స్టార్‌ ఫ్యామిలీలో పుట్టి.. కేఫ్‌లో పనిచేసి..! - birthday special interesting facts about shraddha kapoor
close
Updated : 03/03/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టార్‌ ఫ్యామిలీలో పుట్టి.. కేఫ్‌లో పనిచేసి..!

బర్త్‌డే స్పెషల్‌: శ్రద్ధాకపూర్‌ గురించి ఈ విశేషాలు తెలుసా

ఇంటర్నెట్‌డెస్క్‌: నటనపై ఆసక్తితో ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేసి వెండితెరవైపు అడుగులేసి.. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి శ్రద్ధాకపూర్‌. కెరీర్‌ ఆరంభమైన నాటి నుంచి ‘ఆషికీ-2’, ‘భాఘి’, ‘ఏక్‌ విలన్‌’ వంటి చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బుధవారం తన 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. స్టార్‌ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనే ఉద్దేశంతో చదువుకునే రోజుల్లోనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసిన ఈ చిన్నది.. తన సినీ కెరీర్‌ గురించి పలు సందర్భాల్లో ఇలా చెప్పుకొచ్చారు.

వాట్‌ ఏ గ్రేట్‌ ఫీలింగ్‌..!

‘‘నటిగా రాణించాలని ఎప్పుడూ అనుకోలేదు. సైకాలజిస్ట్‌ అవ్వాలనుకున్నా. అందుకు అనుగుణంగానే ఉన్నత విద్యను అభ్యసించడానికి బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో చేరాను. అక్కడ చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం ఓ కేఫ్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేదాన్ని. అతి తక్కువ మొత్తంలో సంపాదించినప్పటికీ ఎంతో గర్వంగా అనిపించేది. పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసి సంపాదించిన రోజుల్లో పొందిన ఆ ఫీలింగ్‌ ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నప్పుడు రాలేదు’’

ప్చ్‌.. ఆశ తీరలేదు..!

‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. తరచూ సినిమాలు చూస్తూ ఉండేదాన్ని. ‘ప్యాసా’, ‘ది గాడ్‌ఫాదర్‌’, ‘టైటానిక్‌’ చిత్రాలు లెక్కలేనన్నిసార్లు వీక్షించాను. ఇక నటీమణుల విషయానికి వస్తే.. మాధురీ దీక్షిత్‌, శ్రీదేవి అంటే నాకెంతో ఇష్టం. శ్రీదేవితో కలిసి స్క్రీన్‌ పంచుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఓ కోరిక ఉండేది. కానీ, ఆ కోరిక తీరలేదు. అలాగే మిగిలిపోయింది.’’

ఆయనకు ఫిదా అయిపోయా..!

‘‘‘కహోనా ప్యార్‌ హై’.. ఈ చిత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. హృతిక్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఇందులో హృతిక్‌ నాకు బాగా నచ్చేశారు. ఈ సినిమా విడుదలైన కొత్తలో ఆయన ఫొటోలు ఏ పేపర్‌లో కనిపించినా సరే కత్తిరించి.. నా బెడ్‌రూమ్‌లో గోడలకు అతికించేదాన్ని. అలా నా గది మొత్తం ఆయన ఫొటోలతో నిండిపోయింది’’

అది మీకు అనవసరం..!

‘‘బాలీవుడ్‌ ఇండస్ట్రీలో భారీగా పారితోషికం తీసుకుంటున్న కథానాయికను నేనే అని చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే, నేను ఎంత రెమ్యూనిరేషన్‌ తీసుకుంటున్నాననేది ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అది నా వ్యక్తిగత విషయం. ఒకటి మాత్రం చెప్పగలను.. నటికి ఉన్న డిమాండ్‌ బట్టి పారితోషికం చెల్లిస్తారు. అంతేకానీ మేము డిమాండ్‌ చేసినంత వాళ్లు ఇవ్వరు’’

అంతా ఫేస్‌బుక్‌ వల్లే..!

‘‘బోస్టన్‌లో చదువుకునే రోజుల్లో నాకు సంబంధించిన ఫొటోలను తరచూ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసేదాన్ని. అలా నేను షేర్‌ చేసిన ఫొటోలు నచ్చి ‘తీన్‌పత్తి’ బృందం నన్ను సంప్రదించింది. ఆ విధంగా నేను ‘తీన్‌పత్తి’తో వెండితెరపై కనిపించాను. ఆ సమయంలో చదువుకు బ్రేక్‌ చెప్పాల్సి వచ్చింది.’’

ఆఫర్స్‌ మిస్‌..!

‘‘16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సల్మాన్‌ చిత్రంలో నటించే అవకాశం నాకు లభించింది. నేను చదువులో ఉన్నతస్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో నాన్న ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. దాంతో సల్మాన్‌ మూవీ ఆఫర్‌ చేజారిపోయింది. అలాగే, యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ తెరకెక్కించిన ‘ఔరంగజేబు’లో తొలుత ఆఫర్‌ నాకే వచ్చింది. కాకపోతే, అప్పటికే ‘ఆషికీ-2’ ఓకే చేయడంతో యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌కు సంబంధించి మూడు ప్రాజెక్ట్‌లు వదులుకున్నాను’’

చెబితేనే నమ్మండి..!

‘‘ఆతియాశెట్టి, వరుణ్‌ధావన్‌, నేనూ.. క్లాస్‌మేట్స్. వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కించిన చిత్రాల్లో మా నాన్న నటించారు. దాంతో వరుణ్‌తో నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఏర్పడింది. కాకపోతే కొంతమంది మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అదేకాకుండా నేను రిలేషన్‌లో ఉన్నానని చాలాసార్లు వార్తలు వచ్చాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. పెళ్లి, ప్రేమ, ఆఖరికి సినిమాలకు సంబంధించిన విషయాలను నేను అధికారికంగా ప్రకటిస్తేనే నమ్మండి’’

‘సాహో’తో అభిరుచులు మారాయ్‌..!

‘‘సాధారణంగా ఉత్తరాది వంటకాలను ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పరోటా, చేపల పులుసు నాకు ఇష్టమైన ఆహారం. ‘సాహో’ సినిమా సమయంలో దక్షిణాది టిఫిన్స్‌ అలవాటు అయ్యాయి. దాంతో షూట్‌ నుంచి ఇంటికి వచ్చాక కూడా వాటిని తినడానికే ఆసక్తి చూపిస్తున్నాను. అందువల్ల ఇంట్లో దక్షిణాది టిఫిన్స్‌ వండుతున్నారు. ఇంట్లో వాళ్లకి కూడా ఆ రుచులు నచ్చాయి’’

మరికొన్ని ఆసక్తికర విశేషాలు

 శ్రద్ధాకపూర్‌ తండ్రి ప్రముఖ నటుడు శక్తికపూర్‌.

శ్రద్ధా నటి మాత్రమే కాదు గాయని కూడా. ఆమె కథానాయికగా నటించిన ‘ఏక్‌ విలన్‌’ కోసం ఓ పాట పాడారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఈ నటి.

సినిమాల్లో తన తండ్రి కనుక విలన్‌ పాత్రలు పోషిస్తే శ్రద్ధాకు నచ్చదట.

శక్తికపూర్‌ని ఎవరైనా తక్కువచేసి మాట్లాడినా, ఆయనపై జోక్స్ వేసినా శ్రద్ధాకు చెప్పలేనంత కోపం వచ్చేస్తుందట.

శ్రద్ధాకు షూ కలెక్షన్స్‌ అంటే ఇష్టం.

టీ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్ ఛాయ్‌ తప్పనిసరిగా తాగాల్సిందేనట.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని