కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం - ap sec order to register case against kodali nani
close
Updated : 13/02/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

అమరావతి: ఎన్నికల కమిషర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. ఈమేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడవద్దని ఆదేశం

 రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని)ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిన్న  ఆదేశించారు. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లోగానీ, బృందాలతోగానీ మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరు, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌ ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు.

ఏం జరిగిందంటే..

 మంత్రి కొడాలి నాని శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిపై శుక్రవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రమేశ్‌కుమార్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసిచ్చారు. మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని, ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని, షోకాజ్‌ నోటీసు ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు. దానితో సంతృప్తి చెందని రమేశ్‌కుమార్‌... మంత్రిపై చర్యలు తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏడు పేజీల సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేశారు.

నిన్న విలేకర్ల సమావేశంలో మంత్రి నాని వ్యాఖ్యలివీ..

‘చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదు. ఆయనకు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు పరీక్ష చేయించి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో వారికి తగిన వైద్యం అందించాలి. తర్వాత విడతల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనాన్ని, వైకాపా గెలుపును చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్‌ వీళ్లంతా కట్టగట్టుకుని అడ్డం నిలబడినా ఆపలేరు. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారు. రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులకు డోర్‌డెలివరీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి, పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు సీట్లు పెరుగుతాయని భయంతో తెదేపా ఫిర్యాదు చేస్తే రమేశ్‌కుమార్‌ ఆపేశారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై విలేకర్లు ప్రస్తావించగా మంత్రి స్పందిస్తూ.. ‘వీళ్లంతా డ్రామా ఆర్టిస్టులు. నిమ్మగడ్డ రమేశ్‌, చంద్రబాబు వేర్వేరని రాష్ట్రంలో ఎవరూ అనుకోవట్లేదు. ఈయన చెప్పింది ఆయన చేస్తారు.. ఆయన చేసేటప్పుడు ఈయన్ను సంప్రదిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోవడం, పంచాయతీ ఎన్నికలు ముందుకు రావడం, వాటిని ఇన్ని విడతలుగా పెట్టడం ఇవన్నీ హైదరాబాద్‌లోని హోటల్‌లో సమావేశాలు పెట్టుకుని ఎలా చేశారో చూశాం కదా. మొదటి విడత ఎన్నికలయ్యేసరికి ప్రజలు చంద్రబాబుకు గూబగుయ్యిమనిపించారు. మేం ఒక్కటై జగన్‌ను ఇబ్బంది పెడుతున్నామని ప్రజలు భావించి ఇలా తీర్పునిస్తున్నారేమో అనుకుని వెెంటనే స్టాండ్‌ మార్చేసి కేంద్రానికి ఎస్‌ఈసీపైన చంద్రబాబు లేఖలు రాస్తారు. ప్రెస్‌మీట్లు పెట్టి నిమ్మగడ్డను తిడతాను అంటారు. నాకు అడ్వాంటేజ్‌ అవుద్ది నువ్వు తిట్టుకో అని ఈయన చెబుతారు. మీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి’ అని మంత్రి అన్నారు. లోకేశ్‌ను చిత్తూరుజిల్లాలో సర్పంచిగా పోటీ చేయమనండి.. అతణ్ని ఓడించలేకపోతే రాష్ట్రాన్ని వదిలిపోతా అని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..
రెండో దశలోనూ పోటెత్తిన ఓటర్లు

మీ అధికారాలను వాడండి


ఇవీ చదవండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని