బ్రెజిల్‌లో ఒక్కరోజే లక్ష కొత్త కేసులు - brazil hits record 100000 coronavirus cases in a day
close
Updated : 26/03/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రెజిల్‌లో ఒక్కరోజే లక్ష కొత్త కేసులు

రియో డీజెనిరో: కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు అక్కడ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 1,00,158 కేసులు వెలుగు చూసినట్టు బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే, తాజాగా మరో 2,777 మరణాలు కూడా సంభవించాయని పేర్కొంది. మంగళవారం  రికార్డు స్థాయిలో 3251 మంది మృత్యువాత పడటంతో కరోనా ప్రవేశించిన తర్వాత అక్కడి మరణాలు 3లక్షల మార్కును దాటేసిన విషయం తెలిసిందే. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి బలైనట్టు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా గణాంకాలతో కలిపి బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1,23,24,769 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 1,07,72,549మంది కోలుకోగా.. 3,03,726మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోపై ఒత్తిడి మరింత పెరిగింది.

‘కరోనా వైరస్‌తో ఒక్కరోజులో సుమారు 3వేల మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకు 3లక్షల మందికి పైగా ప్రాణాలు వదిలారు. ఇది మా దేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని అది పెద్ద మారణహోమం’.. బ్రెజిల్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలకు ఈ వ్యాఖ్యలు నిదర్శనం. ఆ దేశ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బొల్సొనారోపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మహమ్మారి గురించి బొల్సొనారో ప్రజలకు అబద్ధాలు చెప్పి, తప్పుదోవ పట్టించారని విరుచుకుపడ్డారు. 

‘కొవిడ్-19 నుంచి బ్రెజిల్‌ను కాపాడాలి. ఇంకా ఆ వ్యక్తి చేతిలోనే అధికారం ఉంటే..బ్రెజిల్ ఏ మాత్రం తట్టుకోలేదు’ అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లులా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుల కుటుంబాలకు అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. బ్రెజిల్‌లో ఇప్పటివరకు సుమారు 1.23కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 3,03,726 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఐదు లక్షల పైచిలుకు మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా..బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. రాజకీయంగా సమన్వయలేమి వల్లే దేశంలో మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోందని వైద్య నిపుణులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని