Australia: యాంటీ వ్యాక్సిన్‌ నిరసనలు హింసాత్మకం.. ఆందోళనకారులపై పెప్పర్‌ స్ప్రే - anti vaccine protests in australia
close
Updated : 21/09/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Australia: యాంటీ వ్యాక్సిన్‌ నిరసనలు హింసాత్మకం.. ఆందోళనకారులపై పెప్పర్‌ స్ప్రే

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో యాంటీ వ్యాక్సిన్‌ నిరసనలు హింసాత్మకంగా మారాయి. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం ఒక్క డోసు టీకా అయినా వేసుకొని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురికి గాయాలయ్యాయి. అలాగే, 40 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. 

ఇప్పటికే లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మెల్‌బోర్న్‌లో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ ఆందోళనలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నేటి నుంచి రెండువారాల పాటు అధికారులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లను మూసివేశారు. కార్మికుల నిరంతర కదలికలతో కొవిడ్‌ వైరస్‌ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి తమకు సవాల్‌గా మారిందని విక్టోరియాకు చెందిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నిరసనకారులు నినాదాలు చేసుకుంటూ వీధుల్లో ర్యాలీ చేపట్టడం, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడం వంటి దృశ్యాలు టీవీ, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిరసనకారుల్లో నిర్మాణరంగ కార్మికులతో పాటు టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించేవారు, విక్టోరియాలో లాక్‌డౌన్‌ని పొడిగించడం ఇష్టంలేనివారూ ఉన్నారు.

ఈ ఘటనలపై విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్‌ డాన్‌ ఆండ్రూస్‌ స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు, అంతరాయాలు కొవిడ్‌ను తగ్గించడంలో ఏ మాత్రం సత్ఫలితాలివ్వబోవన్నారు. ఇవి కరోనా వైరస్‌ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు, మంగళవారం ఒక్కరోజే విక్టోరియాలో 603 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో వ్యాక్సినేషన్‌ రేటు పెరగడం వల్ల క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. రెండు డోసులూ వేసుకున్నవారి శాతం 70 నుంచి 80శాతానికి చేరితే మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో 53శాతం పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ జరగ్గా.. విక్టోరియాలో 44శాతం మేర జరిగింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని