close
Published : 04/03/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!

ఆయన వెండితెరపై యంగ్‌ యమలోకాన్ని అత్యద్భుతంగా చూపించిన ప్రతిభావంతుడు. సాగరతీరాన తాజ్‌మహల్‌ నిర్మించిన గొప్ప కళా దర్శకుడు. ఆమె 20 ఏళ్ల క్రితం ‘తొలి ప్రేమ’లో తళుక్కున మెరిసి మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘తొలిప్రేమ’తో ఒక్కటైన ఈ ‘కళ’ కలిపిన జంట ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి, నటి వాసుకి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోకి విచ్చేసిన వీరిద్దరూ తమ లైఫ్‌లో జరిగిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఆనంద్‌సాయి చాలా తక్కువగా మాట్లాడతారునుకుంటా?

వాసుకి: మీకు తెలియందేమీ కాదు! మనమంతా కలిసి ‘తొలి ప్రేమ’ చిత్రం చేశాం. అప్పట్లో కూడా అలాగే ఉండేవారు.

‘తొలిప్రేమ’ చేసినప్పుడే ప్రేమలో ఉన్నారా?

ఆనంద్‌సాయి: లేదు! ‘తొలిప్రేమ’ చివరిలో మొదలైంది. అంతకుముందు స్నేహితులుగా ఉండేవాళ్లం. చివరి షెడ్యూల్‌కి మహాబలిపురంలో తాజ్‌మహల్‌ సెట్‌ వేశా. అప్పుడు వాసుకి చెన్నైలో ఉండేది. మొదటి చిత్రం కాబట్టి నిరూపించుకోవాలనే తాపత్రయం ఉండేది. అదే టైమ్‌లో వాసుకితో ఫ్రెండ్లీగా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ క్రమంలోనే తనని మహాబలిపురం తీసుకెళ్లి ‘తాజ్‌ మహల్‌’సెట్‌ చూపించా. తనకు ఎంతో నచ్చింది.

ధార్మిక రత్న అవార్డు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?

ఆనంద్‌సాయి: నా జీవిత ప్రయాణంలో అదొక మధుర ఘట్టంగా భావిస్తున్నా. దేనినీ నేను ప్లాన్‌ చేసుకోలేదు. ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణంగా చేయాలనే ఆలోచనే నాలో ఉంటుంది.

మీ సొంతూరు?

ఆనంద్‌సాయి: నాన్నగారు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.చలం. మాది ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కవిటి. నాన్నకు చిన్నతనం నుంచి ఆర్ట్‌పై ఎంతో మక్కువ ఉండేది. దాన్నే వృత్తిగా మలుచుకోవాలనే ఉద్దేశంతో కొంత శిక్షణ తీసుకుని రూ.10తో అవకాశాల కోసం చెన్నై వచ్చారు. అప్పటి ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డిగారు పాండీ బజార్‌లోని ఒక హోటల్‌కు వచ్చి కాఫీ తాగుతుంటే ఆయన చిత్రాన్ని అచ్చుగుద్దినట్టు గీసి ఇచ్చారట. ఆ తర్వాత ‘పాతాళ భైరవి’కి చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్ట్‌ పెయింటర్‌ పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కాలంలో అనేక చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

‘తొలిప్రేమ’ కంటే ముందే మీ ఇద్దరికి పరిచయం ఉందా?

వాసుకి: లేదు. ఆ షూటింగ్‌ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారే ఇద్దరికి పరిచయం చేశారు. అప్పుడు నన్నొక దెయ్యాన్ని చూసినట్టు చూసి పారిపోయారు(నవ్వులు). అది అమ్మాయిలను పడేసే టెక్నిక్స్‌లో ఒక భాగమేమో. ‘ఏంటి ఇలా పారిపోతున్నాడు’ అని నేనూ ఆలోచించేదాన్ని. ఆ తర్వాత కూడా పవన్‌గారు ఆయన్ని పట్టుబట్టి తీసుకొచ్చి మళ్లీ పరిచయం చేస్తే ‘హాయ్‌’ చెప్పి వెళ్లిపోయాడు. అలా తొలి పరిచయం అయ్యింది.

ఆయన లవ్‌ని మీరు రిజెక్ట్‌ చేస్తే ఏదో కథ చెప్పి ఓకే చెప్పేలా చేశారట?

వాసుకి: అది కథేం కాదు కానీ, నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పడానికి ఆనంద్‌ ఎప్పుడూ ఐలవ్‌యూ అని చెప్పలేదు. నేరుగా పెళ్లి ప్రస్తావనే తీసుకొచ్చాడు. నేను సున్నితంగా తిరస్కరించా. స్నేహితులుగానే ఉందామని చెప్పా. దానికి ఆయన ‘లేదు వాసూ మనం ఫ్రెండ్స్‌గా ఉండలేం. ఎవరైనా టెన్త్‌ చదివి ప్లస్‌టూ చదువుతారు కానీ, ప్లస్‌టూ చదివాక మళ్లీ టెన్త్‌కి రాలేరు కదా’ అనే డైలాగ్‌ కొట్టి ఫోన్‌ పెట్టేశాడు. ఆ మాటకు ఏం చెప్పాలో.. ఎలా స్పందించాలో కూడా నాకర్థం కాలేదు. అది జరిగి  15రోజులు గడిచాక ‘యస్‌’ చెప్పా.

గంట సేపు పట్టే ప్రయాణాన్ని వాసుకి కోసం 15 నిమిషాల్లో వెళ్లారట? ఏంటా కథ?

వాసుకి: అవును! నేనప్పుడు కంప్యూటర్‌ క్లాస్‌లకు వెళ్తుండేదాన్ని. నాన్నే నన్ను తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇనిస్టిట్యూట్‌కి రావడానికి కొంత టైం పట్టేది. ఈ గ్యాప్‌లో ఆనంద్‌, నేనూ కలిసి బైక్‌పై మహాబలిపురం దాకా వెళ్లేవాళ్లం. ఒకరోజు ఇలాగే అక్కడకు వెళ్లాక, నాన్న ముందుగానే ఇనిస్టిట్యూట్‌కి వస్తున్నారని తెలిసింది. వెంటనే ఆనంద్‌ బైక్‌పై నన్ను తీసుకొచ్చి అక్కడ దింపాడు. మామూలుగా అయితే 45 నిమిషాలు పట్టేది కానీ, ఆనంద్‌ కేవలం 16 నిమిషాల్లో అక్కడికి తీసుకొచ్చేశాడు. నిజంగా చెప్పాలంటే బైక్ ఎక్స్‌లేటర్‌పై నిల్చొని మరీ డ్రైవ్‌ చేశాడు( నవ్వులు)

మీ పెళ్లి ఎక్కడ జరిగింది?

ఆనంద్‌ సాయి: షిర్డీలో చేసుకున్నాం. మా పెళ్లికి వాసుకి వాళ్ల పేరెంట్స్‌ ఒప్పుకొన్నారు కానీ, మా నాన్న ఒప్పుకోలేదు. ఆయన వేరే సంబంధం చూసి ఆమెనే చేసుకోవాలన్నారు. లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. నేను వాసుకీకి మాట ఇవ్వటంతో ఇంట్లో నుంచి వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నా. వీళ్ల ఇంట్లో వాళ్లు కూడా మొదట మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమా కెరీర్‌ స్థిరంగా ఉండదని ఆమె నాన్న అభిప్రాయం. కానీ, వాసుకి దృఢ నిశ్చయంగా ఉండటంతో ఒప్పుకొన్నారు. మాకు ఒక పాప పుట్టాక మా అమ్మ, నాన్న ఇంటికి రావడం ప్రారంభించారు.

సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఆనంద్‌సాయి ఎలా పడ్డాడు?

ఆనంద్‌సాయి: సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా నా చివరి చిత్రం ‘ఎవడు’. అప్పటికి ఇంకొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నా. అప్పుడే చిన్నజీయర్‌ స్వామివారి నుంచి పిలుపొచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఆయన ఆశ్రమం ప్రాజెక్టు డిజైన్లు చేయమని చెప్పారు. అక్కడే కొన్ని గంటల్లో డ్రాయింగ్స్‌ గీసి ఇచ్చా. అవి చూసిన ఆయన ఆ ప్రాజెక్టు నన్నే చేయమన్నారు. నేను డైలామాలో పడ్డా. సినిమానా లేక ఇదా? అని. వాళ్లు కొంచెం టైం తీసుకుని నిర్ణయం చెప్పమన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు మై హోమ్‌ జగపతిరావుగారితో ట్రావెల్‌ అయ్యాను. ఆయన కూడా ‘స్వామివారు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే మీలో ఉన్న కళ ఆయనకు బాగా నచ్చి ఉంటుంది. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేయండి’ అని నాతో అన్నారు. అయితే అక్కడ మనకు సినిమాల్లో వచ్చినంత ఆదాయం ఉండదు. మన అవసరాల వరకే ఇస్తారు. ఇదే విషయాన్ని వాసుకీతో చెప్తే ‘నీకేది అనిపిస్తే అది చెయ్‌’ అంటూ ప్రోత్సహించింది. ఆ తర్వాత చినజీయర్‌ స్వామివారితో కలిసి రెండున్నరేళ్లు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగా. అప్పుడే ఒడిశాలో ఉండే పద్మవిభూషణ్‌ గ్రహీత స్థపతి రఘునాథపాత్రోగారి దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకున్నా. అప్పుడే సీఎంగారి దగ్గర నుంచి కాల్‌ వచ్చింది. యాదాద్రి టెంపుల్‌కు వర్క్‌ చేయాలని చెప్పారు. నేనప్పటి దాకా పరిశీలించింది, చేసింది వైష్ణవ దేవాలయాల గురించే కాబట్టి వెంటనే ఒప్పుకొన్నా. సీఎంగారిని కలిసే ముందే రోజే కొన్ని డిజైన్లు గీసుకున్నా. వాటిని చూపించాక సీఎం గారు ‘నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి, మీరు యాదాద్రిని డిజైన్‌ చేయండి’ అని కోరారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొదలుపెట్టి మొత్తం 4 వేల డిజైన్స్‌ ఇచ్చా. అయోధ్యలో నిర్మించే రామమందిరానికి కూడా ఫౌండేషన్‌ లెవెల్లో నా సలహాలు అడిగారు.

ఇవన్నీ చేశాక మీరెలా ఫీలవుతున్నారు?

ఆనంద్‌సాయి: స్థపతిగా దేవాలయాల నిర్మాణం చేయాలనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. చిన్నతనంలో బడిలో కంటే ఎక్కువగా ఆలయాల్లోనే ఉండేవాడిని. అలాగే పాత సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. కలర్‌ సినిమాలు అస్సలు చూడను. ముఖ్యంగా ‘మాయా బజార్‌’లో ఆర్ట్‌ని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండేవాడిని. ఆ ఆర్ట్స్‌లో ఒక ఆత్మ ఉంటుంది. అలాగే ఆలయాలను నిర్మించటం అనేది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. సినిమాలకు సెట్స్‌ వేసినట్టు చేస్తే కుదరదు. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించాలి. అలా ఐదేళ్లు యాదాద్రి నిర్మాణంలో భాగమయ్యా.

పూర్తయిన యాదాద్రి నిర్మాణం చూస్తే ఏమనిపిస్తుంది?

ఆనంద్‌సాయి:  ఆ నిర్మాణాన్ని ఎప్పుడు చూసినా కొత్త అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అడిగింది లేదన్న మాటే లేదు. ఎక్కడా రాజీ పడలేదు. ఆలయ నిర్మాణంపై సుమారు 40 నుంచి 50 సమావేశాలు జరిపాం. సీఎంగారికి  దేవాలయాలపై అపారమైన జ్ఞానం ఉంది. అలాగే భూపాల్‌రెడ్డిగారు, కిషన్‌రావుగారి సహకారం మరువలేనిది. క్యూలైన్ నిర్మాణాన్నే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మలిచాం.

ఒక ప్రముఖ హీరో, మీరూ కలిసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నారట కదా? ఎవరా హీరో?

ఆనందసాయి: మీకు తెలియందేమి కాదు! ఒకప్పుడు నేనూ పవన్‌ కల్యాణ్‌ అలా అనుకున్నాం. దానికంతా పెద్ద ప్లాన్‌ చేసుకున్నాం, కానీ కుదరలేదు. ఆయనకు సినిమా అవకాశం వచ్చి హైదరాబాదు వెళ్లిపోయారు. నేనేమో చెన్నైలో ఉండిపోయా. మా ఇద్దరి పరిచయం కూడా బ్రైటెన్‌ ఇనిస్టిట్యూట్‌లో అయ్యింది. అప్పట్లో కోయంబత్తూరు నుంచి వచ్చే ఎర్కాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో ఉండేవాళ్లం. ఆ ట్రైన్‌లో సినిమా వాళ్లంతా చెన్నై వచ్చేవారు. అప్పుడు పవన్‌ వాళ్లన్నయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటే నేను మా నాన్న కోసం వెయిట్‌ చేస్తూ ఉండేవాడిని. అక్కడ నుంచి మా స్నేహం ఇంకా బలపడింది. నాకు బైక్‌ ఉండేది కానీ, పెట్రోల్‌కి డబ్బులుండేవి కావు. కల్యాణే పెట్రోల్‌ పోయించేవారు. అలా ఇద్దరం చెన్నై మొత్తం తిరిగేవాళ్లం.

యాదాద్రి ప్రాజెక్టు రాగానే పవన్‌ ఎలా స్పందించారు?

ఆనంద్‌సాయి: ఎంతో గర్వంగా ఫీలయ్యారు. అదొక పవిత్ర కార్యమని, ఎంతో శ్రద్ధతో చేయమని సూచించారు. నేను ఏ పనికీ ప్లాన్ చేసుకోను. నేనేం చేయగలనో అది మాత్రమే ఒక చేసుకుంటూ వెళ్లిపోతా. ఉదాహరణకు ఆలయాలను రూపకల్పన చేస్తున్నా కాబట్టి మరీ భక్తుడిలా మారిపోను. ఏది డిజైన్‌ చేసినా అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటా. దానికంటూ ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటా. ఎంతో మంది స్థపతులను కలిశా. వారిలో చెన్నైలోని గణపతి స్థపతి, ముత్యాల స్థపతి వంటి వారున్నారు. వారు నేను చిత్రాలను గీసే విధానం చూసి ‘మీరు విశ్వకర్మనా’ అని అడిగేవారు. మా నాన్నగారు చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు కానీ, పట్టించుకోలేదు. విశ్వకర్మలకు జీన్స్‌ ప్రకారమే ఆ కళ వచ్చేస్తుంది. ఎందుకంటే పురాణాల్లో వారే ఈ ఆలయ నిర్మాణాలన్నీ చేపట్టారు.

యాదాద్రి ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎంగారి స్పందనేంటి?

ఆనంద్‌సాయి: ఒక్కసారనే కాదు! చాలాసార్లు సీఎంగారు నన్ను అభినందించారు. క్యాంప్‌ ఆఫీస్‌లో ఆయనతో మీటింగ్‌ జరిగినప్పుడు అక్కడికక్కడే ఆయన ఆలోచనలకు తగ్గట్టు డ్రాయింగ్‌ గీసి ఇచ్చేవాడిని. అవన్నీ చూశాక చాలా మందితో ఇలా అనేవారు ‘ఆనంద్‌ మంచి ఆర్టిస్ట్, ఆయన్ను మనం బాగా వినియోగించుకోవాలి’ అని. అలాగే భద్రాచలం టెంపుల్‌ కూడా డిజైన్‌ చేయమని చెప్పారు. కేసీఆర్‌గారు నాకొక దేవుడిలాగా అనిపిస్తారు. ఎందుకంటే యాదాద్రి మొత్తం స్టోన్‌తోనే నిర్మించాం. ఆయన ఎక్కడా రాజీ పడకుండా సహకరించారు. అలాగే చినజీయర్‌స్వామివారు, నాకు అన్నివేళలా సరైన సూచనలు ఇస్తూ ఒక మహత్‌ కార్యాన్ని పూర్తి చేయించారు. నేనెప్పుడు కనిపించినా ‘మహారాజ్‌’అని పిలుస్తారు.

మీలో ఒకరిలోఒకరికి నచ్చిన, నచ్చని అంశాలేంటి?

వాసుకి: నచ్చిన అంశం అయితే ఆయన కష్టపడేతత్వం. ఒక పని చేపడితే 24 గంటలూ దాని గురించే ఆలోచిస్తారు. యాదాద్రి విషయంలోనే కాదు, సినిమాలకు సెట్స్‌ వేసినప్పుడు కూడా అంతే. అప్పట్లో ఇంటికొచ్చి కేవలం ఒకట్రెండు గంటలు మాత్రమే ఉండేవారు. అప్పుడు కూడా సెట్స్‌లో అవి బాగున్నాయా, ఇవి  బాగున్నాయా అని అడుగుతూ ఉంటారు. అలాంటి తపన, హార్డ్‌వర్క్‌ నేనెవరి దగ్గరా ఇప్పటివరకూ చూడలేదు. నచ్చని అంశం అంటే షార్ట్‌టెంపర్‌. త్వరగా కోపమొచ్చేస్తుంది. కానీ ఎంత త్వరగా కోప్పడతారో అంతే త్వరగా కూల్‌ అయిపోతారు. ప్రస్తుతం అయితే ఆ కోపం తగ్గిపోయింది. ఇదివరకటిలా లేదు.

ఆనంద్‌: నచ్చిన విషయమైతే కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. అలాగే నన్ను బాగా మోటివేట్‌ చేస్తూ ఉంటుంది. నేను బాగా పని ఒత్తిడిలో ఉంటే కాసేపు తనతో మాట్లాడగానే ఆ బాధంతా తీరిపోతుంది. ఇక నచ్చని విషయాలంటూ ఏమీ లేవు.

ఒక తమిళ అమ్మాయి వాసుకీకి తెలుగు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

వాసుకి: డైరెక్టర్‌ కరుణాకరన్‌ వల్లే. తమిళంలో నేను నటించిన ‘ఆలుమగలు’ అనే సీరియల్‌లో చూసి సంప్రదించారు. ఆయన కథను వివరించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయన్ను అన్నయ్యలాగా భావిస్తా. ఆయనతో పనిచేసేటప్పుడు మనం సురక్షితమైన ప్లేస్‌లో ఉన్నాం అనే ఫీలింగ్‌ వస్తుంది.

‘తొలిప్రేమ’వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత వాసుకి మళ్లీ తెరపై కనిపించలేదెందుకని?

వాసుకి: నేనెప్పుడూ నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదు. అనుకోకుండా నటించాల్సి వచ్చింది. నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడు సీరియల్స్‌ నటించటం మొదలు పెడితే 19ఏళ్లు వచ్చేటప్పటికి 23 టీవీ సీరియల్స్‌ లో నటించా. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. అలా ‘తొలిప్రేమ’లో నటించా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం నటన నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత ఆనంద్‌తో పెళ్లి, పిల్లలు, వాళ్ల బాధ్యతలు.. అలా సరిపోయింది. మాకు ఇద్దరు పిల్లలు, పాప హర్షకు 20 ఏళ్లు, బాబు సందీప్‌కు 18 సంవత్సరాలు.

మీ ఫ్యామిలీ అంతా హాంకాంగ్‌ వెళ్లినప్పుడు ఒక వ్యక్తి వల్ల మీ బాబు తప్పిపోయారట? ఎవరా వ్యక్తి?
వాసుకి: ఇంకెవరూ! ఈయనే(ఆనంద్‌ని చూపిస్తూ) ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు అక్కడ బాగా ట్రాఫిక్‌ టైం. స్టేషన్‌లో జనం రద్దీ బాగా ఉంది. ట్రైన్‌లో ఉన్నప్పుడే ఆయనకు చెప్పా. నేను పాపను పట్టుకుంటాను, మీరు బాబును చూసుకోండి అని. దిగి కొంత దూరం వెళ్లాక చూసుకుంటే ఆనంద్‌ చేతిలో బాబు లేడు. ఆయన్ను అడిగితే ‘ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు, ఇంతలోనే మాయమయ్యాడు’అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే కనుచూపు మేర ఎక్కడా బాబు కనిపించలేదు. ‘మీరెక్కడైనా తప్పిపోతే ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడికి కదలకండి. నేను ఎలాగైనా వచ్చి మిమ్మల్ని పట్టుకుంటా’ అని చెబుతుండేవాళ్లం. ఆ మాటలు వాడి బుర్రలో బాగా ఎక్కాయేమో, తప్పిపోయిన చోటే ఒక చైనీస్‌ వ్యక్తి చేయి పట్టుకుని అతని ఫోన్‌తో నా ఇండియా నెంబరుకు ఫోన్‌ చేస్తున్నాడు. ఆ చైనీస్‌ వ్యక్తి మాట్లాడుతూ ‘మేడమ్‌ మీ అబ్బాయి నా చేయి గట్టిగా పట్టుకుని నన్నసలు కదలనివ్వలేదు’ అంటూ చేయి చూపించాడు. అతని మణికట్టు ఎర్రగా వాచిపోయింది(నవ్వులు) అలా వాడు మళ్లీ దొరికాడు. వాడికి గుర్తొచ్చినప్పుడల్లా ఇదే అంటూ ఉంటాడు.

మళ్లీ సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఉంటుందా?

ఆనంద్‌సాయి: మంచి ప్రాజెక్టులు వస్తే చేయాలని ఉంది. ప్రస్తుతం ఈ రెండు,మూడు నెలలు చిన్న చిన్న పనులు ఉన్నాయ్‌.

రూ.100 కావాలన్నా మీ భార్యనే అడుగుతారట?

ఆనంద్‌సాయి: అవును! ఎందుకంటే నాకు డబ్బును ఎలా మెయింటెన్‌ చెయ్యాలో తెలియదు. నాకు బాగా డబ్బు అవసరం అయ్యేది కారులో పెట్రోల్‌ కొట్టించుకోవడానికే. అంతకు మించి డబ్బుతో పెద్దగా పనిలేదు. ఆర్ట్‌ డైరెక్టర్‌ కాక ముందు కొన్ని ఉద్యోగాలు చేశా. అప్పుడపించేది, నాకంటూ ఒక పర్సు, అందులో డబ్బు ఉండాలని. తను నాకు వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్లీ మిగిలిన డబ్బు అడుగుతుంది(నవ్వులు)

ఆనంద్‌సాయి వేసిన సెట్స్‌లో బాగా నచ్చింది ఏది?

వాసుకి: ‘యమదొంగ’ మూవీలో వేసిన యమపురి సెట్‌. కనిపించడు కానీ ఆనంద్‌ ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారు. దానివల్లే యాదాద్రి ప్రాజెక్టు కూడా చేశారేమో. ఆయన ఎంత ఆధ్యాత్మికంగా ఉంటారో ఒక ఉదాహరణ చెప్తా. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్తే ఎక్కువగా ఆలయాలకే తీసుకెళ్లేవారు. అలా మహాబలిపురం, సాయిబాబా గుడి, మాంగాడు అమ్మవారి గుడి, తిరువర్‌ ఘాడ్‌, మైలాపూర్‌ ఆలయం ఇలా అన్ని దేవాలయాలకు తిప్పారు. ఇదే రిపీట్ అవుతూ ఉండేది. అప్పుడు నాకర్థమైంది ఏంటంటే మనిషి పైకి భక్తుడిలా కనిపించకపోయినా మంచి ఆధ్యాత్మికంగా ఉంటారని! యాదాద్రిని కూడా అదే భక్తితో పూర్తిచేశారు.

మళ్లీ సినిమాల్లోకి వాసుకి రీ ఎంట్రీ ఉంటుందా?

వాసుకి: యంగ్‌ ఏజ్‌లో వరుసపెట్టి సినిమాల్లో, సీరియల్స్‌ నటించటం వల్ల కొంత గ్యాప్‌ కావాలనుకున్నాను. ప్రస్తుతం పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. కొంచెం ఖాళీ సమయం దొరుకుతుంది. ఒకవేళ నా  అభిరుచికి తగ్గ పాత్రలు వస్తే నటించడానికి  సిద్ధం.

ఇంత మౌనంగా ఉండే ఆనంద్‌ ఎప్పుడైనా ఆట పట్టించిన దాఖలాలు ఉన్నాయా?

వాసుకి: ఎందుకు లేవు! పైకి అలా కనిపిస్తారు కానీ, జోక్స్‌ వేస్తారు. నన్ను, పిల్లల్ని బాగా ఆటపట్టిస్తారు. ముఖ్యంగా మా అమ్మాయినైతే రోజూ ఏడిపిస్తూనే ఉంటారు. తనేదైనా మంచి డ్రెస్‌ వేసుకుని రెడీ అయితే ‘ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావ్‌గా, మళ్లెందుకు ఇంత చెండాలంగా తయారయ్యావ్‌’అంటూ ఆట పట్టిస్తుంటారు(నవ్వులు). మంచి హ్యూమర్‌ ఉన్న వ్యక్తి. ఆనంద్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. బాగా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్లడిగింది లేదనుకుంటా ఇస్తారు.

మీ ఇద్దరి పిల్లల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?

ఆనంద్‌ సాయి: ఆ దేవుడు మాకిచ్చిన వరంగా భావిస్తాం. ఇల్లు ఆహ్లాదంగా ఉంటేనే మనం చేసే పని శ్రద్ధగా చేయగలం. మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా మా పిల్లల ముందే చర్చించుకుంటాం. వాళ్ల కూడా జోక్యం చేసుకుంటారు. నాకు ఏ ఇబ్బందులున్న మా అమ్మాయితో చెప్తా. కుటుంబ సభ్యుల మధ్య ఏ అమరికలు ఉండకూడదనేదే నా అభిప్రాయం. కుటుంబమంతా స్నేహితుల్లా ఉంటాం.

మీ సక్సెస్‌ మీ తండ్రి చూశారా?

ఆనంద్‌సాయి: మా నాన్నకు నేను చిత్ర పరిశ్రమలోకి రావడం ఇష్టం లేదు. నేనెక్కడ ఆయన పేరు చెడగొడతానేమోననే భయం ఉండేది(నవ్వులు). ఆయన్ను సెట్స్‌కి కారులో తీసుకెళ్లేవాడిని కానీ, ఎప్పుడూ నాకు ఆసక్తి ఉందని  చెప్పలేదు. అందుకే ఉద్యోగం చేసేవాడిని. పవన్‌ హైదరాబాద్‌ వెళ్లాక తనతోపాటు ట్రావెల్‌ అయ్యే ఒక ఫ్రెండ్‌ కావాలనుకున్నాడు. అందుకే మా నాన్నకు చెప్పి నన్ను ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. నేనెక్కడా ట్రైనింగ్‌ తీసుకోలేదు. ఆర్ట్‌ అనేది మా తండ్రి నుంచి వచ్చిన గిఫ్ట్‌. అలా నాకు ఏదనిపిస్తే అది డిజైన్‌ చేసేవాడిని.  మా అమ్మతో నాకు ఎక్కువ అనుబంధం ఉండేది. నా జీవితంలో ఆమె సహకారం మరువలేనిది.  ఇటీవలే ఆవిడ కాలం చేశారు.

ఈ సందర్భంగా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా?

ఆనంద్‌సాయి: పవన్‌కు చెప్పాలనుకుంటున్నా.. ఎందుకంటే నాలో ఒక ఆర్టిస్ట్‌ ఉన్నాడని మొదట గుర్తించింది ఆయనే. 

వాసుకి: మా తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లు నా మాటకు ఎప్పుడూ విలువనిచ్చేవారు. నా మొండితనాన్ని భరించేవారు. చిన్నప్పటి నుంచి నిర్మొహమాటంగా నా అభిప్రాయాలు చెప్పేసేదాన్ని. ఆనంద్‌తో పెళ్లి విషయం వాళ్లకు చెప్పినప్పుడు మొదట కుదరదన్నారు. అలా అయితే మీరు మా పెళ్లికి రానవసరంలేదన్నా. చివరకు ఎలాగో ఒప్పుకున్నారు. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. ముఖ్యంగా మా అమ్మాయితో నేను మాట్లాడేటపుడు. అలాగే ఆనంద్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. ఇంటి బాధ్యతలు నాకప్పగించటం వల్లే ఆల్‌రౌండర్‌గా మారిపోయా(నవ్వులు). తర్వాత మా పిల్లలకు థ్యాంక్స్‌ చెబుతా.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని