‘‘బ్రూస్‌లీ గురించి చాలామందికి తెలియని విషయం’’ - about BRUCE LEE by Puri Jagannadh
close
Published : 17/11/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘బ్రూస్‌లీ గురించి చాలామందికి తెలియని విషయం’’


ఇంటర్నెట్‌ డెస్క్‌ : బ్రూస్‌లీ బహుశా ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో! చాలామందికి అతడు మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్నవాడిగానే తెలుసు. కానీ అతడిలో ఎవరికీ తెలియని మరో నైపుణ్యమూ ఉండేదంటున్నారు మన పూరీ..! తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో భాగంగా ఈసారి బ్రూస్‌లీ గురించి అతడి గొప్పతనం గురించి మాట్లాడారు. ఆ విషయాలన్నీ పూరీ మాటల్లోనే మీరు చదివేయండి...

‘‘చైనీస్‌ జోడియాక్‌ ప్రకారం.. పుట్టిన గడియా, సంవత్సరం రెండూ డ్రాగన్‌ ఉన్న బిడ్డ మహర్జాతకుడు అవుతాడు. ఈ విషయాన్ని చైనీయులు బాగా నమ్ముతారు. సరిగ్గా అదేరీతిలో డ్రాగన్‌ లాంటి కుర్రాడు శాన్‌ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. వాడే బ్రూస్‌లీ. బ్రూస్‌ అనే పేరు అక్కడున్న నర్స్‌ పెట్టింది. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ గాయకులు. వారి కుటుంబం కొంతకాలానికి హాంకాంగ్‌కు మకాం మార్చింది. పదమూడేళ్ల వయసుకే చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇరవై సినిమాల్లో చేశాడు బ్రూస్‌లీ. యీప్‌ మ్యాన్‌ దగ్గర కుంగ్‌పూ నేర్చుకున్నాడు. ఇంటర్‌ స్కూల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ కొట్టాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటుంది అదేంటంటే అతడో అద్భుతమైన డ్యాన్సర్‌. 18 ఏళ్ల వయసులో హాంకాంగ్‌ చా చా ఛాంపియన్‌ షిప్‌ గెలిచాడు. సినీరంగం విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడికి లభించలేదు. దాంతో 100 డాలర్లు దొరకగానే అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్‌పూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు’’ 

‘‘చైనాయేతరులకు కుంగ్‌ పూ నేర్పిస్తున్నాడని కొంతమంది అతడిపై దాడికి యత్నించారు. తాను ఓడితే ఇక కుంగ్‌పూ జోలికి వెళ్లనని  వారికి ఛాలెంజ్‌ విసిరాడు మన హీరో. సెకన్ల వ్యవధిలో వారందరినీ మట్టికరిపించాడు. ఆ తరువాత సొంతంగా ఓ మార్షల్‌ ఆర్ట్‌ కనిపెట్టాడు. వన్‌ ఇంచ్‌ పంచ్‌ను ఆవిష్కరించాడు. ఫిలాసఫీ టీచర్‌గా పనిచేస్తూ లిండా అనే విద్యార్థిని పెళ్లిచేసుకున్నాడు. వారికో కుమారుడు పుట్టాడు. అతడి పేరు బ్రాండన్‌ లీ. కుటుంబాన్ని పోషించటం కోసం చిన్నచిన్న టీవీ సీరియళ్లలో, మూవీస్‌లో రోల్స్‌ చేశాడు బ్రూస్‌లీ. ఆ తరువాత హాంకాంగ్‌లోని ఓ ప్రొడ్యూసర్‌ సాయంతో ఓ సినిమా తీశాడు. అదే ద బిగ్‌ బాస్‌.అప్పట్లో అది బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. తర్వాత ద గేమ్‌ ఆఫ్‌ డెత్‌ మూవీ తీశాడు. ఆ సినిమాతో హాంకాంగ్‌ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోయింది. ఆ తరువాత ఎంటర్‌ ది డ్రాగన్‌. సినిమా పూర్తైపోయింది అప్పటికే. కానీ..ఒకరోజు తలనొప్పి వచ్చిందని పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్‌ తీసుకుని కోమాలోకి వెళ్లి మరణించాడు బ్రూస్‌లీ’’

‘‘ లీ చెప్పిన ఓ మాటంటే నాకు చాలా ఇష్టం. దేవుడిని ఎప్పుడూ సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఇవ్వమని కోరుకోవద్దు. తను పెట్టే కష్టాలను తట్టుకునే శక్తినివ్వమని అడగాలి. మీకు తెలుసా ప్రపంచంలో మిక్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రారంభించింది లీనే. అతడి కంటే గొప్ప ఫైటర్లు చాలామందే ఉండొచ్చు. కానీ ప్రతిఒక్కరికీ అతడే స్ఫూర్తి. కొట్టే ప్రతి పంచ్‌ వెనుక ఓ థియరీ చెబుతాడు. అతడిలోని ఫిలాసఫీకి అందరూ ఫిదా అవుతారు. అతిచిన్న వయసులో 32 ఏళ్లకే బ్రూస్‌లీ మరణించాడు. అతడి జీవితం మొత్తంలో చేసిన పని చాలా తక్కువ. అయినా ప్రపంచంలోని ప్రతీ చిన్న పల్లెలోనూ బ్రూస్‌లీ పేరు తెలుసు. అదే అతడు చూపించిన ప్రభావం.  నీరు కప్‌లో పోస్తే కప్‌ ఆకారం పొందుతుంది. బాటిల్‌లో పోస్తే దాని ఆకారంలో కనిపిస్తుంది. అలా ఏ వస్తువులో పోస్తే ఆకారంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ నీరు మాదిరిగా ఉండాలి’’ అని వివరించారు పూరీ...



 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని