‘ఆర్‌ఆర్ఆర్‌’లో తెలుగు కథానాయిక? - aishwarya rajesh key role in Rajmouli RRR
close
Published : 03/11/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్ఆర్‌’లో తెలుగు కథానాయిక?

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తెలుగు కథానాయికను ఇందులో కీలక పాత్రకు అనుకుంటున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యారాజేశ్‌ ఇప్పుడీ ట్రెండీ ప్రాజెక్టులో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియాభట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు జోడీగా, మరో కథానాయికగా ఐశ్వర్యారాజేశ్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తారక్‌కు జోడీగా మరో హీరోయిన్‌కు అవకాశం ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భీమ్‌ను ప్రేమించే గిరిజన యువతి పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర నిడివి తక్కువైనా ఎంతో కీలకమని సమాచారం. అలాంటి బరువైన పాత్రకు ఎవరు సరిపోతారా? అని చిత్ర బృందం అన్వేషిస్తుండగా, తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్‌ పేరు తెరమీదకు వచ్చింది.

నటనలో తొలి అడుగు వేసినప్పటి నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటూ తనని తాను నిరూపించుకుంది. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ అవకాశం ఇచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర బృందం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ‘రెండు జళ్ల సీత’ సినిమా కథానాయకుల్లో ఒకరైన రాజేశ్‌ తనయ ఐశ్వర్య రాజేశ్‌‌. ‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన రామ్‌, భీమ్‌ టీజర్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని