మళ్లీ సినిమాల్లోకి రాను : రాజా - alitho saradaga raja interview
close
Updated : 16/12/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ సినిమాల్లోకి రాను : రాజా

‘ఓ చినదాన’ అంటూ సిల్వర్‌స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి, మంచి కాఫీ లాంటి సినిమా ‘ఆనంద్‌’తో తన విజయ ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ వైజాగ్‌ అందగాడు. హీరో, విలన్‌, సపోర్టింగ్‌ రోల్‌, ఇలా.. తను చేసే పాత్ర ఏదైనా ఆ పాత్ర గురించి పది మంది గొప్పగా చెప్పుకొనేలా చేశాడు. పది కాలాల పాటు ఆ పాత్ర గుర్తుండిపోయేలా తన విలక్షణమైన నటనతో మెప్పించాడు. అతి కొద్ది కాలంలోనే ఎందరో అభిమానుల్ని సంపాదించుకొని ప్రేక్షక హృదయాల్లో మంచి ప్రతిభగల నటుడిగా నిలిచిపోయారు నటుడు రాజా. మళ్లీ ఇన్నాళ్లకు మనందరితో కాసేపు సరదాగా మాట్లాడేందుకు ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సంగతులు పంచుకున్నారు.

నటుడిగా ఎంతో బిజీగా ఉన్న మీరు అకస్మాత్తుగా పాస్టర్‌గా మారడానికి కారణం?

రాజా: అది అనుకోకుండానే జరిగింది. ప్లాన్‌ చేసింది కాదు. ‘ఇంకోసారి’ చిత్రం చేసినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా కలత చెందాను. తర్వాత నిర్మాతల మండలితో ఇబ్బందులు ఎదుర్కోవడం, థియేటర్ల కోసం గొడవలు పడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పటికీ సినిమాలపై ఆసక్తి తగ్గిపోయింది. సినిమా ఆఫర్స్‌ కూడా పెద్దగా రాలేదు. పెద్దస్థాయిలో ఉన్నవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. నాకు చిత్ర పరిశ్రమలో ఎవరి అండదండలూ లేవు. పరిస్థితులు కూడా నాకు ఏ మాత్రం అనుకూలించలేదు. బాగా ఒత్తిడికి లోనయ్యా. అప్పుడే ఇంట్లో ఒక బైబిల్‌ కనిపించింది. బాగా దుమ్ము పట్టుకుపోయి ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నా.. నేనెప్పుడూ దాని వైపు చూడలేదు. కానీ, ఎందుకో ఆ క్షణం దానిపై నా దృష్టి పడింది. అది చదువుతుంటే ఒక వ్యక్తి నాతో నేరుగా మాట్లాడినట్టు అనిపించింది. దీంతో అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ‘ఇప్పటిదాకా ఈ రకంగా బతికింది చాలు. ఇక నుంచి ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం’ అనుకున్నాను. కానీ, పాస్టర్‌ అవుతానని అనుకోలేదు. మామూలుగా రోజూ చర్చకి వెళ్లడం, సభలకు హాజరుకావడం చేశాను. అలా కొందరు నన్ను ‘మీరు ఎలా దేవుడికి దగ్గరయ్యారు, ఎలా విశ్వసించారు’ అడగటం ప్రారంభించారు. అలా నేను జీసస్‌ ప్రార్థనా సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో జాయ్‌ చరియాన్‌ అనే ఆవిడ పరిచయమయ్యారు. ఒక రోజు నాతో ఆమె మాట్లాడుతూ.. ‘మీరు త్వరలోనే సేవలోకి రాబోతున్నారు’ అంటే నేను నవ్వాను. నేనున్న చిత్ర పరిశ్రమకు మీరు చెప్పేదానికి ఎక్కడ కుదురుతుందన్నాను. కానీ ఆమె కచ్చితంగా మీరు సేవలోకి వస్తారని అన్నారు. తర్వాత ఆమె చెప్పినట్టుగా జీసస్‌ దయతో దేవుని సేవలోనే ఉన్నాను.

చిన్పప్పటి నుంచే బైబిల్‌ చదివే అలవాటుందా?

రాజా: లేదు. చిన్నతనంలో ఎవ్వరూ భక్తి తాలుకూ విషయాలు చెప్పలేదు.

మీ అమ్మ, నాన్నతోనైనా చర్చికి వెళ్లేవారా?
రాజా: లేదు. నేను అయిదేళ్ల వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయారు. ఇప్పటివరకు ఫొటోల్లోనే చూడటం.. అమ్మ ఇలా ఉంటుంది అనే ఐడియా కూడా లేదు. ఆమె క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. నాకు 14ఏళ్ల వయసులో అనారోగ్య కారణలతో నాన్న కూడా చనిపోయారు.

మీ అమ్మానాన్న తర్వాత ఎవరు మిమ్మల్ని ఆదరించారు?
రాజా: నాకు ఇద్దరు అక్కలు. తల్లిదండ్రుల తర్వాత వాళ్లే అన్నీ చూసుకున్నారు.
ఏం చదువుకున్నారు?
రాజా: వైజాగ్‌ బుల్లయ్య కళాశాలలో బీ.కామ్‌ చదువుకున్నాను.

ఎస్వీఆర్‌ తర్వాత ఆ స్థాయి ‘మాయాబజార్‌’ చిత్రంలో కుబేరుడిగా బాల సుబ్రహ్మణ్యం అలరించారు. ఆయనతో నటించడం మీకెలా అనిపించింది?
రాజా:  బాల సుబ్రహ్మణ్యంగారు నిజంగా మహానుభావులు. చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం. ఆయనను మీరు చేసిన ఇంటర్వ్యూ చూసి నా కన్నీళ్లు ఆగలేదు.

నాన్న చనిపోయిన తర్వాత జీవితంలో ఎలా ముందుకు వెళ్లారు?

రాజా: ఇంటర్మీడియట్‌ చదువుతూనే పని చేయడం మొదలుపెట్టాను. అక్కవాళ్లు ప్రముఖ హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. నేను ఒక ఎయిర్‌ కర్టెన్స్‌ కంపెనీ ఉత్పత్తులకు మాల్స్‌లో మార్కెటింగ్‌ జాబ్‌ చేసి ఐదారువందలు సంపాదించేవాడిని. అక్కవాళ్లే మీద మొత్తం భారం పడకుండా అలా సహాయంగా ఉండేవాడిని. వాళ్లే అన్నీ నాకు. భగవంతుడు ఒక తల్లిని తీసుకెళ్లిపోయినా, అక్కల రూపంలో ఇద్దరు తల్లులను ఇచ్చాడు. 

రిసెప్షనిస్టుగా పని చేశారా?
రాజా: అవును. 1997వ సంవత్సరంలో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్‌ హోటల్లో  రిసెప్షనిస్టుగా పనిచేశాను. అక్కవాళ్లకు భారం కాకూడదని వాళ్లకు సాయంగా
ఉండాలనుకున్నా. ఉద్యోగం పురుష లక్షణం కదా! ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదించాలి. అదే నేనూ నమ్ముతా. నేను రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడకు చాలా మంది నటులు వచ్చేవాళ్లు. అయితే, మిమ్మల్ని(ఆలీ) ఎప్పుడూ చూడలేదు.

నటుడిగా మీకు ఏ దర్శకుడు అవకాశం ఇచ్చారు.

రాజా: ఈ విషయంలో ఈవీవీ సత్యనారాయణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ల కుటుంబం ఎంతో గొప్పది. వాళ్ల పెద్దబ్బాయి ఆర్యన్‌ రాజేష్‌ ద్వారానే నాకు అవకాశం వచ్చింది. అప్పట్లో నేను మోడలింగ్‌ చేసే ఉద్దేశంతో ముంబయిలో ప్రయత్నాలు మొదలుపెట్టా. అక్కడి జూహులోని సన్‌ అండ్‌ సన్‌ హోటల్‌లో ఉన్నప్పుడు ఈవీవీ ఆడిషన్స్‌ చేస్తుంటే వెళ్లాను. డైలాగ్స్‌ ఇస్తే వెంటనే గడ,గడ చెప్పేశాను. అప్పుడు వాళ్లు ఎవరితను తెలుగు డైలాగ్స్‌ బాగా చెబుతున్నాడని ఆరా తీస్తే.. ‘నేను తెలుగువాడినేనని, మాది వైజాగ్’‌  అని చెప్పాను. వెంటనే వాళ్లు నాకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆ మూవీ ఎందుకో పట్టాలెక్కలేదు. అయితే ఆర్యన్‌ రాజేష్‌ నన్ను గుర్తుపెట్టుకున్నారు. అప్పుడు ముంబయిలో ఒక యాక్టింగ్‌ అకాడమీలో రాజేష్‌, నరేశ్‌‌ శిక్షణలో ఉన్నారు. ఆ సమయంలో రాజేష్ ఫోన్‌ చేసి ‘ఇలా మా కజిన్‌ సత్తిబాబు సినిమా చేస్తున్నారు. హీరో శ్రీకాంత్‌ మెయిన్‌ లీడ్‌, మీరు సెకండ్‌ లీడ్‌ చేస్తారా’ అని అడిగారు. అసలు అవకాశం రావడమే అదృష్టం. వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే అన్నాను. ఆ తర్వాత సత్తిబాబుని ముంబయిలో కలిశాను. ఆయనతో మాట్లాడిన తర్వాత శ్రీకాంత్‌ అన్నకు కూడా నా ఫొటోలు పంపిస్తే ఓకే అని చెప్పారంటా. అలా ‘ఓ చినదానా’ సినిమాతో నా సినీ ప్రయాణం ప్రారంభమైంది.

‘ఓ చినదాన’ తర్వాత బ్రేక్‌ వచ్చిందా..
రాజా: బ్రేక్‌ రాలేదు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ‘విజయం’ చేశా. సింగీతం శ్రీనివాసరావుగారు దర్శకులు. నా రెండో చిత్రమే సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో చేయడం నా అదృష్టం. మురళీమోహన్‌ గారు కూడా ఇదే అన్నారు. ‘సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా’ అన్నారు.

విజయం తర్వాత కెరీర్‌ ఎలా నడిచింది.
రాజా: విజయం సినిమా అంతగా సక్సెస్‌ కాలేదు. అయితే ఓపెనింగ్స్‌ మాత్రం బాగా వచ్చాయి. అన్నీ ఉన్నా..టైం బాగుండాలి కదండీ(నవ్వులు) దీని తర్వాత చంద్రసిద్ధార్థ్‌‌గారితో ‘అప్పుడప్పుడు’ అనే సినిమా చేశాను. అదీ పెద్దగా విజయం సాధించలేదు.

మీ కెరీర్‌ ప్రారంభంలోనే పెద్ద పెద్ద దర్శకులతో, నిర్మాతలతో పనిచేశారు. ఆ తర్వాత మీకు బ్రేక్‌ తీసుకొచ్చిన సినిమా ఏది?
రాజా: ఆనంద్‌.. ఓ మంచి కాఫీలాంటి సినిమా. 
శేఖర్ కమ్ముల పైసా పైసా సమకూర్చి ‘ఆనంద్‌’ చిత్రాన్ని తీశారు. ఏ నమ్మకంతో మీతో చేశారు?
రాజా: నా మీద నమ్మకంతో కాదు. ఆయన స్క్రిప్ట్‌ మీద నమ్మకం. ఆయన అందరిలా కాదు. ‘నేను స్టోరీని వివరించలేను. స్క్రిప్ట్‌ ఇస్తాను. నువ్వు చదివి చెప్పు’ అన్నప్పుడు .. చదివేసి శేఖర్‌కు కాల్‌ చేసి ఇది ‘మీకు ఒక జాక్‌పాట్‌’ అని చెప్పాను. అంతే అద్భుతంగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. 
ప్రతి సినిమాకి ఇలాగే కథ చదవచ్చు కదా?
రాజా: లేదు. అన్నీ సినిమాలకు మనవాళ్లు ఎక్కడ ఇస్తారు.  కొంత మంది ఇస్తారు. కొంత మంది ఇవ్వరు. 

అంటే మధ్యలో కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేశారా?

రాజా: అవును. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. ఆ సమయంలో చేయాల్సి వచ్చింది. అందులో మొహమాటం ఏం లేదండి. నేను కూడా మనిషినే. నేను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. కొన్ని సినిమాలు ఎందుకు చేశాను అని బాధ పడినవీ ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రేమించి, ఆ కథను ఇష్టపడి చేశాను. 
బాగా ప్రేమించిన సినిమాలు ఏవి?
రాజా: ‘ఆనంద్‌’, ‘మిస్టర్‌ మేధావి’, ‘అప్పుడప్పుడు’.
మొత్తంగా ఎన్ని సినిమాల్లో నటించారు. ఇతర భాషల్లో చేశారా?
రాజా: 35.. తమిళంలో ఒకటి చేశాను. అది ‘జగన్మోహిని’ చిత్రం. ఆ చిత్రంలో మీరు కూడా నటించారు. అందులో నమిత కథానాయకురాలు.

బాగా క్లాస్‌ సినిమాలకు పరిమితం అవ్వడానికి కారణం ఏమిటి?
రాజా: అలా ఏం ప్లాన్‌ చేయలేదండీ. మాస్‌ ఒకటి ప్రయత్నించాను. ‘టాస్‌’ చిత్రంలో నటించాను. సెట్ అవ్వలేదు.

ఎవరైనా సినిమా చేస్తానని వస్తే, వద్దని వెనక్కి పంపించేవారట!
రాజా: అవకాశాలు రాలేదు అని కాదండి. నష్టపోతారు అని చాలా నిర్మాతలకు చెప్పి వద్దన్నాను. ఎగ్జిబిటర్స్, శాటిలైట్, థియేటర్స్ ముందుకు నడిపించే విధంగా లేవు. డబ్బులు పెట్టినా కూడా రూపాయి మీకు తిరిగిరాదు. నన్ను పెట్టుకోవటం వల్ల లాభం లేదు. ఎందుకంటే ఒకరి ఉసురు తగలటం నాకు ఇష్టం లేదు. అందుకే అలా నిరాశ పరిచేవాడిని. 

మీరు నటించిన సినిమాల్లో ఏది మీ చివరి సినిమా?
రాజా: మంచు మనోజ్‌తో నటించిన ‘మిస్టర్‌ నూకయ్య’ చిత్రం. ఆ చిత్రంలో విలన్‌గా చేశాను.
దే విధంగా సినిమా అవకాశాలు వస్తాయి కదా అని నమ్మకంతో ఉండచ్చు కదా?
రాజా: ఆ సినిమాలో చేయటానికి కారణం మంచు మనోజ్‌. పట్టుబట్టి నువ్వే చేయాలి అని చేయించారు. 

ఆత్మహత్య ప్రయత్నం చేశారట నిజమేనా?
రాజా: అసలు గమ్మత్తయిన విషయం ఏంటో తెలుసా. నేను పొద్దున్నే లేచాను. మా అక్క గబగబా పరుగెత్తుకొచ్చి న్యూస్‌పేపర్‌ చూపిస్తూ ఏంటీ వార్త? అని అనగానే నేనే షాకయ్యాను. రాజా ఆత్మహత్య ప్రయత్నం అని ఉంది. నాకు తెలియకుండా నేనెప్పుడు ఆత్మహత్య చేసుకున్నాను? అనుకొని ఆ వార్తపత్రికకు ఫోన్‌ చేశాను. మరుసటి రోజు చిన్న వార్త ఇచ్చారు. ఆత్మహత్య ప్రయత్నం ఏమో పెద్దగా ఇచ్చారు. బతికున్నాను అనే వార్త చిన్నగా ఇచ్చారు. 
ఆ వార్త ఎందుకలా వచ్చింది?

రాజా:ఏమో.. సినిమా అవకాశాలు లేవు. నిర్మాతలతో గొడవలు పెట్టుకున్నాడు. థియేటర్లు దొరకటం లేదని కుంగిపోయి.. ఇలా వాళ్లకి తోచింది రాసేసుకున్నారు. 
వాళ్లు నిన్ను చంపేశారు?
రాజా: చంపేశారు. ఆ తర్వాత వాళ్లు వివరించారు. క్షమాపణలు చెప్పారు. చంపేసి మళ్లీ బతికించారు(నవ్వులు)

ఇండస్ట్రీకి ఎవరైనా అభిరుచితో వస్తారు. మీరు ప్రసిద్ధి చెందాలని వచ్చారటా?
రాజా: జీవితంలో చాలా కష్టపడ్డాను. ఒక వంద రూపాయల కోసం ఇబ్బంది పడి, అవమాన పడిన రోజులూ చూశాను. ఛీ ఛీ ఇదేం బతుకు అనుకున్నాను. అందరు పుడతారు. అందరు మరణిస్తారు. నాకు అలాంటి జీవితం వద్దు. నేను మరణించిన విషయం ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని ఒక కంకణం కట్టుకొని కసితో వచ్చాను. ఒకసారి ఫైల్ పట్టుకొని, ఫొటోలు తీసుకొని తమ్మారెడ్డి భరద్వాజ దగ్గరకు వెళ్లాను. ‘నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వేమన్నా పెద్ద అందగాడివా? అని అన్నారు. ఆయన మాట తీరు అలా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఇక నేను బొంబాయికి వెళ్లిపోయా. అలా ఈవీవీ గారిని కలిశా. సినిమాల్లోకి వచ్చాను.
తమ్మారెడ్డి ఫొటో మీ ఇంట్లో ఉందా?
రాజా: లేదండి. గుండెల్లో ఉంది. 

శేఖర్ కమ్ములతో ఒకే సినిమా చేశారా?
రాజా:ఒకటే చేశానండీ. ‘గోదావరి’ సినిమాకు అడిగారు కానీ, ఆ సమయంలో నేను ‘వెన్నెల’ సినిమా షూటింగ్‌ కోసం అమెరికాలో ఉన్నాను. అలా షెడ్యూల్ ఖాలీ లేక ఆ అవకాశాన్ని మిస్‌ అయ్యాను. 
‘వెన్నెల’ సినిమా షూటింగ్‌ సమయంలో ఒకరికి వీసా రాలేదు.. మరొకరు హీరో అయ్యారు. వీసా రాని వ్యక్తి ఎవరు?
రాజా:శివారెడ్డి. 

నీకు మహిళా అభిమాన సంఘం ఉందట కదా?
రాజా: మహేశ్ బాబు తర్వాత నాకు చాలా ఫాలోయింగ్ ఉండేది. 
ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో మీ పెళ్లి?
రాజా: నాది పెద్దలు కుదర్చిన వివాహం. మా అక్క నా ప్రొఫైల్ షాదీ.కామ్‌లో పెట్టారు. చెన్నైలోని ఓ కుటుంబం చూసింది. ఆ అమ్మాయికి నా ప్రొఫైల్ నచ్చింది. ఇప్పటివరకు తను నా సినిమాలు చూడలేదు. ‘దేవుడే నిన్ను క్షమిస్తే, నేను ఎవరినీ’ అని ఆమె నాతో చెప్పింది. ఆ ఒక్క మాటతో నేను తనని పెళ్లి చేసుకున్నాను.
ఎంత మంది పిల్లలు?
రాజా:ఇద్దరు అమ్మాయిలు. నా భార్య ఇప్పుడు గర్భవతి. పెద్దమ్మాయి పేరు లియోరా. చిన్నమ్మాయి పేరు ఎలియానా. 

ఓ ఊరికి మంచి చేయాలని మీరు వెళితే, ఆ ఊరి వాళ్లు మిమ్మల్ని నమ్మలేదట.. ఎందుకు?
రాజా: నమ్మలేదని కాదు. ముందుగానే ఆ ఊరిలో కొంత మంది మోసపోయారు. దాంతో కొత్త వాళ్లని సంకోచించారు. ప్రారంభంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ, ఇప్పుడు ఆ ఊరి వాళ్లు చాలా ఇష్టపడతారు. 
ఏ ఊరు ?
రాజా: మోమిన్‌పేట, వికారాబాద్‌, తెలంగాణ
పోచమ్మ డ్యామ్‌ ఉంది కదా. అది మీ తాతముత్తాతలు కట్టారా?
రాజా: అవునండి. మా తాత వాళ్ల సోదరుడు చార్ల్స్‌ హోప్‌ ఎడ్వర్డ్‌ కట్టారండి. 

సినిమాను ఎప్పుడైనా ఎందుకు మిస్‌ చేసుకున్నాను అని అనిపిస్తుంటదా?
రాజా: లేదండి. అసలు సినిమా అనే ఆలోచన కూడా ఇప్పుడు లేదండి.
భవిష్యత్తులో ఏం చేయలనుకుంటున్నారు?
రాజా: సేవ చేయాలనుకుంటున్నాను. ఇందులోనే అండి. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాలి. 

‘సొంత ఊరు’ అనే ఓ సినిమా చేశారు. అది ఎంత పేరు తీసుకొచ్చింది మీకు?
రాజా: మంచి పేరు తెచ్చిందండి. ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది. నాకు ‘ఆనంద్’, ‘సొంత ఊరు’ ఏ చిత్రానికి నంది అవార్డు రాలేదండి. సినిమాకి, హీరోయిన్‌కి మాత్రమే వచ్చింది.
ఓ సినిమా షూటింగ్‌లో టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటున్నావని ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ నిన్ను భయంకరంగా తిట్టారట కదా?
రాజా:‘ఓ చినదాన’ చిత్రం సమయంలో నేను కొత్తగా వచ్చాను. నాకు డ్యాన్స్‌ పెద్దగా తెలీదు. ఇక డ్యాన్స్‌ మాస్టర్‌కి కోపం వచ్చి.. ఇతన్ని పక్కన పెట్టండి అని అన్నారు. అంత మంది మధ్యలో అలా అనేసరికి క్యారవాన్‌లోకి వెళ్లి కూర్చొని ఏడుస్తున్నా. అప్పుడు శ్రీకాంత్‌ అన్న వచ్చి, రాజా ఇవన్నీ కామన్‌, నువ్వేంటో చూపించు. అని ధైర్యం ఇచ్చారు.

ఎవరైనా మీవద్దకు వచ్చి.. నేను సినిమా రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాను.. అని అడిగితే. మీరేమంటారు?
రాజా: వద్దని చెప్తాను. 
ఎందుకు?
రాజా: సినిమా కాకుండా ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. అందులోనూ ముందుకు వెళ్లొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 

‘మొగుడు, పెళ్లాం.. ఓ దొంగోడు’ ఈ చిత్రంలో ముగ్గురే ఉంటారు. ఇలాంటి ప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది?
రాజా: నాకు స్క్రిప్ట్‌ నచ్చింది. అది ఓ ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌. తెలుగు ఇండస్ట్రీకి ఓ కొత్తదనం. అందుకే ఇది చేశాను.
చూశారా ప్రేక్షకులు?
రాజా: చూశారండి. అంతే కాదు. థియేటర్‌కి వెళ్తే వాళ్ల కామెంట్లు వినలేక నమస్కారం అని చెప్పి బయటకు వచ్చేశాను. (నవ్వులు)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని