Tollywood: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ: పేర్నినాని - ap minister perni nani about online cinema tickets system
close
Updated : 20/09/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ: పేర్నినాని

అమరావతి: చిత్ర పరిశ్రమల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

‘‘ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించాం. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తాం. ‘సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారు’ అని ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తాం. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి. అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం అవదని నేను అనుకుంటున్నా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ‘ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది’ అని అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో బెనిఫిట్‌ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదు’’ అని పేర్ని నాని తెలిపారు.

అనంతరం నిర్మాత ఆది శేషగిరిరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒకప్పుడు 1800 థియేటర్లు ఉండేవి. ఇప్పుడవి 1200లకు పడిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఆ థియేటర్‌లను పవర్‌ టారిఫ్‌ సమస్య వేధిస్తోంది. శాలరీలు, డిజిల్‌ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి చిత్ర పరిశ్రమకు ఏవిధంగా సాయం చేశారో అదేవిధంగా జగన్‌ ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. డిజిటల్‌ విధానం వచ్చిన తర్వాత అన్ని థియేటర్లు ఎయిర్‌ కండీషన్‌ చేశారు. థియేటర్‌ ప్రాపర్టీ విలువ పెరిగింది. థియేటర్‌ సెక్టార్‌ బతికించుకుంటే మిగిలిన వాళ్లు బతుకుతారు’’ అని అన్నారు. 

అన్ని విషయాల్లో తమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని మరో నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్‌ షో కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం  తప్పకుండా అనుమతి ఇస్తుందని, ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండేళ్ల కిందట పూర్తి సినిమాను ఏపీలోనే తీశానని, త్వరలోనే ఇక్కడ షూటింగ్‌లు మొదలు పెడతామని వివరించారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కావాలని తామే అడిగామన్న సి.కల్యాణ్‌.. తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని