Ananya Panday: నేనెవరికీ డ్రగ్స్‌ సరఫరా చేయలేదు: అనన్య పాండే - ananya panday questioned denies helping aryan khan get drugs
close
Published : 22/10/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ananya Panday: నేనెవరికీ డ్రగ్స్‌ సరఫరా చేయలేదు: అనన్య పాండే

ముంబయి: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్‌ షారుక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నటి అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు రెండో రోజూ ప్రశ్నించారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్‌ వినియోగించలేదని, ఎవరికీ సరఫరా కూడా చేయలేదని ఆమె ఎన్‌సీబీకి వెల్లడించినట్లు సమాచారం. అధికారులు అనన్యను శుక్రవారం 4 గంటలపాటు విచారించినట్లు తెలుస్తోంది. కాగా 2018-19లో ఆర్యన్‌ఖాన్‌కు అనన్య పాండే మూడుసార్లు డ్రగ్స్‌ సరఫరా చేసిందని వాట్సాప్‌ చాట్‌ ద్వారా బహిర్గతమైనట్లు ఎన్‌సీబీ వర్గాలు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఇదే విషయమై ఆమెను విచారించగా మాదకద్రవ్యాల గురించి తనకేమీ తెలియదని, ఎవరికీ సరఫరా కూడా చేయలేదని ఆమె తెలిపినట్లు సమాచారం.  సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఎన్‌సీబీ సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ జరిపిన వాట్సాప్‌ చర్చల్లో అనన్య పేరు రావడంతో అధికారులు ఆమె నివాసానికి వెళ్లి బుధవారం సమన్లు జారీ చేశారు. దీంతో అనన్య గురువారం మధ్యాహ్నం ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరు కాగా దాదాపు రెండు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఆర్యన్‌తో వాట్సాప్‌ చాట్‌ గురించి ఆరా తీశారు. గంజాయి కోసం ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు తెలిపే చాట్‌ను చూపించి అధికారులు ఆమెను ప్రశ్నించారు. అయితే తాను కేవలం జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు ఎన్‌సీబీ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడిగించింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధామేచాల కస్టడీని ఈ నెల 30 వరకు విధించింది. దీంతో అప్పటివరకు ఆర్యన్‌ జైలులోనే ఉండనున్నాడు. అయితే, నిందితులను భౌతికంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ అధికారులు కోర్టులో హాజరుపరచలేదు. బెయిల్‌ కోసం ఆర్యన్‌ పలుమార్లు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో కింది కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆర్యన్‌ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 26న విచారణ జరిగే అవకాశం ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని