ఊహాజనిత కథనాలు రాయకండి: భువీ - bhuvaneshwar kumar gives clarity on not interested in playing test cricket
close
Published : 16/05/2021 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊహాజనిత కథనాలు రాయకండి: భువీ

టెస్టు క్రికెట్‌పై స్పష్టతనిచ్చిన టీమ్‌ఇండియా పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను టెస్టు క్రికెట్ ఆడటంపై ఆసక్తి చూపడం లేదనే వార్తలను టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌ ఖండించాడు. అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పాడు. భువీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగడం ఇష్టం లేదనే వార్త శనివారం ఓ ప్రముఖ జాతీయ పత్రికలో కథనంగా వచ్చింది. దానిపై స్పందించిన భువనేశ్వర్‌ ఓ ట్వీట్‌ చేశాడు. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా తాను మూడు ఫార్మాట్ల కోసం సన్నద్ధమవుతానని చెప్పాడు.

వచ్చేనెలలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ రెండింటికీ సంబంధించి బీసీసీఐ కొద్దిరోజుల క్రితం 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్‌బై కుర్రాళ్లను ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేసింది. అందులో భువీకి చోటు దక్కకపోవడం గమనార్హం. 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరిసారి టెస్టు మ్యాచ్‌ ఆడిన అతడు తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లోనూ గాయపడగా ఆ టోర్నీతో పాటు తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకూ దూరమయ్యాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికైన భువనేశ్వర్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మళ్లీ గాయాల కారణంగా పలు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

ఇలాంటి పరిస్థితుల్లో భువనేశ్వర్‌ను ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేయలేదనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. అయితే, అతడికి టెస్టు క్రికెట్‌పైన ఆసక్తి లేదని, దాంతో పాటు సెలెక్టర్లు అతడిని వన్డేలకు ఎంపిక చేయడానికి కూడా ఇష్టపడట్లేదని ఆ పత్రిక పేర్కొంది. దానిపై స్పందించిన భువీ ఘాటుగా బదులిచ్చాడు. ‘నేను టెస్టు క్రికెట్‌ ఆడదల్చుకోలేదనే విధంగా నాపై కథనాలు వచ్చాయి. ఆ విషయంపై స్పష్టతనిస్తున్నా.. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా నేనెప్పుడూ మూడు ఫార్మాట్ల కోసమే సన్నద్ధమయ్యా. ఇకపైనా అలాగే ఉంటా. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పదల్చుకున్నా. ఎవరో చెప్పారని పేర్కొంటూ ఊహాజనిత కథనాలు రాయకండి’ అని ట్వీట్‌ చేశాడు.

మరోవైపు జులైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు భువీ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో కీలక ఆటగాళ్లంతా ఇంగ్లాండ్‌లో ఉంటుండగా, మిగిలిన క్రికెటర్లు ధావన్‌, హార్దిక్‌, పృథ్వీ, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, భువీ లాంటి ఆటగాళ్లు లంకకు పయనమయ్యే వీలుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని