాన్లు మీరే ట్రక్కులో తెచ్చుకోవాలి. ప్రభుత్వం బాధ్యత వహించదు. ఐదుగురు వంటమనుషులు ఉంటారు. మీకు ఏది కావాలంటే అది వండి పెడతారు. కాకపోతే.. భోజన ఖర్చు జీతం నుంచి మీరే చెల్లించాలి. 140మందికి సరిపోయే పార్టీ ప్లేస్‌ కూడా ఉంటుంది. మీ స్నేహితులో పెద్దపెద్ద పార్టీలు చేసుకోవచ్చు. బిల్లు మీరే చెల్లించాలి. భోజనం మాత్రమే కాదు. మీ బట్టలు డ్రైక్లీనింగ్‌కు.. ఆఖరికి టూత్‌పేస్టు, సబ్బు, ఇతర సామగ్రి కూడా మీ జీతం నుంచే భరించాలి. ఒక జాగింగ్‌ ట్రాక్‌, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, ఒక థియేటర్‌ ఉంటాయి. అధ్యక్షుడు కానీ, ప్రథమ మహిళ కానీ ఏ ఒక్క కిటికీ తెరవడానికి వీలులేదు. ఎన్నేళ్లు అక్కడ ఉన్నా ఏసీ గదిలోనే ఉండాలి. భద్రత కారణాలు అందుకు కారణం’’ అని పూరీ పేర్కొన్నారు.
‘‘ఇప్పటి వరకూ వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్లు, ప్రథమ మహిళలు కలిపి 10మంది చనిపోయారు. వాళ్ల ఆత్మలు ఆక్కడే ఉన్నాయట అందుకే దాన్ని భూతాల కొంప అంటారు. ఒక అధ్యక్షుడు బాత్రూమ్‌లో స్నానం చేసి బయటికి వస్తుంటే ‘గుడ్‌మార్నింగ్‌ ప్రెసిడెంట్‌’ అని మాట వినిపించిందట. ఎవరా అని చూస్తే.. అబ్రహం లింకన్‌ ఆత్మ కనిపించిందని అంటుంటారు. అయితే.. నిజానికి అబ్రహం లింకన్‌ ఆత్మ అక్కడ ఉండదట. అతని 11ఏళ్ల కొడుకు ఆ వైట్‌హౌస్‌లోనే చనిపోయాడట. ఆ కొడుకును చూసుకోవడానికి అప్పుడప్పుడు అబ్రహం లింకన్‌ ఆత్మ వస్తుంటుందని అక్కడ అందరూ చెప్తుంటారు. రాత్రుళ్లు అక్కడ ఎన్నో వింత శబ్దాలు వినిపిస్తున్నాయయని చాలామంది ప్రథమమహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. ఎవరో వయోలిన్‌ వాయిస్తున్నట్లు.. ఇంకెవరో గట్టిగా అరుస్తున్నట్లు ఉంటాయట. అక్కడ ఇలాంటావి ఉంటాయని తెలిసే.. డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉండలేదు. వైట్‌హౌస్‌లో ఉన్న మొదటి అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌. ఆ సమయంలో అక్కడ సిబ్బంది కూడా లేరట. ఆయనే స్వయంగా నియమించుకొని వాళ్లకు జీతాలు ఇచ్చారట. ఒకసారి బరాక్‌ ఒబామాకు చేపలకూర వండిపెట్టి.. ‘ఎలా ఉంది సర్‌..?’ అని వంటమనిషి అడిగాట. చాలా బాగుందని ఒబామా చెప్పడంతో.. రెండో రోజు ఇంకో చేప పెట్టాడట. మిచెల్‌ ఒబామ నెలాఖరున బిల్లు చూస్తే.. ఒక్కో చేపకు 50,000 అని రాసి ఉందట. షాక్‌కు గురైన ఆమె.. ‘ఒక చేపకు ఇంత ధరేంటి..?’ అని అడిగితే.. ‘ఆ చేపను జపాన్‌ నుంచి తెప్పించాను’ అని వంటమనిషి చెప్పాడట. అయితే.. ‘ఆ విషయం తినే ముందు చెప్పాలి కదా, ఇష్టం వచ్చినట్లు బిల్లు వేస్తే ఎలా’ అని ఆమె విసుక్కుందట. చివరికి వైట్‌హౌస్‌ వదిలేసి వాళ్లింటికి వెళ్లాక ‘ఇప్పుడు మేం మా ఇంటికి కిటికీలు తెరవగలుగుతున్నాం.. నేను మా ఆయన చల్లని గాలి పీల్చగలుగుతున్నాం.. మా కర్టన్లు ఎగరడం చూడగలుగుతున్నాం’ అని మిచెల్‌ ఒబామ తన పుస్తకంలో రాశారు’ అని పూరీ వైట్‌హౌస్‌ గురించి చెప్పుకొచ్చారు.
‘ఇది వైట్‌హౌస్‌ కష్టాలు. అద్దె లేకుండా ఇల్లు ఇస్తారు.. కానీ బిల్లు మాత్రం వాచిపోతుంది. మీరు కానీ అమెరికా ప్రెసిడెంట్‌ అయితే దయచేసి ఆ భూతాల కొంపలో ఉండొద్దు. దగ్గర్లో రూమ్‌ అద్దెకు తీసుకొని ఉండండి. 7స్టార్‌ రేటింగ్‌ అక్కడ. జీతం మొత్తం ఖర్చయిపోయి.. మీ చేతికి చిల్లి గవ్వకూడా రాదు’ అంటూ పూరీ తన విశ్లేషణ ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని