Bhabanipur bypoll: లాయర్ల సమరం.. మమతదే (నా) విజయం!? - bhabanipur set for unequal battle as mamata faces lightweight rivals
close
Updated : 14/09/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhabanipur bypoll: లాయర్ల సమరం.. మమతదే (నా) విజయం!?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరోసారి ఎన్నికల సమరం జరగబోతోంది. మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టీ భవానీపూర్‌పైనే. ఈ సారి అక్కడ పోటీ చేస్తోంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కాబట్టి. ఇక్కడ మమతకు పోటీగా భాజపా, సీపీఎం తమ అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిద్దరూ వృత్తిరీత్యా న్యాయవాదులే కావడం గమనార్హం. మమత కూడా న్యాయ విద్యను అభ్యసించిన వారే. ముగ్గురు న్యాయవాదుల మధ్య జరుగుతున్న పోటీలో మమత విజయం సునాయాసమే కానుందని విశ్లేషణలు వినవస్తున్నాయి. సెప్టెంబర్‌ 30న ఈ స్థానానికి పోలింగ్‌ జరగనుండగా. అక్టోబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వేళ ప్రత్యర్థుల నేపథ్యం.. వారి గెలుపు ధీమా ఏంటి? విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం..

భాజపా వంటి బలమైన పార్టీని ఓడించి పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మమతా బెనర్జీది. అయితే, భాజపా అభ్యర్థి, ఒకప్పుడు పార్టీలో నంబర్‌.2గా ఉన్న సువేందు అధికారి చేతిలో నందిగ్రామ్‌ స్థానం నుంచి ఓడిపోవడంతో దీదీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్‌ నుంచే మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఆ పార్టీ నుంచి గెలుపొందిన సోవన్​దేవ్​ఛటోపాధ్యాయ్ మమత కోసం ఆ సీటును త్యాగం చేశారు. పశ్చిమబెంగాల్లో జంగీపుర్, సంసీర్​గంజ్ అభ్యర్థుల మరణంతో అక్కడి ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పోటీ చేసే ముగ్గురూ లాయర్లే..
భవానీపూర్‌ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ న్యాయవాదులే కావడం గమనార్హం. 1982లో కోల్‌కతాలోని జోగేశ్‌ చంద్ర కళాశాల నుంచి మమత లా డిగ్రీ పూర్తిచేశారు. తర్వాతి కాలంలో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. భాజపా నుంచి బరిలో దిగిన ప్రియాంక తిబ్రీవాల్ కూడా న్యాయవాదే. హజ్రా లా కళాశాల నుంచి ఆమె న్యాయవాద పట్టా పొందారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై తృణమూల్‌ ప్రభుత్వంపై ఆమె పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే గతంలో ఎంటల్లీ నుంచి పోటీచేసినా ఓడిపోయారు. ఇక సీపీఎం నుంచి పోటీ చేస్తున్న శ్రీజిబ్‌ విశ్వాస్‌ అలీపూర్‌ కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈయన కూడా హజ్రా లా కాలేజీలోనే న్యాయవాద పట్టా పొందారు. కాంగ్రెస్‌ ఈ సారి పోటీకి దూరంగా ఉంది.

ఎవరి ధీమా వారిదే..

* భవానీపూర్‌ నుంచి మమతా బెనర్జీ 2011, 2016లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజలతో ఆమెకు దశాబ్దంగా అనుబంధం ఉంది. పైగా తృణమూల్‌ కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్వయాన సీఎం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఈ సారి రికార్డు స్థాయి మెజార్టీతో ఆమె విజయం సాధిస్తుందని తృణమూల్‌ ధీమాగా ఉంది. మరోవైపు దీదీ మళ్లీ తమ నియోజకవర్గానికి రావడం తమకు ఆనందంగా ఉందని ఆ నియోజకవర్గ వాసి ఒకరు చెప్పుకొచ్చారు.

* అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించి భంగపడిన భాజపాకు ఉప ఎన్నికల్లో మమతపై పోటీ చేసేందుకు సీనియర్‌ నాయకులెవరూ ముందుకు రాలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో నామమాత్రంగా ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపినట్లు అర్థమవుతోంది. అయితే ప్రియాంక తిబ్రీవాల్ మాత్రం విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలే ప్రధాన అజెండాగా ఆమె ముందుకెళ్తున్నారు. తృణమూల్‌ ఆగడాలను ప్రజలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు.

* గతంలో పశ్చిమ బెంగాల్‌ను సుదీర్ఘంగా ఏలిన వామపక్ష పార్టీలకు ఇటీవల జరిగిన ఎన్నికలు నిరాశే మిగిల్చాయి. దీంతో తమ ఉనికిని చాటేందుకు శ్రీజిబ్‌ విశ్వాస్‌ను వామపక్ష కూటమి బరిలో నిలిపింది. మమత హయాంలో అభివృద్ధి కుంటుపడిందని శ్రీజిబ్‌ ఆరోపించారు. తన పోరు ఆ రెండు పార్టీలపై అని వ్యాఖ్యానించారు.

విశ్లేషకులు ఏమంటున్నారు..?

భవానీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్వాస్‌ చక్రవర్తి పేర్కొన్నారు. కాకలుతీరిన రాజకీయ నాయకురాలు ఒకవైపు.. రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని మరో ఇద్దరు మరోవైపు పోటీలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. దీంతో తృణమూల్‌కు రికార్డు విజయం చేకూరే అవకాశం ఉందని చెప్పారు. భాజపా తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు, వామపక్ష పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు మాత్రమే ఈ ఉప ఎన్నికలో పాల్గొంటున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో భాజపాపై ఉమ్మడి పోరులో కలిసి పోరాడాలన్న నిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెట్టకపోవడం శుభపరిణామమని మరో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయా విశ్లేషణలు బట్టి భవానీపూర్‌లో మమత విజయం ఖాయమేనని తెలుస్తోంది!!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని