avasarala srinivas: స్క్రిప్ట్‌ రాస్తుంటే డైలాగ్స్‌ ఆయన గొంతులో వినిపిస్తాయి! - alitho saradaga latest episode with avasarala srinivas
close
Updated : 09/09/2021 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

avasarala srinivas: స్క్రిప్ట్‌ రాస్తుంటే డైలాగ్స్‌ ఆయన గొంతులో వినిపిస్తాయి!

‘అష్టాచమ్మా’తో తెలుగు తెరకు పరిచయమైన ఆజానుబాహుడు.. హీరో, సహ నటుడు, రచయిత, డైరెక్టర్‌ ఇలా ఎందులోనైనా తన మార్క్‌ ప్రతిభను చూపిస్తూ,  విభిన్న పాత్రలు, సినిమాలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్‌. తాజాగా మరోసారి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ‘ఆలీతో సరదాగా కార్యక్రమం’లో ఆయన పంచుకున్న విశేషాలు మీకోసం.  

మీ హైట్‌ నీకు ప్లస్సా? మైనస్సా?

అవసరాల శ్రీనివాస్‌: ప్రయాణాల్లో మాత్రమే మైనస్‌. సీట్‌లో కాళ్లు సరిపోవు, ట్రైన్‌లో బెర్తు సరిపోదు. నడక మాత్రం వేగంగా ఉంటుంది. 

ఏదైనా లవ్‌స్టోరీ ఉందా?

అవసరాల శ్రీనివాస్‌: ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. కాలేజీ టైంలో ఉంది. నేను పుట్టింది కాకినాడ. నాన్న ఆంధ్రాబ్యాంక్‌లో డీజీఎమ్‌గా రిటైర్‌ అయ్యారు. హైదరాబాద్‌, కాకినాడ, వైజాగ్‌ ఇలా ఆయనకు ఎప్పుడూ బదిలీలు అవుతుండేవి.  వైజాగ్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత అమెరికా వెళ్లా. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశాను. నాన్న ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. నాకో అన్నయ్య. అమెరికాలో స్థిరపడ్డాడు.

అమెరికా నుంచి ఎందుకొచ్చావు?

అవసరాల శ్రీనివాస్‌: నాకు సినిమాలు బాగా ఆసక్తి. చూడటంతో మొదలై.. తీయడం, చేయడం దాకా వచ్చింది. ‘అష్టాచమ్మా’ చిత్రానికి ఎంపికవడంతో ఇండియాకొచ్చాను. ఆ సినిమా షూటింగ్‌ అయ్యాక వెంటనే అమెరికా వెళ్లి నా జాబ్‌లో చేరిపోయా. అక్కడ మిగిలిపోయిన కొన్ని పనులు పూర్తి చేసుకొని, రెండేళ్ల తర్వాత తిరిగొచ్చి, వంశీ గారితో ‘సరదాగా కాసేపు’ చేశాను. 

ఏం ధైర్యంతో వచ్చావు? ఏం సాధించావు?

అవసరాల శ్రీనివాస్‌: సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా తీయడం సాధ్యంకాదని ఎవరూ చెప్పినా వినలేదు. బహుశా వాళ్ల మాటలు వినుంటే వచ్చేవాడిని కాదేమో.

నీది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా?

అవసరాల శ్రీనివాస్‌: రెండు కాదు సర్‌. సినిమా అంటే ఇష్టం. ఏమీ తెలియదని తెలుసు. ఏదైనా తెలుస్తుందని కూడా తెలుసు.

ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఈ నిర్ణయం మంచిదా? కాదా? అని ఎవరినైనా అడిగావా?

అవసరాల శ్రీనివాస్‌: ‘అష్టాచమ్మా’ ట్రైలర్‌ వచ్చేదాకా అమ్మానాన్నలకు నేను సినిమా చేసినట్లు  తెలియదు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే అమెరికా వెళ్లిపోయా. ఆ చిత్రం విడుదలయ్యాక నాన్న ఫోన్‌ చేశారు. చేస్తే చేశావు కానీ, మళ్లీ చేయకు అన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సమయంలో మాత్రం కార్లో వెళుతున్నప్పుడు ‘మంచి నిర్ణయం తీసుకున్నావురా’ అని వెనక నుంచి చెవిలో మెల్లిగా చెప్పారు.

ఈ సినిమా చూసిన తర్వాత ఆయన భుజం తడతారనే నమ్మకముందా?

అవసరాల శ్రీనివాస్‌: సినిమాల గురించి మేం ఇంట్లో మాట్లాడుకోం. నేను చేస్తున్న పనిపట్ల వాళ్లు సంతోషంగానే ఉన్నారని నాకు తెలుసు. నేను కూడా సినిమాల్లో ఆనందంగా ఉన్నానని వాళ్లకూ తెలుసు.

ఏం అవుదామని సినిమాల్లోకి వచ్చావు?

అవసరాల శ్రీనివాస్‌: చిన్నతనంలో సినిమాలు చూసినప్పుడు అందులో నటీనటులు మాత్రమే ఉంటారని అనుకునే వాడిని. నేను ఎదుగుతున్న క్రమంలో సినిమా వెనక రచయితలు, దర్శకులు ఇలా చాలా మంది ఉంటారని తెలిసొచ్చింది. ఇలా నేను ఎదిగే కొద్దీ నా ఆసక్తి రచనవైపు మళ్లింది.

ఎవరి నుంచైనా స్ఫూర్తి పొందారా?

అవసరాల శ్రీనివాస్‌: నాకు ముళ్లపూడి వెంకట రమణ రచనలంటే చాలా ఇష్టం. ఆయన భాషను అద్భుతంగా వాడతారు.

కష్టపడి వచ్చావా?వచ్చిన తర్వాత కష్టపడ్డావా?

అవసరాల శ్రీనివాస్‌: పరిశ్రమలోకి మొదటి అడుగు సులభంగానే పడింది. బ్లాక్‌ బస్టర్‌ విజయం దొరికింది. దర్శకుడిగా మారాక కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మొదటి సినిమాకే మంచి నిర్మాత దొరికారు. మంచి నటీనటులను పరిచయం చేసే అవకాశం దొరికింది. అదృష్టవశాత్తూ మంచి విజయాలు లభించాయి.  మధ్యలో  కష్టాలొచ్చినా మొత్తానికి నాది సంతోషకర ప్రయాణమే.

‘అష్టాచమ్మా’ నచ్చి ఓ పెద్ద హీరో ఫోన్‌చేసి అభినందిస్తే..ఆయన్ను గుర్తుపట్టలేదంట?

అవసరాల శ్రీనివాస్‌: సినిమా విడుదలైనప్పుడు అమెరికాలో ఉన్నా. ఆ సమయంలోనే ఫోన్‌ చేశారాయన. ముందే పేరు కూడా చెప్పారు. ఆయన పేరుతోనే వేరే ఇంకెవరైనా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను. అంతా అయిపోయాక, చివర్లో ‘మీ పేరు?’ అని అడిగాను. నన్ను రవితేజ అంటారండీ అన్నారు. చాలా గౌరవంగా మాట్లాడారు.

రవితేజ సినిమాల్లో చూసిన మొదటిది?

అవసరాల శ్రీనివాస్‌: ‘ఇడియట్‌’ చూశాను. దానికన్నా ముందు ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కూడా చూశాను. రవితేజ ఎనర్జీ, కామెడీ అంటే విపరీతమైన ఇష్టం.

నువ్వు ఫోర్జరీ సంతకాలు బాగా పెడతావటగా?

అవసరాల శ్రీనివాస్‌: చిన్నప్పుడు మార్కులు తక్కువవచ్చాయి. ఆన్సర్‌ షీట్‌(జవాబు పత్రం)పై పెద్దవాళ్లతో సంతకాలు పెట్టించుకొని తీసుకురావాలి. ఇంటిదాకా ఎందుకని అక్కడే నాన్న సంతకం పెట్టేసుకున్నాను.  నాతోపాటు నా ఫ్రెండ్స్‌కి కూడా సంతకాలు చేశాను. టీచర్‌ జవాబు పత్రాలను ఏదో కారణంతో వెనక్కు తీసుకోవడంతో దొరికిపోయాను. టీచర్‌ నన్ను క్షమించి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి పనిచేయలేదు.  

అమెరికాలో ఏ స్టేట్‌కు వెళ్లావు?

అవసరాల శ్రీనివాస్‌: ముందు నార్త్‌ డకోటకు వెళ్లాను. అక్కడ 7 నుంచి 8 నెలలు మంచు కురుస్తూనే ఉంటుంది. సరస్సులన్నీ గడ్డకట్టుకుపోయి ఉంటాయి. చాలా అందంగా ఉంటుందా ప్రాంతం. కాలిఫోర్నియా, న్యూయర్క్‌లకన్నా అదే ఎక్కువ ఇష్టం.

కల్యాణ్‌ మాలిక్‌ పాటను మూడుముక్కలు చేశారంట?

అవసరాల శ్రీనివాస్‌: ‘ఊహలు గుసగుసలాడే’ సంగీతం చేస్తున్నప్పుడు ఆయనొక పాటను వినిపించారు. వేరే సినిమా కోసం చేసిన పాటది. అందులోని పల్లవి నాకు విపరీతంగా నచ్చింది. దాంతో ఆ పల్లవినే సినిమాలో వేరు వేరు సందర్భాల్లో మూడుచోట్ల వాడుకున్నాను. అలా పల్లవినే మూడు చరణాలుగా రాయించిన పాటది. నా పాటను మూడు ముక్కలు చేస్తున్నారని అన్నారు కానీ, సినిమా వచ్చాక కల్యాణ్‌ గారు హ్యాపీగా ఫీలయ్యారు.

ఎన్ని సినిమాలు చేశారు?

అవసరాల శ్రీనివాస్‌: నటుడిగా 40కిపైగా చేసుంటాను. దర్శకుడిగా రెండున్నర సినిమాలు.

అదేంటి?

అవసరాల శ్రీనివాస్‌: మూడో సినిమా షూటింగ్‌ సగం పూర్తయ్యింది. అమెరికాలో షూటింగ్‌ మిగిలిపోయింది. కరోనా కారణంగా అమెరికా వెళ్లడం కుదరలేదు. త్వరలో మొదలెడతాం. 

నూటొక్క జిల్లాల అందగాడు రీమేకా? ఒరిజినలా?

అవసరాల శ్రీనివాస్‌: మేం ఈ సినిమా మొదలైనప్పుడే బాలీవుడ్‌లోనూ ‘బాలా’ వస్తుందని తెలిసింది. దానికి పోటీగా మా సినిమాను తీసుకొద్దామనుకున్నాం. కానీ బాలీవుడ్‌లో ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఉజ్డా చమ్మాన్‌’ పోటీ కారణంగా రెండు వారాల ముందొచ్చింది. దీంతో మేం అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాం.

డైరక్టర్‌ మీరేనా?

అవసరాల శ్రీనివాస్‌: లేదు సర్‌. నేను హీరో, రచయితను మాత్రమే. రాచకొండ విద్యాసాగర్‌ చేశారు. దీంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు.

నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా?

అవసరాల శ్రీనివాస్‌: చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా టైంలో ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ నిర్మాతలే థియేటర్లలోకి తీసుకొద్దామని పట్టుపట్టారు.

స్కాలీ అంటే ఏంటి?

అవసరాల శ్రీనివాస్‌: స్కాలీ అంటే నీళ్లండి. చాలా ఆలస్యంగా అర్థమైంది. దానివల్ల చిన్నప్రమాదం కూడా జరిగింది. ‘కంచె’ సినిమా  జార్జియాలోని ఒక నదిలో జరిగిందీ ఘటన. రాళ్లు, రప్పలు కనిపిస్తూ, నదంతా దాదాపు ఖాళీగా ఉంది. అప్పుడే అందరూ ‘స్కాలీ, స్కాలీ’ అని అరవడం వినిపించింది. అర్థం కాలేదు. పక్కన చూస్తే నది నిండిపోయి ప్రవాహంలా నీళ్లొస్తున్నాయి. అప్పటికే ట్రక్కు ఎక్కాను. ఇలా అయితే కుదరదని లేచి నిల్చున్నాను. అదే సమయంలో ట్రక్కు వేగంగా ముందుకు కదలడంతో కిందపడితే దెబ్బలు తగిలాయి. నా వల్ల మూడు రోజుల షూటింగ్‌ ఆగిపోయింది. స్కాలీ అంటే నీళ్లని తెలిస్తే ట్రక్కు ఎక్కేవాడిని కాదు. 

నటుడిగా మంచి గుర్తింపొచ్చే సమయంలో నెగెటివ్‌ రోల్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది?

అవసరాల శ్రీనివాస్‌: మొదటి నుంచి చేసిన రోలే మళ్లీ చేయకుండా ఉండేందుకు చాలా ప్రయత్నం చేశాను.  నాకున్న మంచి అబ్బాయి అనే ముద్రను పోగొట్టుకోవాలని అనిపించింది. అందుకే విలన్‌గా చేశాను.

ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది?

అవసరాల శ్రీనివాస్‌: బాడీ షేమింగ్‌ మీద ఇప్పుడే సమాజంలో అవగాహన పెరగడం మొదలైంది. తెలియని వయసులో నేను కొందరిని అలా కామెంట్‌ చేసిన విషయాలు కూడా గుర్తొచ్చాయి. ఆత్మవిశ్వాసం లేకపోవడం మనిషిని అన్నిరకాల దెబ్బతీస్తుంది. ఈ విషయం మీదే ఓ సారి క్రిష్‌తో మాట్లాడుతున్నప్పుడు దీనిమీద సినిమా చేయాలనుందని చెప్పాను.

నేనొక వీడియో చూశాను. దాన్ని పబ్లిసిటీ కోసం చేశారా?

అవసరాల శ్రీనివాస్‌: సాధారణంగా కాంట్రవర్సీలు సినిమాకు సాయం చేస్తాయని నాకు పెద్దగా అనిపించదు. కానీ ఈ సినిమాకు ఆ కాంట్రవర్సీ అవసరం అనిపించింది. ఆ వీడియో బయటకొచ్చాక కూడా వచ్చిన కామెంట్లన్నీ బాడీ షేమింగ్‌ మీదే వచ్చాయి. అందుకే ఈ సినిమాకు అలాంటి వీడియో అవసరమైందే అనిపించింది.

పరిశ్రమలో బాగా సపోర్ట్‌ చేసేదెవరు?

అవసరాల శ్రీనివాస్‌: హీరోల్లో నాని.  దర్శకుల్లో మోహన కృష్ణ ఇంద్రగంటి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కల్యాణ్‌ మాలిక్‌ నా మొదటి సినిమా చేయడానికి సాయం చేశారు. ‘కంచె’ ద్వారా క్రిష్‌, రాజీవ్‌ పరిచయం అయ్యారు. సాయి కొర్రపాటితో రెండు సినిమాల అనుబంధం. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి ఇంద్రగంటి గారే కారణం.

ఆయనతో మీకెలాంటి అనుబంధముంది?

అవసరాల శ్రీనివాస్‌: అష్టాచమ్మా సమయంలో ఆడిషన్‌ కోసం ఈమెయిల్‌ చేశాను. నేను పంపిన వీడియో నచ్చి ఆ పాత్రకు ఎంచుకున్నారు.  షూటింగ్‌ మొదటి రోజు నుంచే ఆయనతో సమానంగా నన్ను చూసుకున్నారు.

పెద్ద వంశీతో పనిచేయడం ఎలా ఉంది.?

అవసరాల శ్రీనివాస్‌: తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి వంశీ తీసుకెళ్లారని నా ఫీలింగ్‌. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా సాగింది. ఆయన బెదిరింపులు కూడా చాలా ఫన్నీగా ఉండేవి.

ఓ ప్రొడ్యుసర్‌ దగ్గరకి వెళ్తే, నీలో డైరెక్టర్‌ అయ్యే లక్షణాలు లేవని అవమానించారట?

అవసరాల శ్రీనివాస్‌: పాపం ఆయనలా అనలేదు సర్‌. నేను నీ మీద పెట్టుబడి పెట్టాలంటే నీలో దర్శకుడికుండే దూకుడు కనిపించట్లేదు అని అన్నారు. ఆయన భయాన్ని స్పష్టంగానే వ్యక్తం చేశారు. ఆయనన్నదానికి నేనేమీ బాధపడలేదు.

మళ్లీ ఆయన్నుకలిశారా?

అవసరాల శ్రీనివాస్‌: ఒక ఆడియో వేడుకలో కలిశారు. నా పట్ల సంతోషంగానే ఉన్నారు.

ఆయనలా చెప్పడం నిన్ను ప్రోత్సహించినట్లా? లేక నిరుత్సాహపరిచినట్లా?

అవసరాల శ్రీనివాస్‌: నేనైతే నిరూత్సాహపడలేదు. అలాగని ఆయన నాకు ప్రోత్సాహమూ అందివ్వలేదు.

బాలీవుడ్‌లో బడా హీరో కోసం కథ రాసుకున్నావట?

అవసరాల శ్రీనివాస్‌: అమెరికాలో ఉన్నప్పుడు ఈ కథను రాసుకున్నాను. తెలుగులో తీద్దామనుకున్నదే. కానీ ఇందులో మొత్తం 8 భాషలుంటాయి. తెలుగు కేవలం పాతిక శాతమే ఉంటుంది. అందుకే దీన్ని హిందీలో తీస్తే బాగుంటుందని అనిపించింది. ఈలోగా తెలుగు సినిమాలతో బిజీ అయిపోయాను. ఆయన్ను అప్రోచ్‌ అయ్యాక చెబుతాను.

నటనలో నీకు స్ఫూర్తినిచ్చిందెవరు?

అవసరాల శ్రీనివాస్‌: చిన్నప్పుడు రాజేంద్రప్రసాద్‌ సినిమాలు ఎక్కవగా చూసేవాడిని. ఇప్పటికీ  రాస్తుంటే  డైలాగులు ఆయన గొంతుతో వినిపిస్తూ ఉంటాయి. కేబుల్‌ టీవీలొచ్చాక అమితాబ్‌ సినిమాలు ఎక్కువ వచ్చేవి. ఆ తర్వాత రాత్రిళ్లు కిషోర్‌ కుమార్‌ చిత్రాలొచ్చేవి. అలా వీరంతా నాకు ఇష్టమైన నటులు.

ఈ పదమూడేళ్లలో బాధపడిన క్షణాలు, సంతోషడిన సందర్భాలు ఏమున్నాయి?

అవసరాల శ్రీనివాస్‌: అన్నీ ఆనందపడాల్సిన క్షణాలే అని ఆలస్యంగా తెలిసింది. నేను బాధపడిన సందర్భాలేమీ లేవు. మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్‌ వచ్చింది. ఆ తర్వాత అంతా ఇలానే ఉంటుందని అనుకున్నాను. కానీ ఓ మంచి సినిమా బయటకు రావడానికి దాని వెనకాల ఎంత కష్టముంటుందో తర్వాత తెలిసొచ్చింది.

మీకు బాగా ఇష్టమైన హీరోయిన్‌?

అవసరాల శ్రీనివాస్‌: నేను టబుగారి ఫ్యాన్‌. చిన్నప్పటి నుంచే ఇష్టం. ఒకసారి దగ్గరి నుంచి చూశానంతే, పలకరించలేదు.

తరువాతి ప్రాజెక్ట్స్ ఏంటీ?

అవసరాల శ్రీనివాస్‌: కొన్ని సినిమాలకు దర్శకత్వం చేయాలి. మధ్యలో మంచి పాత్రలొస్తే చేస్తాను.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని