రివ్యూ: బ‌ంగారు బుల్లోడు - allari naresh bangaru bullodu telugu movie review
close
Published : 23/01/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: బ‌ంగారు బుల్లోడు

చిత్రం: బంగారు బుల్లోడు

న‌టీన‌టులు: అల్లరి నరేష్‌,, పూజా ఝ‌వేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, వెన్నెల‌ కిషోర్‌, రాజేష్‌, పృథ్వీ తదిత‌రులు

సంగీతం: సాయి కార్తీక్

కూర్పు‌: ఎం.ఆర్‌.వర్మ

ఛాయాగ్రహ‌ణం: సతీష్‌ ముత్యాల‌

నిర్మాత: సుంకర రామబ్రహ్మం

రచన, దర్శకత్వం: గిరి పలిక

విడుదల‌ తేదీ: 23-01-2021

సంస్థ‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

మెరుపు వేగంతో సినిమాలు చేసే నటుడు అల్లరి నరేష్‌‌. మూడు నెల‌ల‌కో సినిమాతో  ప్రేక్షకుల ముందుకొచ్చి న‌వ్వించ‌డం ఆయ‌న శైలి. కానీ, కొంత‌కాలంగా ఆ వేగం త‌గ్గింది. ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. కానీ, ఫ‌లితాలు మాత్రం రావ‌డం లేదు. మునుప‌టిలా ఆయ‌న సినిమాలు న‌వ్వించ‌డం లేదు. అల్లరి నరేష్‌ గ్రామీణ నేప‌థ్యంలో సాగే సినిమా చేయ‌క చాలా రోజులైంది. ఆ క‌థల‌పై మ‌రోసారి నమ్మకం ప్రదర్శిస్తూ ‘బంగారు బుల్లోడు’ చేశాడు. మ‌రి ఈ చిత్రంతో న‌రేష్ ఏ మేర‌కు న‌వ్వించాడో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం!

క‌థేంటంటే: గ్రామీణ బ్యాంక్‌‌లో గోల్డ్ లోన్ విభాగంలో ప‌నిచేస్తుంటాడు భ‌వాని ప్రసాద్‌ (అల్లరి నరేష్‌‌).  తాత (త‌నికెళ్ల భ‌ర‌ణి) చేసిన త‌ప్పుల వ‌ల్ల త‌న‌కీ,  త‌న సోద‌రులు (స‌త్యం రాజేష్‌, ప్రభాస్‌ శ్రీను)  పెళ్లి కావ‌డం లేద‌ని తెలుసుకుంటాడు. తాత చేసిన త‌ప్పుని స‌రిదిద్దాల‌నుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు? ఇంత‌కీ తాత చేసిన త‌ప్పేమిటి? ఊళ్లో అమ్మవారి న‌గ‌ల‌కి.. భ‌వాని ప్రసాద్‌ కుటుంబానికి సంబంధం ఏమిటనేది మిగిలిన క‌థ‌.

ఎలా ఉందంటే: ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో న‌రేష్ చెప్పిన‌ట్టుగా ఇందులో క‌థ ఉంది. ఆయ‌న ఇదివ‌రకు చేసిన  కొన్ని సినిమాల్లో క‌థ  కంటే కూడా కామెడీ కోసం చేసిన ప్రయత్నాలే ఎక్కువ‌గా క‌నిపించేవి. కానీ ఈ సినిమా వ‌ర‌కు ఆయ‌న క‌థ‌కే ప్రాధాన్యం ఇచ్చి రంగంలోకి దిగాడ‌ని ఆరంభంలోనే అర్థమ‌వుతుంది. ఇందులో ఓ మంచి క‌థతోపాటు... ఆ క‌థ‌ని మలుపుల‌తో ఆస‌క్తిక‌రంగా చెప్పేంత స‌రుకూ ఉంది. దర్శకుడు కొంత‌వ‌ర‌కు క‌థ‌తోనే ప్రయాణంచేసి... ఆ త‌ర్వాత న‌రేష్ సినిమా క‌దా, కామెడీ లేక‌పోతే క‌ష్టం అనుకుని మ‌ళ్లీ అటువైపు దృష్టిపెట్టాడు. ఆ కామెడీ అయినా పండిందా అంటే అదీ లేదు. అర‌కొర న‌వ్వులే. అటు క‌థ పక్కదారి ప‌ట్టి, ఇటు కామెడీ స‌న్నివేశాలూ నీరుగారిపోయి సినిమా మధ్యలోనే దారి త‌ప్పిపోయిన‌ట్టు అనిపిస్తుంది.  సినిమా నిండా హాస్య న‌టులు కనిపిస్తారు. కానీ వాళ్లలో వెన్నెల కిషోర్ త‌ప్ప మిగిలినవాళ్లు చేసిన హంగామా ఏ మాత్రం న‌వ్వించ‌దు.

ద్వితీయార్ధంలో జబర్దస్త్‌ని గుర్తు చేస్తూ గెట‌ప్ శీనుతో గెట‌ప్ వేయించారు. కానీ వాటితో కామెడీని మాత్రం రాబ‌ట్టలేక‌పోయారు. ఆరంభ స‌న్నివేశాల్లో క‌థ ప్రేక్షకుడిని సినిమాలో తొంద‌ర‌గా లీనం చేస్తుంది. విరామానికి ముందు స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. న‌గ‌లు మాయం కావ‌డం, పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్టడంతో ఏర్పడే ఉత్కంఠ కొంత‌వ‌ర‌కు ర‌క్తిక‌ట్టిస్తుంది.  కానీ ఆ త‌ర్వాతే క‌థ, క‌థ‌నాల్లో ఆస‌క్తి కొర‌వ‌డుతుంది. అల్లరి నరేష్‌ చాలా రోజుల త‌ర్వాత చేసిన గ్రామీణ నేప‌థ్య సినిమా ఇది. అది ఒకింత కొత్తదనాన్ని పంచుతుంది. 

ఎవ‌రెలా చేశారంటే: అల్లరి నరేష్‌ ఇందులో భావోద్వేగాలు పండించ‌డంపై ఎక్కువ‌గా దృష్టిపెట్టాడు. అవ‌కాశం ఉన్న చోట కామెడీ కోసం కూడా ప్రయత్నం చేశాడు.క‌థానాయిక పూజా ఝవేరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. హీరో హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కూడా పెద్దగా మెప్పించ‌దు. స్వాతిలో ముత్యమంత పాట‌లో మాత్రం కాస్త  గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది. వెన్నెల కిషోర్ ఎన్నారై పాత్రలో ఎప్పట్లానే న‌వ్వించాడు. కామెడీ గ్యాంగ్‌లో ఆయన చేసిన పాత్రే కాస్త న‌యం. పోసాని, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, రాజేష్, పృథ్వి  తదితరులు పాత్రలు పెద్దగా ప్రభావం చూపించ‌లేక‌పోయాయి. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది.చాలా స‌న్నివేశాలు ట్రెండ్‌కి త‌గ్గట్టుగా కాకుండా...  పాత‌కాలం నాటి సినిమాని త‌ల‌పిస్తాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థ‌లో భావోద్వేగాలు - క‌థ‌నం
+ వెన్నెల కిషోర్ న‌వ్వులు - కామెడీ పండ‌క‌పోవ‌డం

చివ‌రిగా: ‘బంగారు బుల్లోడు’ని ఇంకాస్త మెరుగు పెట్టాల్సింది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని