కోహ్లీసేనే ప్రపంచకప్‌ ఫేవరెట్‌.. ఎందుకంటే? - buttler picks hosts india as favourites for t20 world cup
close
Published : 11/03/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేనే ప్రపంచకప్‌ ఫేవరెట్‌.. ఎందుకంటే?

జోస్‌ బట్లర్‌ వివరణ ఇదీ

అహ్మదాబాద్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టైన టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీసేన బలమైన జట్టన్నాడు. టీ20 ఫార్మాట్‌ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదని పేర్కొన్నాడు. మెగాటోర్నీలో కీలక పాత్ర పోషించే మొతేరాలో ఐదు టీ20లు ఆడుతుండటం ఇంగ్లాండ్‌కు లాభిస్తుందని స్పష్టం చేశాడు. అరంగేట్రం పొట్టి ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత్‌ ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్లో టోర్నీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

‘మీరు ఒకసారి ప్రపంచకప్‌ టోర్నీలను పరిశీలించండి. ఆతిథ్య జట్లు మరింత మెరుగ్గా ఆడుతున్నాయని తెలుస్తుంది. అందుకే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు‌. బాగా ఆడుతున్న జట్లు ఇంకా ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా మెగాటోర్నీల్లో ఆతిథ్య జట్లు బాగా ఆడటం గమనార్హం. కోహ్లీసేన అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. టీ20ల్లోనూ అంతే’ అని బట్లర్‌ అన్నాడు.

ప్రస్తుతం మొతేరా వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ ఐదు టీ20ల సిరీసులో తలపడుతున్నాయి. ప్రపంచకప్‌లోనూ ఎక్కువ మ్యాచులు ఇక్కడ జరిగే అవకాశం ఉండటం తమకు లాభిస్తుందని బట్లర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

‘ఇక్కడ బాగా ఆడి సిరీస్‌ గెలవాలని కోరుకుంటున్నాం. అలా జరిగితే ప్రపంచకప్‌ ముందు మా బృందంలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. అందుకే ప్రపంచకప్‌ పరిస్థితుల్లో కోహ్లీసేనతో ఇక్కడ తలపడటం మాకు లభించిన అద్భుత అవకాశం. ఎందుకంటే అహ్మదాబాద్‌లోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో మరే జట్టుకూ ఆడే అవకాశం రాలేదు’ అని బట్లర్‌ వెల్లడించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని