close
Published : 10/10/2020 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈగలను ఫ్రిడ్జ్‌లో పెట్టి... ఫొటోలు తీసి

దర్శకుడు రాజమౌళి.. అపజయమెరుగని సినీ ప్రయాణం ఆయన సొంతం. నిజానికి ఆయన కెరీర్‌లో ఎన్ని హిట్లు ఉన్నా,  ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నా.. జక్కన్నకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘ఈగ’. నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతోనే అసలు సిసలు గ్రాఫిక్స్‌ మాయాజాలం ఎలా ఉంటోందో నేర్చుకున్నారు ఆయన. ఈగ లాంటి అల్ప జీవిని వెండితెరపై ఓ అద్భుత కథానాయకుడిగా మలచడం కోసం ఆయనెన్నో వ్యయ ప్రయాసలకోర్చారు. ఈగను యానిమేషన్‌లో సృష్టించడం ఒకెత్తైతే.. వాస్తవికతకు దగ్గరగా భావోద్వేగాలు పలికించగలగడం మరొకెత్తు. దీన్ని సాధించడం కోసం తెర వెనుక రాజమౌళి బృందం పడిన కష్టం మామూలుది కాదు.

వాస్తవానికి రాజమౌళి ఈ ప్రాజెక్టు రూ.10కోట్ల బడ్జెట్‌లోపే పూర్తి చేయాలనుకున్నారు. కానీ, ఈ కథలో అసలు కథానాయకుడైన ఈగ పాత్రను యానిమేషన్‌లో సృష్టిండానికే.. ఆయన అనుకున్న బడ్జెట్‌ మంచులా కరిగిపోయింది. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ వర్క్‌ చేసిన ‘మకుట’ సంస్థ తొలుత ఓ ఈగను యానిమేషన్‌లో రూపొందించి రాజమౌళికి చూపించింది. దాన్ని చూడగానే ఆయనకు ప్రాణం పోయినంత పనైంది. ఆయనకి అదసలు ఈగలాగే కనిపించలేదట. దీంతో అసలీ ప్రాజెక్టే పక్కకు పెట్టేద్దామని ఆలోచన చేశారు జక్కన్న. అప్పటికే దాదాపు రూ.8కోట్లు ఖర్చయి పోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లారు.

ఈగను ఎలా రూపొందించాలన్న దాని కోసం ఓ ప్రత్యేక కార్యచరణను అమలు చేశారు. నిజమైన ఈగల్ని పట్టుకొని వాటిని వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ చిన్న ప్రాణిని పరిపూర్ణంగా క్యాప్చర్‌ చేసేందుకు ప్రత్యేకమైన లెన్స్‌ ఉపయోగించారు. అంతేకాదు వీటిని బతికి ఉండగా ఫొటోలు తీయాలంటే ఎగిరిపోతున్నాయని చెప్పి.. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి అవి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఫొటో షూట్‌ చేశారు. అలా తీసిన ఫొటోల నుంచి సేకరించిన సమాచారంతో ఓ స్కెచ్‌ ప్రకారం మనం తెరపై చూసిన ఈగ ప్రాణం పోసుకుంది. కానీ, ఈ చిత్ర బృందానికి మళ్లీ అసలు సమస్య దానితో భావోద్వేగాలు పలికించడంలో వచ్చింది.

నాని ముఖంపై వస్త్రం కప్పి

వాస్తవానికి ఈగ ముఖంలో కండరాలు చాలా తక్కువగా ఉంటాయి. తల మొత్తం కళ్లతోనే నిండి ఉంటుంది. కాబట్టి ఆ జీవి మోములో ఎమోషన్స్‌ పండించడం సంక్లిష్టమైన అంశం. రాజమౌళి దీన్ని చాలా తెలివిగా పూర్తి చేశారు. ఈ చిత్రంలో కథానాయకుడు నానినే ఈగలా పునర్జన్మ ఎత్తుతాడు కాబట్టి వాస్తవికతకు దగ్గరగా ఉండాలంటే ఆ జీవి బాడీ లాంగ్వేజీ ఆయనలాగే ఉండాలి. దీన్ని సాధించడం కోసం రాజమౌళి ఓ తెలివైన ఆలోచన చేశారట. నాని తలను పూర్తిగా ఓ వస్త్రంతో కప్పేసి తన బాడీ లాంగ్వేజీతో వివిధ రకాల భావోద్వేగాల్ని ప్రదర్శించమని కోరారట. అలా ఆ ఎమోషన్స్‌ అన్నింటినీ వీడియో తీసి ఆ డేటాను యానిమేషన్‌ బృందానికిచ్చి ఈగలో కదలికల్ని, భావోద్వేగాల్ని సృష్టించారు. ఎంత కసరత్తో కదా! అంత కష్టపడ్డారు కాబట్టే అంతటి అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించగలిగారు రాజమౌళి.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని