నన్నూ అరెస్టు చేయండి: రాహుల్‌ గాంధీ - arrest me too says rahul gandhi tweets covid poster critical of pm modi
close
Published : 17/05/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్నూ అరెస్టు చేయండి: రాహుల్‌ గాంధీ

దిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీ నగరంలో పోస్టర్లు అంటించిన వారిని అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. పార్టీ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, చిదంబరం, అభిషేక్‌ మను సింఘ్వి తదితరులు ట్విటర్‌ ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘నన్నూ అరెస్టు చేయండి’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.

దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ‘ మోదీజీ మన ప్రజల కోసం తయారు చేసిన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎందుకు పంపించారు?’ అని ముద్రించిన పోస్టర్లు ఇటీవల దర్శనమివ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై దాదాపు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై మరో 21 మందిపై కేసులు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్టులను కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ‘ భారత్‌ స్వతంత్రదేశం.ఇక్కడ ప్రతి ఒక్కరికీ వాక్‌స్వాతంత్ర్యపు హక్కు  ఉంది. కానీ, ప్రధాని మోదీ విషయంలో ఇది వర్తించదు. అందుకే దిల్లీ పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు.‘ దిల్లీలో పోస్టర్లు అంటించిన వారిని అరెస్టు చేశారని తెలిసి షాక్‌కు గురయ్యా. అసలు వారిని ఎందుకు అరెస్టు చేశారు? వారిని అరెస్టు చేసే హక్కు ఎవరిచ్చారు? ఈ అరెస్టులు ఎలా ఉన్నాయంటే.. యూపీలో తన తండ్రిని కోల్పోయానని వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్టుంది’ అని అభిషేక్‌ మను  ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో నివారణ చర్యలను పక్కనబెట్టి.. ప్రశ్నించిన వారిపై కక్ష సాధించడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. గత కొన్ని వారాలుగా రోజుకు కనీసం 3 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్‌కు, ఆస్పత్రిలో బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. సకాలంలో వైద్యం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు.  మరోవైపు ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ,మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా కనిపిస్తున్నాయి. వందలాది మృతదేహాలు గంగా నదిలో కొట్టుకురావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్యను తక్కువగా చూపించేందుకే మృతదేహాలను అన్యాయంగా నదిలో విసిరేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీం కూడా స్పందించిన విషయం తెలిసిందే. పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని