Bandla Ganesh: విజయం తథ్యం.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు! - bandla ganesh nomination in maa elections
close
Updated : 27/09/2021 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bandla Ganesh: విజయం తథ్యం.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు!

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌(Bandla Ganesh) అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సోమవారం ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో తాను రాకెట్‌లా దూసుకెళ్తున్నానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే, 100మంది పేద కళాకారులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

‘‘నేను అబద్ధాలు మాట్లాడను. ‘మా’ అసోసియేషన్‌కు భవనం కావాలి. అయితే, ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ప్యాలెస్‌ కడతామంటే కుదరదు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందో లేదో తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే.. కాస్త దూరమైన కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని, 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి ‘మహాప్రభూ మాకు స్థలం ఇప్పించండి. మా డబ్బులతో ఇళ్లు కట్టుకుంటాం’ అని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తే ఎంత గొప్పపనో మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. అయ్యే పనుల గురించి మాట్లాడితే మంచిది. ఫండ్స్‌ కోసం ఎక్కడికో విదేశాలకు వెళ్తారట. అంత అవసరమా? తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదాన్ని పంచే కళాకారులు ఎంతోమంది ఉన్నాం. అలాంటిది వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్‌ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మన హీరోలు బంగారు గనులు. కోహినూర్‌ వజ్రాలు. ఆ వజ్రాలు ప్రకాశిస్తే, ఎన్నో భవనాలు కట్టవచ్చు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం చేసి, వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టవచ్చు’’

‘‘ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడను. 11వ తేదీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడతా. ఈలోగా కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఏం చేశారు? మాట్లాడితే కరోనా పేరును అడ్డం పెట్టుకుంటున్నారు. కరోనా రాకపోయుంటే వీళ్లేదో మొత్తం దున్నేసినట్లు చెబుతున్నారు. పాతికేళ్ల నుంచి చూస్తున్నాం. ‘బండ్ల గణేశ్‌ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు’ అని జీవితా రాజశేఖర్‌ అనలేదు. దయచేసి ‘మా’లో మాకు గొడవలు పెట్టవద్దు. షూటింగ్‌ స్పాట్‌లో ‘మా’ సమస్యలు ప్రస్తావిస్తానని ఓ పెద్దాయన చెప్పాడు. నిర్మాత డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటే, అక్కడ చర్చలు పెట్టుకుంటారా? అదంతా తప్పు. ప్రతి రెండో ఆదివారం ‘మా’ మీటింగ్‌ పెట్టుకుంటే మంచిది. భారతదేశంలో జరిగే ఏ ఎన్నికల్లోనూ 100శాతం ఓట్లు పోలవలేదు. వీలైనంత మంది ఈసారి ఎన్నికల్లో ఓటు వేస్తారు. ప్యానెల్స్‌ నిర్వహించి పార్టీలకు  ‘మా’ సభ్యులు వెళ్లండి. వాళ్లు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి. ఓటు వేస్తామని చెప్పండి. వాళ్లు ఇచ్చిన తాయిలాలూ పుచ్చుకోండి. కానీ, మనస్సాక్షికి చెబుతూ నాకు ఓటేయండి. నాకు పరమేశ్వరుడి మద్దతు ఉంది. అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ఎవరు గెలిచినా వారు నాకు ప్రెసిడెంటే’’ అని అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని