చిన్నమ్మతో ఫోన్‌.. 16 మందిపై వేటు   - aiadmk expells 16 members who interacted with sasikala
close
Published : 15/06/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నమ్మతో ఫోన్‌.. 16 మందిపై వేటు 

చెన్నై: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళతో పార్టీ సభ్యులు కొందరు ఫోన్లో మంతనాలు జరపడంపై పార్టీ హైకమాండ్‌ ఆగ్రహించింది. చిన్నమ్మతో ఫోన్లో సంభాషించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగానూ వారిపై కఠిన చర్యలు తీసుకుంది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వి. పుగళెంది సహా 16 మంది నేతలపై బహిష్కరణ వేటు వేసింది. ‘‘పార్టీ కేడర్‌తో శశికళ ఫోన్‌ సంభాషణ అంతా ఓ డ్రామా. ఓ కుటుంబం తమ కోరికల కోసం పార్టీని నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు’’ అని అన్నాడీఎంకే ఓ ప్రకటనలో పేర్కొంది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన శశికళ.. ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు, నేతలతో ఆమె ఇటీవల ఫోన్‌లో మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది.  ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను’ అని శశికళ చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. దీనికి జవాబుగా.. ‘మీ వెనకే మేముంటాం అమ్మా’ అని కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని టీటీవీ దినకరన్‌ వ్యక్తిగత సిబ్బంది కూడా ధ్రువీకరించారు. అయితే ఈ వార్తలను ముందు తోసిపుచ్చిన అన్నాడీఎంకే ఇప్పుడు పార్టీ నేతలపై బహిష్కరణ వేటు వేయడం గమనార్హం.

ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు శశికళ జైలు నుంచి విడుదలైనప్పటికీ.. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు.

అయితే ఇటీవల అన్నాడీఎంకేలో బలమైన నాయకత్వం లేకపోవడం, పన్నీర్‌ సెల్వం, పళనిస్వామిల మధ్య విభేదాలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ  పరాభవం చూడటంతో శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెచ్చేందుకు మళ్లీ పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని