Anasuya.. అంత ఈజీగా స్టార్‌ కాలేదు భయ్యా! - birthday special story on actress anasuya
close
Updated : 15/05/2021 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anasuya.. అంత ఈజీగా స్టార్‌ కాలేదు భయ్యా!

బర్త్‌డే స్పెషల్‌.. నటి గురించి కొన్ని విశేషాలు

హైదరాబాద్‌: అనసూయ.. తెలుగింటి అందాల బొమ్మ. యాంకర్‌గా మనందర్నీ ప్రతి గురువారం పలకరిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ‘రంగమ్మత్త’గా ఫేమ్‌లోకి వచ్చిన ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌లలో సినిమాలు చేస్తూ ఫుల్‌బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ నటి  శనివారం 36వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అనసూయ గురించి కొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..

పవిత్ర టు అనసూయ

‘మే 15, 1985లో నేను పుట్టాను. మా సొంత ఊరు నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి. నేనే మా ఇంట్లో పెద్ద అమ్మాయిని. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నా పేరు పవిత్ర అని పెట్టాలనుకుంది. మా నాన్న మాత్రం వాళ్లమ్మ పేరు పెట్టాలనుకున్నారు. అలా నా పేరు అనసూయ అయ్యింది’’

నాన్న వ్యసనం.. కష్టాలుపడ్డాం..!

‘‘నా చిన్నప్పుడు మేము ఆర్థికంగా స్థితిమంతులమే. మాకు గుర్రాలు కూడా ఉండేవి. ముగ్గురూ ఆడపిల్లలమే అవడం చేత సమాజంలో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను నాన్నే మాకు నేర్పించారు. మేము చేసే ప్రతి పనిని ఆయన దూరం నుంచే గమనించేవారు. మా నాన్నకు గుర్రపు పందెల వ్యసనం ఉండేది. దానివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నేళ్లపాటు అద్దె ఇంట్లో జీవించాం. అద్దె కట్టేందుకు కూడా ఇబ్బందిపడాల్సి వచ్చేది. అమ్మ మిషన్‌ కుట్టి మా స్కూల్‌ ఫీజ్‌ కట్టేది. రూ.50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని ’’

ఆఫర్స్‌ వదులుకున్నా..

‘‘నేను ఎంబీఏ హెచ్‌ఆర్‌ చేశాను.  దాంతో ఒక విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేశా. దానికంటే ముందు ఓ బ్యాంక్‌లో టెలీకాలర్‌గా కూడా పనిచేశా. అలా నాకు వచ్చిన మొదటి జీతం రూ.5 వేలు. హెచ్‌ఆర్‌గా చేస్తున్న సమయంలో మా కంపెనీకి ఎంతోమంది దర్శకులు వస్తుండేవాళ్లు.  తమ సినిమాల్లో నాకు అవకాశాలు కూడా ఇచ్చేవాళ్లు. మా ఇంట్లో సినీ రంగం అంటే ఓ రకమైన అభిప్రాయం, భయం ఉండేది. దాంతో వచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకున్నాను. అదీ కాక అప్పటికే నాకు నిశ్చితార్థమైపోయింది. కొన్ని కారణాల వల్ల హెచ్‌ఆర్‌ జాబ్‌ మానేయాల్సి వచ్చింది. దాంతో న్యూస్‌ రీడర్‌గా మారాను. అలా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను’’

ట్రోల్స్ స్టార్ట్‌..

‘‘న్యూస్‌రీడర్‌గా చేస్తున్న సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. ఆ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాను. నాకు అభిమానులు పెరిగారు. అదే సమయంలో పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే కథలు నచ్చకపోవడంతో నో చెప్పుకుంటూ వచ్చాను. పవన్‌కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’లోని పార్టీ సాంగ్‌కు నన్ను అడిగారు. ఆ పాటలో నేను ఒక్కదానినే అయితే చేస్తాను.. లేకపోతే చేయను అని చెప్పాను. దాంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ పాట విడుదలయ్యాక అదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందలా లేకపోవడం మంచిదైంది’ అని ట్వీట్‌ చేశా. దాంతో నాపై విపరీతమైన ట్రోలింగ్‌ చేశారు. అప్పటి నుంచి నాకు సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ ప్రారంభమైంది. మొదట్లో కామెంట్లు చూసి బాధపడేదాన్ని. ఇప్పుడు కామెంట్లను పట్టించుకోవడం లేదు. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లకి సరైన సమాధానం చెబుతున్నా’’

‘ఆర్య’ టు ‘రంగస్థలం’..

‘‘నేను హెచ్‌ఆర్‌గా చేస్తున్న సమయంలో వృత్తిపరమైన పనుల్లో భాగంగా దర్శకుడు సుకుమార్‌ మా ఆఫీస్‌కి వస్తుండేవారు. ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. దాంతో ‘ఆర్య’లో అవకాశం ఇచ్చారు. దాన్ని వదులుకున్నాను. యాంకర్‌గా రాణిస్తున్న తరుణంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త ఆఫర్‌ ఇచ్చారు. పాత్ర నచ్చింది. అదీకాక నేను ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే చేస్తున్నానని అందరూ చెప్పుకునేవాళ్లు. వాళ్లందరికీ సమాధానం చెప్పడం కోసం రంగమ్మత్త క్యారెక్టర్‌కు ఓకే అన్నాను. అయితే ఆ పాత్రకు అంత ఫేమ్‌ వస్తుందని ముందు ఊహించలేదు’’

చెప్పలేనంత బాధపడ్డా..

‘‘నేను నటిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘క్షణం’. కానీ విడుదలయ్యింది మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఆ సినిమా తర్వాత నేను ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డాం. కాకపోతే అనుకున్న ఫలితాన్ని ఆ సినిమా అందించలేదు. దాంతో ఎంతో బాధపడ్డా. కొన్నిరోజులు బయటకు కూడా రాలేదు’’

బాలీవుడ్‌లోకి ఎంట్రీ..

‘‘ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న పలు సినిమాల్లో నటిస్తున్నాను. ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. మలయాళంలో మమ్ముట్టి సర్‌ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నా. అవి మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. రెండు వెబ్‌సిరీస్‌లూ చేస్తున్నా’’

ప్రేమ-పెళ్లి..!

‘‘ఇంటర్‌లో ఉన్నప్పుడు ఎన్‌సీసీ పరేడ్‌ కోసం దిల్లీ వెళ్లాను. అక్కడే నాకు సుశాంక్‌ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే నేనంటే ఇష్టమని చెప్పాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మా మధ్య స్నేహం అలానే కొనసాగింది. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసి నాన్న పెద్ద గొడవ చేశారు. వేరే సంబంధాలు కూడా చూశారు. ‘నేను సుశాంక్‌నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే అస్సలు పెళ్లే చేసుకోను’ అని ఇంట్లో గట్టిగా చెప్పేశాను. ముందు ఒప్పుకోలేదు. తొమ్మిదేళ్లపాటు ప్రేమ పోరాటం చేసి చివరికి 2010లో మేమిద్దరం వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు’’

మరికొన్ని సరదా సంగతులు

• అనసూయకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన ఇంట్లో శునకాలతోపాటు చిలుకల్నీ పెంచుకుంటున్నారు.

• అనసూయ వంట బాగా చేస్తారట. అలాగే ఇష్టమైన వారికి వంట చేసి పెట్టడమంటే ఆమెకు ఎంతో సరదా అట. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఆమె తన చేతి వంటని అందరికీ చూపించారు.

• అనసూయకు స్టైల్‌, ట్రెండింగా ఉండటం నేర్పించింది ఆమె భర్త భరద్వాజ్‌నే అట.

• ఆమె పూర్తిగా శాకాహారి.

• ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్‌ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతారట ఈ బ్యూటీ.

• తనకు వచ్చిన ప్రతి సినిమా ఆఫర్‌ గురించి తన భర్తతో పంచుకుంటుందట ఈ నటి. కానీ, ఆ సినిమాలో నటించాలా? లేదా? అనే నిర్ణయాన్ని మాత్రం ఆమె తీసుకుంటారట.

• అనసూయ అంత అందంగా, ఫిట్‌గా కనిపించడానికి కారణం యోగా, వర్కౌట్లు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని