Corona: ఆకలి మంటలకేం తెలుసు..ఈ ‘దూరం’ గురించి..! - after 8 day walk migrant woman admitted to hospital
close
Updated : 29/07/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఆకలి మంటలకేం తెలుసు..ఈ ‘దూరం’ గురించి..!

సొంతూరుకు వెళ్లేందుకు 8రోజులు నడిచి ఆస్పత్రి పాలైన ఓ జంట

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: కరోనా విలయతాండవం చేస్తోంది. కానీ దానికేం తెలుసు ఆకలిబాధలు.. నిరుద్యోగి కష్టాలు. అందుకే వీటిని తప్పించుకొని సొంతూరిలో అయినా ఒక ముద్ద తిని, అయిన వాళ్ల మధ్య ఉందామని బయలుదేరితే.. దూరం వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. కడుపు కాల్చుకొని, కంటి నిండా నిద్ర లేక ఏకధాటిగా ఎనిమిది రోజులపాటు నడిచి ఆస్పత్రి కావాల్సివచ్చింది. ఇదంతా దేశరాజధాని దిల్లీలో కరోనాతో ఉపాధి కోల్పోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంట కథ. 

భోపాల్‌కు చెందిన రమేశ్(40), అతడి భార్య(38) దిల్లీలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మొదటి దశ లాక్‌డౌన్ సమయంలో పనిలేకపోయినా.. వారు పనిచేస్తోన్న సంస్థలోని సూపర్‌వైజర్ ఆర్థికంగా సహాయం చేశారు. మళ్లీ ఉపాధి దొరికేందుకు సహకరించారని రమేశ్ వెల్లడించారు. రెండో దశలో కరోనాకు ఆ సూపర్‌వైజర్ మరణించడంతో వీరికి దిక్కుతోచలేదు. ‘మా యజమాని మాకు పని ఇవ్వకపోగా, మాకు చెల్లించాల్సిన పైకం కూడా ఇవ్వలేదు. మా దగ్గర ఉన్న కొద్దిమొత్తం కూడా వెంటనే కరిగిపోయింది. దాంతో మేం భోపాల్‌కు దగ్గర్లోని మా గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. 

ఆ వెంటనే నడుచుకుంటూ సొంతూరికి పయనమయ్యారు. మధ్యమధ్యలో స్థానికులు పెట్టేదాంతోనే పొట్టపోసుకున్నారు. సరిగా తిండి, విశ్రాంతి లేకపోవడంతో మథుర దగ్గరికి వచ్చేసరికి రమేశ్ భార్య అస్వస్థతకు గురయ్యారు. అప్పటికే వారు ప్రయాణమై ఎనిమిది రోజులు కావడంతో ఇక ఆగ్రా దగ్గరికి వచ్చేసరికి ఆమె అనారోగ్యం మరింత ఎక్కువైంది. కడుపునొప్పి తీవ్రంగా వేధించింది. దాంతో స్థానికుల సలహాతో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా.. అత్యవసర చికిత్సకు డబ్బులు అడగడంతో వెనక్కి వచ్చేశారు. కానీ, స్థానికుల సహకారంతో రమేశ్‌ ఆమెను ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. మళ్లీ ఆమె ఆరోగ్యం కుదుటపడగానే తమ నడక ప్రారంభమవుతుందని వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంగా కరోనా ఎంతోమంది జీవితాల్లో ఇలా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. అందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే మూడోముప్పు ఎదుర్కొనేందుకు కొవిడ్ నిబంధనలను తప్పకపాటించాలని ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని