‘సీతాకోకచిలుక’, ‘రోజా’ అందుకే వదులుకున్నా! - alitho saradaga special chat show with actor suresh
close
Updated : 11/02/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సీతాకోకచిలుక’, ‘రోజా’ అందుకే వదులుకున్నా!

యువ నటుడిగా తెలుగుతెరకు పరిచయమై.. హీరోగా ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు ఈ పాలబుగ్గల బుల్లోడు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు సురేశ్‌. తాజాగా ‘ఈటీవీ’లో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని సందడి చేశారు. మరి ఆయన సినీ కెరీర్‌ ఎలా సాగింది? వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? తెలుసుకోవాలని ఉందా! మరెందుకు ఆలస్యం.. చదివేయండి..

మైసూరు సురేశ్‌ వెనుక ఉన్న కథేంటి?

సురేశ్‌: మైసూరు మా ఇంటి పేరు. నా అసలు పేరు మైసూరు శేషయ్య సురేశ్‌బాబు నాయుడు. చాలా పెద్దగా ఉందనే ఉద్దేశంతో కేవలం సురేశ్‌ మాత్రమే తీసుకున్నా. 

మీ సొంతూరు?

సురేశ్‌: నా సొంతూరు కాళహస్తి. మా పూర్వీకులది నెల్లూరు. ఎంఎస్‌ రెడ్డిగారికి మా తాత చాలా ఆత్మీయుడు. చిన్నతనంలోనే మా నాన్నగారు ఇంటి నుంచి చెన్నై వెళ్లిపోయి ‘దేవర్‌’ సినిమా సంస్థలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు. ఆ సంస్థవాళ్లు ఎక్కువగా జంతువులతోనే సినిమాలు చేసేవారు. అందువల్ల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయినప్పటికీ ఆ జంతువుల ఆలనా పాలన చూసుకోవాలి. అవి ఉండే చోటు శుభ్రం చేయాలి. అలా ఆయన కెరీర్‌ మొదలై దర్శకుడిగా కుదురుకున్నారు.

ఇండస్ట్రీలో మీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?

సురేశ్‌: నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్న విషయం మొదట మా నాన్నకు చెప్పలేదు. నా స్నేహితుడి సాయంతో కొన్ని ఫొటోలు తీయించుకున్నా. అవి చాలా చెత్తగా ఉన్నాయనుకోండి (నవ్వులు). అవి పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. మా నాన్న సాయం అడగకపోవటానికి కారణం.. ఆయన నన్ను డాక్టరుగా చూడాలనుకున్నారు. పైగా నటుడికి ఉండాల్సిన ఏ లక్షణాలూ నాకు లేవని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయన దృష్టిలో హీరో అంటే ఏయన్నార్‌, ఎన్టీఆర్‌లాగా ఉండాలి. ఆ క్రమంలోనే ‘అద్దంలో ముఖం చూసుకున్నావా’ అన్నారు. అందుకే ఆయన్ను సంప్రదించకుండా నేనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అప్పుడే ఛటర్జీ అనే దర్శకుడు పరిచయమయ్యాడు. ఆయన శోభన్‌బాబు, కన్నడ రాజకుమార్‌తో కలిపి చేస్తున్న ‘జగమొండి’ అనే చిత్రంలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. అప్పుడు తొలిషాట్‌లోనే నాకూ, ‘శంకరాభరణం’ రాజ్యలక్షి కాంబినేషన్‌లో సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. అందులో హీరోయిన్‌ను ఎత్తుకుని డ్యాన్స్‌ చేయాలి. అయితే నేను ఎంత ట్రై చేసినా టేక్‌ ఓకే కాలేదు. దీంతో దర్శకుడు ‘నా దగ్గరకి వచ్చి రేపు ఉదయం ఇదే షాట్‌ మళ్లీ తీస్తా.. నువ్వు చెయ్యకుంటే వేరే నటుడిని పెట్టుకుంటా’ అన్నారు. అలాగే రాజ్యలక్షి, కొరియోగ్రాఫర్ రేఖ కూడా నాకు నచ్చజెప్పారు. దీంతో రెండోరోజు మొదటి టేకులోనే షాట్‌ ఓకే అయ్యింది. అలా నా సినీ ప్రయాణం మొదలైంది.

కుటుంబం గురించి?

సురేశ్‌: నేను మా అమ్మతో పాటు ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నా. నాన్నగారు గోపీనాథ్..  18 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళం, కన్నడంలో కూడా పనిచేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌లతో కూడా ఆయన పనిచేశారు. నా కుమారుడు నిఖిల్‌ అమెరికాలో ఉంటున్నాడు. అక్కడే ఒక హోటల్‌ గ్రూప్‌కు మేనేజర్‌గా చేస్తున్నాడు. 2009లో అతడికి వివాహం జరిగింది. వాడికి నటన మీద ఆసక్తి లేదు.

హీరోగా మంచి కాలం నడుస్తున్న కాలంలో నిర్మాతగా మారి సినిమాకు దర్శకత్వం చేయాలని ఎందుకనిపించింది?

సురేశ్‌: ఎప్పుడైనా మన విలువను మనమే తెలుసుకోవాలి. నేను నిర్మాతగా మారి విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో ‘ప్రార్థన’ చేశా. అది రొటీన్‌ చిత్రం కాదు. సక్సెస్‌ సాధించాం. కానీ, పెద్ద రేంజ్‌లో హిట్టు కొట్టలేకపోయాం. దాన్ని ఇంకొంచెం గ్రాండ్‌గా తీసుంటే ఫలితం ఇంకా బాగుండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్జీవీ ‘శివ’ కూడా అదే జోనర్‌లో వచ్చి హిట్టు కొట్టింది. ఆ తర్వాత ‘భవాని’ సినిమాను నిర్మించి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశా. ఎందుకంటే అందులో భవాని అనే రౌడీ పాత్రలో నటించా. అందులో మరీ క్రూరంగా ఆ పాత్రను చూపించకూడదనే ఉద్దేశంతో దర్శకత్వంలో భాగమయ్యాను. నాకు మొదటి నుంచి విలన్‌ పాత్రలంటే చాలా ఇష్టం. హీరోగా కొంతకాలం మాత్రమే చేయగలం. ఆ తర్వాత నా కెరీర్‌ ఏంటి? అని ప్రశ్నించుకున్న తర్వాతనే ఇలాంటి పాత్రలు చేయడం ప్రారంభించా. మా నాన్నగారు కూడా వివిధ రకాల పాత్రలు చేయమని ఎప్పుడూ చెబుతుండేవారు. మొదటిసారి సుమన్‌గారు హీరోగా చేసిన చిత్రంలో విలన్‌గా నటించా. చిరంజీవి గారి ‘ఇద్దరు మిత్రులు’లో విలన్‌గా చేశా. కృష్ణంరాజుగారు మా నాన్నకు మంచి మిత్రులు. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన ‘పల్నాటి పౌరుషం’ చిత్రంలో విలన్‌గా చేశా. సెట్‌లోకి వెళ్లగానే ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. ఆప్పుడు మేం చేస్తున్న సీన్‌ ప్రకారం ఆయన్ను చొక్కా పట్టుకుని కోపంగా మాట్లాడాలి. స్క్రిప్ట్‌ ప్రకారం నేను అంతే వీరోచితంగా కృష్ణంరాజు గారి చొక్కా కాలర్‌ పట్టుకున్నా. ఆయన ఒక్కసారే షాక్‌ అయ్యారు. డైరెక్టర్‌ ముత్యాల సుబ్బయ్య గారు వెంటనే కల్పించుకుని ‘అతను తమిళ చిత్రాల నుంచి వచ్చాడు కదండీ! కొంచెం సహజంగా ఉండేలా నటిస్తాడు’ అంటూ సర్దిచెప్పబోయారు. దానికి కృష్ణంరాజు గారు ‘యస్‌ నాకిలాగే కావాలి. టేక్‌లో కూడా నువ్వు ఇలాగే చెయ్యాలి’ అంటూ వెన్ను తట్టారు. అలాగే చిరంజీవి గారి ‘ఇద్దరు మిత్రులు’లో నాది స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ పాత్ర. దానికి ఒక మేనరిజం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘కచాక్‌’ అనే పదాన్ని ఉపయోగిద్దామని డైరెక్టర్‌ రాఘవేంద్రరావు గారికి చెప్పా. ఆయనేమో హీరోగారికి చెప్పి చేద్దాం అన్నారు. చిరంజీవిగారు సెట్‌కి వచ్చాక చెబితే చాలా బాగుందన్నారు. రాఘవేంద్రరావు గారిని పిలిచి ‘తమ్ముడు ఇంత మంచి పాయింట్‌ చెబితే వెంటనే పెట్టేసేదానికి నా అనుమతి ఎందుకు’ అంటూ సరదాగా కోప్పడ్డారు. అంతగా ప్రోత్సహించేవారు.

హీరోగా చేసి విలన్‌ పాత్రలు చేసినప్పుడు ఎలా అనిపించేది?

సురేశ్‌: నటుడిగా అన్ని పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం. ఈ విషయంలో నాకు ఆదర్శం ఎస్వీ రంగారావుగారు. అద్భుతమైన నటుడు. అలాగే రజనీకాంత్‌ గారు కూడా నెగిటివ్‌ పాత్రలు  చేసేవారు. కెరీర్‌ ప్రారంభంలో నా సినిమాలు చూసుకుంటే, నేను లవర్‌బాయ్‌ ఇమేజ్‌లోనే కొట్టుకుపోతున్నానేమో అనిపించేది. మాస్‌కి దగ్గరవ్వాలని బాగా ఉండేది. అందుకు విలన్‌ పాత్రలైతేనే కరెక్ట్‌. హీరోగా రెండు పాటలకు డ్యాన్స్‌లు చేసి, మూడు లవ్‌సీన్లతో సినిమా అయిపోయిందనే ఫీలింగ్‌ రానివ్వకూడదనేదే నా అభిప్రాయం. వైవిధ్యం ఉన్న నటుడిగా గుర్తింపు పొందాలనే తాపత్రయం. నటనను నేను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఎప్పుడైనా నన్ను ‘మీకు ఈ సీన్‌లో డైలాగులు లేవు. అలా నుంచుంటే చాలు’ అని చెప్తే చాలా బాధపడిపోతా. అయ్యో ఈ సీన్‌లో నేనేమీ చేయట్లేదా అనే భావన బాగా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో అద్భుతమైన పాత్ర ఏది?

సురేశ్‌: ‘జనతా గ్యారేజ్‌’. అందులో సమంత తండ్రిగా చేశా. గొప్ప నటులంతా అందులోనే ఉన్నారు. తారక్, మోహన్‌లాల్‌ వంటి వారితో స్క్రీన్‌ పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. కొరటాల శివ టేకింగ్‌ చాలా సున్నితంగా ఉంటుంది. ఆవేశపడి నటించాల్సిన అవసరం ఉండదు. చాలా కూల్‌గా పని జరుగుతుంది.

ఎన్ని సినిమాలు డైరెక్ట్‌ చేశారు?

సురేశ్‌: ‘భవాని’ చిత్రం ఒక్కటే. ఆ తర్వాత నా భార్య నిర్మించిన కొన్ని సీరియల్స్‌ను డైరెక్ట్‌ చేశా. సుమారు ఏడు ధారావాహికలు కలిపి 1000 ఎపిసోడ్లకు పైగా డైరెక్ట్ చేశాను. అదొక మంచి అనుభవం. 

అమ్మను అంతగా ప్రేమించే సురేశ్‌, భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది?

సురేశ్‌: ఇంతవరకు ఈ విషయం గురించి ఎక్కడా చెప్పలేదు. ఇది చాలా మంచి షో కాబట్టి ఇక్కడ చెబుతా. నేను ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం నుంచి రాలేదు. ఒకానొక దశలో చదువు మానేసి కుటుంబ పోషణ కోసం చిరుద్యోగాలు చేశా. అదీ చిత్ర పరిశ్రమలోనే. ఎప్పటికైనా పెద్ద చదువులు చదువుకుని బాగా స్థిరపడాలని ఉండేది. అలా నా జీవితం సాగుతున్న కాలంలోనే ఇండస్ట్రీలో మంచి వేషాలు వచ్చాయి. అప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించా. తను కూడా ఐదు సినిమాల్లో నటించింది. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. వాళ్లింట్లో ఇష్టమే గానీ, మా నాన్నగారు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా నేను పెళ్లి చేసుకున్నా. తను, నేనూ పెళ్లైన కొత్తలో ఒక మాటనుకున్నాం. సినిమాల్లో కొన్నాళ్లు చేశాక అమెరికా వెళ్లి పైచదువులు చదువుకుని అక్కడే స్థిరపడాలని. అలా నేను సినిమాలు చేస్తూ ఉండగా, నటనపై మెల్లగా ప్రేమ పెరిగింది. అవకాశాలు రోజురోజుకూ పెరిగాయి. మరోపక్క తనేమో అమెరికా విషయాన్ని పదే పదే ప్రస్తావించేది. తను కొన్నాళ్లకు చెన్నైలోనే చదువుకోవడం ప్రారంభించింది. ఇదంతా చూసి ఒకరోజు తనని కూర్చోబెట్టి ఇదంతా ఏంటని అడిగా! చివరికి ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించాం. వాళ్లు మా ఆవిడను ‘ఏమ్మా మీ ఆయనకు ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా, నిన్ను పట్టించుకోవట్లేదా’ అని ప్రశ్నిస్తే.. ‘మా ఆయనకు ఒక్క చెడు అలవాటు కూడా లేదు, ఎంతో ఉన్నతమైన వ్యక్తి’ అంటూ సమాధానమిచ్చింది. పైగా కోర్టుకు మేమిద్దరం చేతిలో చెయ్యేసుకుని మరీ వెళ్లాం. మా ఇద్దరి తీరును చూసి న్యాయమూర్తి కూడా ‘మీకు బుద్ధి లేదా.. ఈ మాత్రం దానికి విడాకులెందుకు’ అంటూ చీవాట్లు పెట్టారు. మా ఇద్దరికి కలిగిన సంతానం నిఖిల్‌. ఇప్పటికీ మేమిద్దరం ప్రాణమిత్రుల్లా ఉంటాం. ఎప్పుడైనా అమెరికా వెళ్తే ఆమె ఇంట్లోనే ఉంటాం. ఆమె భర్త నాకు మంచి ఫ్రెండ్‌. ఆమె ప్రస్తుతమున్న నా భార్యకు మంచి ఫ్రెండ్‌. అలాగే వాళ్లు ఇండియా వస్తే మా ఇంట్లోనే ఉంటారు. మా ఇద్దరి మధ్య అంత మంచి అవగాహన ఉంది. మా బంధం పట్ల చాలా సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ తలుచుకుంటే మానసికంగా ఎంతో పరిణతి సాధించాననిపిస్తుంది. మా అబ్బాయితో కూడా నేను చాలా సరదాగా ఉంటా. నిజానికి వాడే ‘ఏంటి నాన్న ఇంకా కుర్రాడిలా ప్రవర్తిస్తావ్‌’ అంటూ నన్ను సరదాగా కోప్పడతాడు. మరి నేను కుర్రాడినే కదా (నవ్వులు). నా జీవితంలో కష్టాన్ని, సుఖాన్ని ఒకే విధంగా చూస్తా. అన్నీ అనుభవిస్తేనే కదా లైఫ్‌.

మీ కెరీర్‌లో కొన్ని అద్భుతమైన చిత్రాలను వదలుకున్నారనుకుంటా?

సురేశ్‌: అవును. మూడు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నాకు అవకాశాలు వచ్చాయి. వాటిలో మొదటిది ‘సీతాకోక చిలుక’. దానికి దర్శకులు ది గ్రేట్‌ భారతీరాజా గారు. ఆయన కథ అనుకున్న తర్వాత ఏదో పనిమీద నేను పనిచేసే ఎడిటింగ్‌ ఆఫీస్‌కు వచ్చారు. వాళ్లకు టీనేజ్‌ నటులు కావాలని చూస్తున్న క్రమంలో నేనక్కడ పనిచేస్తూ కనిపించాను. వెంటనే ఆయన ‘ఈ కుర్రాడు ఎర్రగా, బుర్రగా బాగానే ఉన్నాడే. చూడు చిన్నా రేపు మన ఆఫీస్‌కు వచ్చెయ్‌. నా సినిమాలో హీరోగా చేస్తున్నావ్‌’ అన్నారు. నేనూ వెంటనే ఒప్పేసుకున్నా. ప్రముఖ మేకప్‌ మ్యాన్ పీతాంబరం గారి అబ్బాయి మా నాన్నకు మిత్రుడు. వెంటనే ఆయన మా నాన్నకు ఫోన్‌ చేసి ‘ఒరేయ్‌ మీ వాడికి భారతీరాజా సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందిరా’ అని చెప్పారట. మొదట మా నాన్న నమ్మలేదు. పైగా ఆ సినిమా వాళ్లకు ఫోన్‌ చేసి ‘ఏమండీ! మా వాడిని ఏం చూసి ఎంపిక చేసుకున్నారు. వాడు సెట్‌ కాడు. చేసిన ఒక సినిమా కూడా పోయింది’ అంటూ వాళ్లతో అన్నాడు (నవ్వులు). వాళ్లు దానికి ‘ఫర్వాలేదులెండి.. మేం చూసుకుంటాం’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత చెన్నైలోని పాంగూరా హోటల్‌లో భారతీరాజా గారిని కలిశా. ఆయన నాతో మాట్లాడుతూ ‘చూడబ్బాయ్‌, నా సినిమా చేసేటప్పుడు నువ్వు ఏ సినిమా చేయకూడదు. తర్వాత సినిమా కూడా నాదే అయ్యుండాలి’ అన్నారు. నేనేమో వేరే సినిమా ఒప్పుకున్నానని చెప్పా. దానికి ఆయన ‘కావాలంటే వాళ్లకు నేను చెప్తా, నా సినిమాలో చేయాలంటే ఇవి పాటించాల్సిందే’ అన్నారు. నాకు ఆ టైమ్‌లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మా నాన్నను కలిసి విషయం చెప్పా. ఆయన ‘కెరీర్‌ ప్రకారం అలోచిస్తే భారతీరాజా సినిమా చేయడం బెటర్‌, గానీ విలువల ప్రకారం ఆలోచిస్తే నువ్వు ముందు ఒప్పుకున్న సినిమానే చెయ్యాలి’ అంటూ హితబోధ చేశారు. రెండో రోజు భారతీరాజాగారి దగ్గరకెళ్లి ‘సార్‌ ఆ సినిమా చేసి మీ సినిమా చెయ్యొచ్చా’ అని అడిగా. దానికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో ఆ చిత్రం వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత అది పెద్ద హిట్టయ్యింది. నేను చేసిన సినిమా ‘పన్నీర్‌ పుష్పంగళ్‌’ కూడా అప్పట్లో పెద్ద హిట్టయ్యింది. దాని గురించి నాకు పెద్ద బాధ లేదు. విలువలు పాటించడమే ముఖ్యం. ఇక రెండోది ‘నాలుగు స్తంభాలాట’ ది గ్రేట్‌ దర్శకులు జంధ్యాలగారు నన్ను హీరోగా చెయ్యమని అడిగారు. ఆయన కూడా నా సినిమా చేసేటప్పుడు వేరే సినిమా చెయ్యకూడదన్నారు. మధుసూదనరావుగారని, ఒక సీనియర్‌ నిర్మాత అంతకుముందే నాకు అవకాశం ఇచ్చారు. ఇదా.. అదా అనుకుని మథనపడుతూ చివరకు ‘నాలుగు స్తంభాలాట’ వదులుకున్నా. ఇక మూడోది ‘రోజా’. హీరో పాత్ర కోసం మణిరత్నంగారు నన్ను సంప్రదించినప్పుడు.. రామానాయుడు గారి ‘పరువు-ప్రతిష్ట’ సినిమా చేస్తున్నా. రామానాయుడిగారికి నో చెప్పలేక మణిరత్నం సినిమా కూడా వదులుకున్నా.

‘రోజా’ వంటి పాన్‌ఇండియా సినిమా వదులుకున్నప్పుడు బాధ పడలేదా?

సురేశ్‌: బాధ పడలేదని చెబితే అబద్ధమే అవుతుంది. ఇప్పటికి ఆ సినిమా పాటలు వస్తే నేను వినను. ఎందుకంటే ‘అయ్యో ఒక మంచి సినిమాను వదులుకున్నానే’ అని బాధ పడిపోతా. నేనైతే ఇంకా బాగా చేసేవాడినేమో అని భావిస్తుంటా.

ఒకే ఏడాది 18 సినిమాల్లో నటించారనుకుంటా?

సురేశ్‌: అవును! అప్పుడు రోజుకు మూడు షిప్టుల్లో తెల్లవారుజామున 4 గంటల వరకు పనిచేసేవాడిని. నేను కారులో నిద్రపోతుంటే మేకప్‌మ్యాన్‌ మేకప్‌ చేసేవాడు. ఆ క్రమంలోనే నా డేట్స్‌ చూసుకుంటానని మా నాన్న ముందుకొచ్చారు. నేనూ మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశా. ఆయనేమో ‘ఇంటికొచ్చే లక్ష్మిని ఎందుకు వద్దంటున్నావ్‌..’ అంటూ బిజీ షెడ్యూల్‌ సెట్‌ చేసేవారు. ఆ పని ఒత్తిడి వల్ల నాకు కామెర్లు వచ్చి ఆసుపత్రి పాలయ్యా. సుమారు ఒకటిన్నర నెలపాటు ఆసుపత్రిలోనే ఉన్నా. కేవలం మంచినీళ్లు, కొబ్బరినీళ్లతోనే రోజులు గడిపా. దీంతో బాగా బలహీనంగా తయారయ్యా. అప్పట్లో రామ్‌ నారాయణ్‌ అనే తమిళ దర్శకుడు ఉండేవారు. ఆయన 25 రోజుల్లో షూటింగ్‌ మొత్తం పూర్తి చేసేసేవారు. అంతకంటే ఎక్కువ రోజులు పడితే ఆయన దృష్టిలో చాలా పెద్ద సినిమా. ఆయన డైరక్షన్‌లోనే ఆ సంవత్సరం 9 సినిమాలు చేశా. అప్పట్లో సంవత్సరానికి 18 సినిమాలు రికార్డనేవారు. కానీ ఆ 18లో 2 మాత్రమే బాగా ఆడాయి. దాంతో చాలా నిరుత్సాహపడ్డా. అన్ని సినిమాలు చేసినప్పుడు సగటున మూడోవంతు సినిమాలన్నా హిట్టయితే ఒక అర్థం ఉండేది. దీంతో ఇకపై అలా చేయకూడదనుకున్నా.

హీరోగా అనుకున్న స్థాయికి చేరుకున్నారా?

సురేశ్‌: నిజం చెప్పాలంటే లేదు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టుగానే.. నేనెందుకు స్టార్‌హీరో కాలేకపోయాననే దానికీ చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ బేరీజు వేసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. నాకు రాసిపెట్టిందింతే అనుకుంటున్నా కాబట్టే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. ఎవరినీ కారణంగా చూపదల్చుకోలేదు. ఎందుకంటే సినిమాకు కావాల్సిన విధంగా నన్ను నేను ఎంతగానో మలుచుకునేవాడిని. బాడీ బిల్డింగ్‌ చేశా, సిక్స్‌ప్యాక్‌ చేశా. పడాల్సిన కష్టాలన్నీ పడ్డా. విలన్‌గా నటించా. హీరోగా చేశా. కమర్షియల్‌ సినిమాల్లో ట్రై చేశా.  హీరో కొడితే పదిమంది గాల్లో ఎగరాలనే సినిమాలు చేయాలంటే నాకెందుకో మనస్కరించదు. దాసరి నారయణరావుగారు ‘సూరిగాడు’ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ‘ఒరేయ్‌! నీ ఇంటిపేరు వేరైతే, నీ జీవితం వేరేగా ఉండేదిరా’ అంటూ ఉండేవారు. దానికి సమాధానంగా ‘సార్‌! నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లను చూస్తుంటే నాకు గొప్పగానే ఉంటుంది సార్‌. ప్రస్తుతానికి దేవుడు ఎంత కల్పిస్తే అంతే తీసుకుంటా. అదే నాకు సంతోషం’ అంటూ చెప్పాను. ఉదాహరణకు ఫలానా హీరో, ఫలానా స్టార్‌ కుటుంబంలో పుట్టాడంటే అది అతడి అదృష్టం. నేనెందుకు ఆ ఫ్యామిలీలో పుట్టలేదు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అటువంటి ఆలోచనా విధానం లేకపోవడం వల్లే ఇంత ప్రశాంతంగా ఉండగల్గుతున్నా.

మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకునేంత పరిస్థితులు ఎందుకొచ్చాయి?

సురేశ్‌: ఇంతకు ముందు చెప్పినట్టుగా మణిరత్నం సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను రామానాయుడుగారి దగ్గరికెళ్లా. ఇలా చెప్పగానే ‘ఇప్పుడు నీ ఒక్కడి కోసం నేను సినిమాను వాయిదా వేసుకోవాలా’ అని ప్రశ్నించారు. దీంతో ‘వద్దు సార్‌’ అని చెప్పి తిరిగొచ్చా. ఎందుకంటే నాయుడు గారిని అంతకుమించి బలవంతం చెయ్యలేను. అప్పటికే ఆయన బ్యానర్లో 7 సినిమాలు చేశా. ‘అక్కా చెల్లెలు’, ‘సూరిగాడు’, ‘ప్రేమవిజేత’, ‘పరువు-ప్రతిష్ట’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆయన. అలాంటప్పుడు మధ్యలో ఒక సినిమా వచ్చిందని ఆయన సినిమాను నేను వదులుకోలేను. అలాగే నేనెప్పుడూ పొగరుతో ప్రవర్తించి సినిమా అవకాశాల్ని వదులుకోలేదు. ఎప్పుడైనా సినిమా చేయడం కుదరనప్పుడు ఆ నిర్మాతలకు సున్నితంగా చెప్పేవాడిని. అందులోనూ తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినందువల్ల నాకు పాత్రల్లో వైవిధ్యం చూపించాలనే తాపత్రయం ఉండేది. రజనీ, కమల్‌ అలాగే చేసేవారు. ఆ వైవిధ్యం కోసం ఎన్నో సినిమాలు కాదనుకున్నా. అందుకే ఫక్తు కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్లలేకపోయా. ఒకవేళ సక్సెస్‌ఫుల్‌ హీరో కాలేకపోవడానికి అది కూడా కారణం అయ్యుండొచ్చు. అలాగే బలమైన బ్యాక్‌గ్రౌండ్‌ లేకుంటే కూడా స్టార్‌హీరో రేంజ్‌కు చేరుకోవడం కష్టం. దానికోసం ఎవరో నిర్మాతను బలి చేయాలని నాకు ఉండదు. అందుకే నా పరిధిలో నేను మంచి సినిమాలు చేశా. నా నిర్మాతలంతా బాగుండాలనే తాపత్రయం. ఒకానొక టైమ్‌లో హీరోగా అవకాశాలు లేనప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టాను.

సురేశ్‌ ఇప్పుడు ఆర్థికంగా బాగా సెటిల్‌ అయ్యారా?

సురేశ్‌: ఎవర్నడిగినా లోటుగా చెప్తారు కానీ, నేను మాత్రం ఆర్థికంగా కుదురుకున్నా. ఇంకా సినిమాలు చేస్తున్నా. దక్షిణాది భాషల సినిమాల్లో సుమారు7 చిత్రాల్లో నటిస్తున్నా. మధ్యలో కొన్ని సీరియల్స్‌ చేసి బాగా సెటిలయ్యా. అయిపోయిడ్రా వీడు! అని జనం అనుకోకుండా సీరియల్సే నన్ను కాపాడాయి.

సుమారు ఎన్ని సినిమాల్లో, ఎన్ని భాషల్లో నటించి ఉంటారు?

సురేశ్‌: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఒక సినిమా చేశా. అలాగే మొత్తం 321 సినిమాల్లో నటించా. నేను లెక్కపెట్టలేదు కానీ, అక్కడక్కడ ఉండే నా అభిమానులు వాట్సాప్‌ ద్వారా లిస్టు పంపిస్తుంటారు. ఇక్కడ మీకొక గమ్మత్తైన విషయం చెప్పాలి. నా 110వ సినిమా దగ్గర్నుంచి నా సినిమాలు నేను చూడటం మానేశా. ఇప్పటికి నా ఇంట్లో సినిమాలకు సంబంధించిన ఫొటోలు గానీ, వస్తువులు గానీ ఏమి ఉండవు. ఇంటికెళ్లగానే వేరే ప్రపంచంలో ఉంటా. షూటింగ్‌లో మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తా. ఇంటికెళ్లాక కుకింగ్‌ చేస్తా. బుక్స్‌ చదువుతా, స్క్రిప్ట్‌లు రాస్తా, నా దగ్గర 6000 పుస్తకాలు ఉండేవి. మొన్నీమధ్య ఒక లైబ్రెరీకి ఇచ్చేశా. ఇలా ఒక పని అని కాకుండా మల్టీటాస్కింగ్‌ చేయాలని ఉంటుంది. తమిళంలో ఒక వంట ప్రోగ్రాంకు జడ్జిగా కూడా వ్యవహరించా.

80,90 దశకాల్లో తమిళంలో బాగా బిజీగా ఉన్నమీరు సడెన్‌గా ఎందుకు తెలుగులోకి షిప్ట్‌ అయ్యారు?

సురేశ్‌: తమిళంలో చేసేటప్పుడు నాకు లవర్‌బాయ్‌ అనే ముద్ర బాగా పడింది. అందులోంచి బయటకు రావాలని  ఎంతగానో ప్రయత్నించేవాడిని. ఆ సమయంలోనే ఒక సినిమాలో కావాలని కరడుగట్టిన విలన్‌ పాత్ర పోషించా. దురదృష్టవశాత్తూ ఆ చిత్రం ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నీ లవర్‌బాయ్‌ పాత్రలే. నాకు విరక్తి పుట్టింది. అలా అన్నింటికి నో చెబుతూనే సంవత్సరం గడిచిపోయింది. అప్పుడే రామానాయుడుగారు తెలుగులో ‘పుట్టింటి పట్టుచీర’లో అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే ‘చిన్న కోడలు’ ‘మామాశ్రీ’ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అన్నీ వైవిధ్యమున్న పాత్రలే. మళ్లీ తమిళంలో నటిద్దామనుకుంటే ఆ తరహా ప్రేమకథలే వచ్చేవి. అందుకే కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకుని అజిత్‌, విజయ్‌ లాంటి స్టార్స్‌తో నటించా. ఇప్పుడు మంచి పాత్రలు దక్కుతున్నాయి.

మీ రియల్‌లైఫ్‌లో ప్రేమకథల గురించి చెబుతారా?

సురేశ్‌: తప్పకుండా! ఒక విచిత్రమైన ప్రేమకథ చెబుతా. నేను ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో ఒక అమ్మాయి మంచి అథ్లెట్‌. 400 మీటర్ల పరుగుపందెంలో ఆమె టాప్‌. నేను కూడా అథ్లెట్‌నే. ఒకసారి ఇంటర్‌ కాలేజ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఎలాగైనా ఆ పోటీల్లో గెలిచి గర్వంగా ఆ అమ్మాయికి ప్రపోజ్‌ చేద్దాం అనుకున్నా. ఆ అమ్మాయి 400 మీటర్ల పరుగుపందెం మామూలుగానే గెలిచేసింది. నేను మాత్రం  ఆ రేస్‌లో 6వ స్థానంలో వచ్చా. దీంతో పరువు పోయి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లలేదు. అలా ఆ లవ్‌స్టోరి ముగిసింది.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసినట్టున్నారు?

సురేశ్‌: అవును. తమిళంలో డబ్‌ అయ్యే నాగార్జున సినిమాలకు నేను డబ్బింగ్‌ చెప్పేవాడిని. దాదాపు ఆయన అన్ని చిత్రాలకు నా గొంతే ఉంటుంది. ఈ రోజు నాగార్జునగారిది ఏదైనా యాడ్‌ఫిల్మ్‌ తమిళంలో వస్తే నన్నే సంప్రదిస్తారు. ఎందుకంటే వాళ్ల మైండ్‌లో నాగార్జున వాయిస్‌ అంటే నేనే గుర్తొస్తా. అది కూడా జీవితంలో  ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నేను హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు తిరుమల మెట్లమార్గంలో వెళ్లేవాడిని. సినిమా హిట్టవ్వాలని పొర్లు దండాలు పెట్టేవాడిని. అయినప్పటికి కొన్ని హిట్టయ్యేవి కావు. అప్పుడు అర్థమైంది. సినిమా హిట్టవ్వాలంటే అన్ని డిపార్ట్‌మెంట్లు 100శాతం పనిచేస్తేనేనని. అప్పటినుంచి ఒత్తిడి తీసుకోవడం మానేశాను. నా సినిమా రిలీజ్‌ రోజు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాను. వచ్చాక దాని ఫలితం గురించి తెలుసుకుంటాను.

‘అమ్మోరు’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

సురేశ్‌: శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి గారు, ‘అమ్మోరు’ కథ చెప్పినప్పుడు నేనెంతో థ్రిల్‌ ఫీలయ్యా. కానీ  ఇంత లెవెల్లో గ్రాఫిక్స్‌ చేయగలరా అనే సందేహం ఉండేది. ఎందుకంటే ఒక సీన్‌లో నీటిలో నుంచి చెయ్యి వస్తుంది. ఆ సీన్‌కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత అద్భుతంగా చేశారు. అమ్మోరు సినిమాను రెండు సార్లు తెరకెక్కించారు. మొదటి వెర్షన్‌లో నటుడు చిన్నా, రామిరెడ్డి పాత్రలో నటించారు. కానీ, చిన్నాలో ఆ గంభీరత్వం కనిపించలేదు. నేను, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారూ ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం. తర్వాత రామిరెడ్డిని పెట్టి మొదటి షాట్‌ నుంచి తీసుకుంటూ వచ్చారు. ఒక సీన్‌ కోసం వర్షంలో 14 రోజుల పాటు షూట్‌ చేశారు. తడుస్తూనే ఎంతో ఓపికతో నటించాం. ఫలితం మనమంతా చూశాం ఎంత అద్భుతంగా వచ్చిందో. అలాంటి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను మనమెప్పటికీ చూడలేం. అంత అద్భుతంగా ఉంటాయి. ఆ షూటింగ్‌లో సౌందర్య ‘ఏమండీ బాగా చేశానా’అని నన్ను అడిగేది. నేనేదో సీనియర్‌ ఆర్టిస్ట్ లాగా ‘నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా’ అంటూ చెప్పేవాడిని (నవ్వులు). తర్వాత కాలంలో తనొక బిగ్‌స్టార్‌. అయినా అదే మర్యాదతో మెలిగేది. తర్వాత ఆమెతో ‘దొంగాట’తో పాటు ‘దేవీ పుత్రుడు’లో నటించా. మన దురదృష్టం అంత గొప్ప నటీమణిని దేవుడు త్వరగా తీసుకుపోయాడు.

ఒక పెద్ద హీరోయిన్‌తో ఏంటీ మీ గొడవ? మాట్లాడుకోకుండా 6 సినిమాలు చేశారటగా?

సురేశ్‌: ఒక తమిళ్‌ సినిమాలో ఆ హీరోయిన్‌తో కలిసి నటించేటప్పుడు ఒక గాసిప్‌ను క్రియేట్‌ చేశారు. మేమిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఒక పేపర్‌ ఆర్టికల్‌లో కూడా వేశారు. ఈ రూమర్‌ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేనేంటి అలా చేయడం ఏంటని. సినిమా హైప్‌ కోసం యూనిట్‌లో వాళ్లే ఆ రూమర్‌ సృష్టించారని తర్వాత తెలుసుకున్నాం.  అప్పుడంతా తెలిసి తెలియనితనం. దీంతో ఆమెతో మాట్లాడటం మానేశా. నేనలా చేసేసరికి ఆవిడ కూడా మాట్లాడటం మానేసింది. అలా ఉంటూనే 6 సినిమాల్లో కలిసి నటించాం. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలకృష్ణగారి సినిమాలో ఆమె నటిస్తునప్పుడు నేను ‘సూరిగాడు’ చిత్రంలో చేస్తున్నాను. ఆ రెండు షూటింగ్‌లు ఊటీలో పక్కపక్కనే జరుగుతున్నాయి. అప్పుడు ఒకరికొకరం ఎదురుపడి హాయ్‌! చెప్పుకున్నాం. ఆ తర్వాత మాటలు కలిశాయి. అప్పుడు అసలు విషయం తెలిసింది. మా ఇద్దరికి తెలియకుండానే బయటవాళ్లు కొందరు కావాలని ఇలా చేశారని. ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నాం.

ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్‌ ఎవరు?

సురేశ్‌: శ్రీకాంత్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌ వీళ్లంతా నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం.

‘ఆలీతో సరదాగా షో’ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న షోలన్నింటిలో ఇది ఎంతో పాపులర్‌ అయ్యింది. బాల నటుడి నుంచి ఈ స్థాయికి వచ్చిన నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మా అమ్మకు ఈ షోకు వెళ్తున్నానని చెప్పగానే ఎంతో సంతోషపడింది. ఎందరో మహానుభావులు ఈ షోకు వచ్చారని, చాలా అసక్తికరంగా ఉంటుందని చెప్పింది. అప్పుడే అనుకున్నా... నేను ఓ అత్యుత్తమ టీవీ షోకు వెళ్తున్నానని.
                                                                                                                                       

- ఇంటర్‌నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి!

ఈ బతుకు అవసరమా అనిపించింది: శ్రీలక్ష్మి

రూ.75 వేల సంపాదన వదిలి రూ.500లకు పనిచేసి..!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని