అందుకే ఎన్టీఆర్‌, మహేశ్‌ గోనగన్నారెడ్డి పాత్ర చేయలేదు - behind the reason of ntr not done gona gannareddy role
close
Published : 10/10/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ఎన్టీఆర్‌, మహేశ్‌ గోనగన్నారెడ్డి పాత్ర చేయలేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: కమర్షియల్‌ సినిమాలతో పాటు, పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్‌. చిరంజీవితో ‘చూడాలని ఉంది’ తీసిన ఆయన మహేశ్‌తో ‘ఒక్కడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తీశారు. అంతేకాదు, వరుసగా మహేశ్‌తో మూడు సినిమాలు తీసి రికార్డు సృష్టించారు. ఇక ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా, అల్లు అర్జున్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. 

ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర తర్వాత సినిమాకే హైలైట్‌గా నిలిచిన పాత్ర గోనా గన్నారెడ్డి.  అల్లు అర్జున్‌ నటన అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్‌, మహేశ్‌లు కూడా ఆసక్తి చూపారని గుణశేఖర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ‘‘రుద్రమదేవి సినిమా తీయడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చిన చిత్రం ‘బ్రేవ్‌హార్ట్‌’. ఆ స్ఫూర్తితోనే రుద్రమదేవి కథ చేయాలని నాకు అనిపించింది. అయితే, డైరెక్టర్‌గా నాకు మంచి మార్కెట్‌ ఉన్నప్పుడు చేయాలని అనుకున్నా. ‘ఒక్కడు’ తర్వాత దక్షిణాదిలో ఏ దర్శకుడు తీసుకోలేనంత పెద్ద పారితోషికాన్ని నాకు ఆఫర్‌ చేశారు. అప్పుడు ‘రుద్రమదేవి’ చేయాలని నిశ్చయించుకుని పలువురు నిర్మాతలకు కథ చెప్పా. ‘కాకతీయుల నేపథ్యంలో గుణశేఖర్‌ చిత్రం’ అంటూ పేపర్‌లో ప్రకటన కూడా వచ్చింది. కథ విన్న నిర్మాతలు బాగుందని అన్నారు కానీ, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా కాకుండా హీరో నేపథ్యంగా కథ మార్చమని అడిగారు. నేను కుదరదని చెప్పా. అలా ఆ సబ్జెక్ట్‌ పక్కకు వెళ్లిపోయింది. దాంతో నేనే నిర్మాతగా మారి ‘రుద్రమదేవి’ తీశా’’.

‘‘మహేశ్‌తో ‘ఒక్కడు’ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేద్దామనుకున్నాం.  దాదాపు సెట్స్‌పైకి వెళ్లాలనుకునేసరికి కథ సరిగ్గా కుదరలేదనిపించింది. ‘రుద్రమదేవి’ అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌, మహేశ్‌పేర్లు బాగా వినిపించాయి. ఎందుకంటే వాళ్లిద్దరితోనూ నేను పని చేశా. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. వాళ్లే స్వయంగా గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఆసక్తి చూపారు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. అనంతరం అల్లు అర్జున్‌ ఆ పాత్ర పోషించారు. భవిష్యత్‌లో తప్పకుండా నేనూ-ఎన్టీఆర్‌ పనిచేస్తాం. అయితే అన్నీ కుదరాలి కదా’’ అని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు. అన్నట్లు జూన్‌ 2న గుణశేఖర్‌ పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన రానా కీలక పాత్రలో హిరణ్యకశ్యప తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని