Corona: టీ20 ప్రపంచకప్‌ పక్కకెళ్లిపోయినట్టేనా - after ipl postponement t20 world cup set for uae shift with 3rd wave expected in nov
close
Updated : 04/05/2021 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: టీ20 ప్రపంచకప్‌ పక్కకెళ్లిపోయినట్టేనా

యూఏఈకి తరలించే యోచనలో బీసీసీఐ!

దిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నుంచి యూఏఈకి తరలించడం ఇక ఖాయమే! బీసీసీఐ సైతం ఇందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్‌ ఉంటుందని నిపుణుల అంచనా. అలాంటప్పుడు భారత్‌కు రావడానికి, ఆడటానికి భాగస్వామ్య దేశాలు నిరాకరిస్తాయని బోర్డు భావిస్తోంది. టోర్నీకి మరికొన్ని నెలల సమయం ఉండటంతో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఆటగాళ్లకు కరోనా వైరస్‌ సోకడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు 16 జట్లు ఆడే ప్రపంచకప్‌ నిర్వహణ కత్తిమీద సామేనన్నది బోర్డు ఆలోచనగా కనిపిస్తోంది. ఎలాంటి రిస్క్‌ తీసుకోవద్దని అనుకుంటోంది. అందుకే మెగా టోర్నీని యూఏఈకి తరలించేందుకు ఇప్పటికే బోర్డు పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారని వినికిడి. ప్రభుత్వం సైతం ఇందుకు అంగీకరించిందనే సమాచారం.

‘నాలుగు వారాల్లోనే ఐపీఎల్‌ను వాయిదా వేయడం అంతర్జాతీయ మెగాటోర్నీ నిర్వహణకు సురక్షితం కాదన్న సంకేతాలు పంపించింది. దేశం గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య విపత్తును చవిచూస్తోంది. నవంబర్లో భారత్‌లో మూడో వేవ్‌ ఉంటుందని అంచనా. ఆతిథ్యం బీసీసీఐదే అయినప్పటికీ టోర్నీని యూఏఈకి తరలించాలన్నది ఆలోచన’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు వస్తుండటంతో ఐసీసీ సహా సభ్య దేశాలు అంతర్జాతీయ జట్ల క్షేమాన్ని రిస్క్‌లో పెట్టకూడదని భావిస్తున్నాయి. ‘మనమెంత హామీ ఇచ్చినా సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా కనీసం ఆరు నెలలు భారత్‌కు వచ్చేందుకు అత్యున్నత క్రికెట్‌ దేశాలు అంగీకరించవు. ఇక్కడికి ప్రయాణించేందుకు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతారు. అందుకే యూఏఈకి తరలించేందుకు బీసీసీఐ అభ్యంతరం తెెలపదని అంచనా’ అని బోర్డు మరో అధికారి అన్నారు. 

ఐపీఎల్‌ వాయిదా పడటంతో బీసీసీఐ పెద్దలు ఇకపై సాహసాలు చేసేందుకు వెనుకాడే పరిస్థితి నెలకొందని ఆ అధికారి పేర్కొన్నారు. ‘భారత్‌ సురక్షితమేనని ఐపీఎల్‌ ద్వారా ప్రపంచకప్‌ దేశాలకు నిరూపించాలని బోర్డు భావించింది. నాలుగు వారాలు బాగానే గడిచింది. కానీ ఇప్పుడు బుడగ బలహీనమైంది. అక్టోబర్‌-నవంబర్లోనూ ఇలా జరగదని గ్యారంటీ ఏంటి? ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి’ అని వారు ప్రశ్నించారు.

యూఏఈలో నిర్వహించేందుకు ప్రధాన కారణాలు అక్కడ విమాన ప్రయాణాలు అవసరం లేకపోవడం, వేదికలు సైతం మూడేనని మరొకరు తెలిపారు. ‘గతేడాది మూడు వేదికల్లో విజయవంతంగా ఐపీఎల్‌ నిర్వహించారు. అలాంటప్పుడు ఆరు వేదికల్లో నిర్వహించడం ఎప్పటికైనా ప్రమాదమే. యూఏఈలో ఆది నుంచి ఆఖరి వరకు అంతాా బయో బుడగల్లోనే ఉన్నారు. బుడగ నుంచి మరో బుడగకు వెళ్లినప్పుడే ఇక్కడ కేసులు వచ్చాయి. అక్టోబర్లో మెగా టోర్నీ వేదికలను 9 నుంచి 5 తగ్గించినా విమాన ప్రయాణాలు చేయాల్సిందే.  పైగా ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరినప్పుడే ఆటగాళ్లు మానసికంగా బాగుంటారు. ఏదేమైనా జూన్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని