పాత్రల్లో ఒదిగారు.. జాతీయ స్థాయిలో మెరిశారు - best actors awards
close
Published : 22/03/2021 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాత్రల్లో ఒదిగారు.. జాతీయ స్థాయిలో మెరిశారు

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటీనటులుగా ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే), కంగనా రనౌత్‌(మణికర్ణిక/పంగా) ఎంపికవగా.. ఉత్తమ సహాయ నటులుగా పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌), విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌) ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మెప్పించిన ఈ తారల నటనని, అవార్డు అందించిన పాత్రల్ని ఓ సారి గుర్తుచేసుకుందాం...

‘అసురన్‌’గా మెరిసి..

ధనుష్‌ ప్రధాన పాత్రలో వెట్రి మారన్‌ తెరకెక్కించిన చిత్రం ‘అసురన్‌’. అణగారిన వర్గాలు చదువుకు ఎలా దూరమవుతున్నారన్న ఇతివృతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. వెక్కై నవల ఈ కథకు స్ఫూర్తి. ధనుష్‌ శివస్వామి అనే పాత్రలో నటించాడనడం కంటే జీవించాడంటే బాగుంటుంది. గెటప్‌ పరంగానూ వైవిధ్యం చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ధనుష్‌. రెండు అవతారాల్లో కనిపించి శెభాష్‌ అనిపించుకున్నాడు. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే  ‘ధనుష్‌కి జాతీయ స్థాయిలో అవార్డు  వస్తుందని’ విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారంటే ధనుష్‌ ఏ రేంజ్‌లో ప్రతిభ కనబరిచాడో అర్థం చేసుకోవచ్చు. అందరూ ఊహించినట్టుగానే జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ‘పొలం ఉంటే లాక్కుంటారు.. డబ్బుంటే దోచుకెళ్తారు.. చదువుంటే ఎప్పటికి తీసుకెళ్లలేరు’ ఇలాంటి సంభాషణలతో ధనుష్‌ స్ఫూర్తినింపాడు. గతంలో ‘ఆడకుళం’ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు ధనుష్‌.

మనోజ్ ‘భోంస్లే’

1994లో వచ్చిన ‘ద్రోహ్‌ కాల్‌’ అనే హిందీ చిత్రంలోని అతిథి పాత్రతో నట ప్రస్థానం మొదలుపెట్టారు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ‘సత్య’, ‘రోడ్‌’, ‘పింజర్‌’,‘రాజ్‌నీతి’ తదితర హిందీ చిత్రాల్లో తనదైన నటన ప్రదర్శించి మెప్పించారు. తెలుగులో ‘హ్యాపీ’, ‘కొమరం పులి’,‘వేదం’ చిత్రాల్లో కీలక పాత్రలు షోషించారు మనోజ్‌. ‘భోంస్లే’ చిత్ర విషయానికొస్తే.. ఇదొక డ్రామా కథ. దేవాషిశ్‌ మఖిజా దర్శకత్వం వహించారు. వలసదారుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గణపత్‌ భోంస్లేగా కనిపించి ప్రశంసలు అందుకున్నారు మనోజ్‌. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకల్లో ప్రదర్శితమైంది ఈ చిత్రం. కథతోపాటు మనోజ్‌ నటనా ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. మనోజ్‌ యాక్టింగ్‌ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన అవార్డు అందుకునేలా ప్రతిభ చూపారాయని సినిమా విడుదలైన తొలినాళ్లలోనే ఊహించడం విశేషం. ఇప్పటికే మూడు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు అందుకున్న మనోజ్‌ ‘భోంస్లే’తో మరోసారి తన సత్తా చాటారు. 

క్వీన్‌.. డబుల్‌ ధమాకా

జాతీయ స్థాయిలో ఒక్క అవార్డు అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది ఒకే ఏడాది రెండు చిత్రాలకుగానూ ఉత్తమ నటిగా ఎంపికై అందరిని ఆశ్చర్యంలో పడేసింది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రంతో 2006లో నటిగా మారిన కంగనా మంచి కథలు ఎంపిక చేసుకుంటూ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాల్లో నట విశ్వరూపం చూపించింది. మణికర్ణికలో రాణీ లక్ష్మీ బాయి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇలాంటి పీరియాడికల్‌ డ్రామాలో నటించడం కష్టమైనా సాహసం చేసి విజయం అందుకుంది. దీనికి పూర్తి విభిన్నంగా ఉండే కథ ‘పంగా’. ఇందులో కబడ్డీ క్రీడాకారిణిగా జయ నిగమ్‌ పాత్రలో ఒదిగిపోయింది. ఈ రెండు చిత్రాలు వీక్షిస్తున్నప్పుడే అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు కంగనాకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఖాయమని చర్చించుకున్నారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు కంగనాకు కొత్త కాకపోయినా ఒకేసారి రెండు అందుకోవడం గొప్ప విషయం.

దటీజ్‌ మక్కల్‌ సెల్వన్‌ 

ఈ మధ్య తెలుగులో ఎవరి నోట విన్నా తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పేరే వినిపిస్తుంది. అంతగా తన నటనతో మైమరిపిస్తుంటారు విజయ్‌. విలన్‌గా, హీరోగా పాత్ర ఏదైనా తన ప్రతిభ చాటుతుంటారు. ఇలాంటి స్టార్‌ హీరో ట్రాన్స్‌జెండర్‌గా చేస్తారని ఎవరైనా ఊహిస్తారా? ‘సూపర్‌ డీలక్స్‌’తో అంతటి సాహసం చేశారు విజయ్‌ సేతుపతి. ట్రాన్స్‌జెండర్‌గా కనిపించడమే కాదు అవార్డు అందుకుని దటీజ్‌ మక్కల్‌ సెల్వన్‌ అనిపించుకున్నారు. శిల్ప(మాణిక్యం) పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుని తనలోని నటుడ్ని జాతీయ స్థాయిలో పరిచయం చేశారు.

పల్లవి ప్రతిభ..

వ్యాఖ్యాతగా తన కెరీర్‌ ప్రారంభించి నటిగా మారారు పల్లవి జోషి. ఎక్కువగా టీవీ కార్యక్రమాల్లో సందడి చేసే ఈమె కథా బలం ఉన్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటూ.. నటించిన పాత్రలకే పేరు తీసుకొస్తుంటారు. అలా ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’లో కనిపించి ఏకంగా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించారు. థ్రిల్లర్‌ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో ఆయేషా ఆలీ షా పాత్ర పోషించారు పల్లవి. కథకి కీలకంగా నిలిచే పాత్ర ఇది. ఎంపిక చేసుకున్న పాత్రకు వందశాతం న్యాయం చేసి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని