ts politics: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు - case filed against on rajagopalreddy
close
Published : 27/07/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ts politics: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు

చౌటుప్పల్‌: మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలోని లక్కారంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాస అయింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

నిన్న ఏం జరిగిందంటే?

తొలుత రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటో పెట్టారని, ఇక్కడెందుకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేనని తనపై వివక్ష చూపుతున్నారన్నారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ.. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, దారిద్య్రం, ఆత్మహత్యలను రూపుమాపామన్నారు. 2014 జూన్‌కు ముందు రాష్ట్రంలో, జిల్లాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే ఆయన మంత్రి కాలేకపోయేవారన్నారు. కేసీఆర్‌ ఒక్కరే తెలంగాణ తేలేదని.. పార్లమెంట్‌లో ఎంపీగా పోరాడానని, వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారని అన్నారు. మంత్రి చేతిలోంచి మైకు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ రాజు తదితరులు ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా తెరాస కార్యకర్తలూ నినాదాలు చేశారు. మంత్రి ఆదేశంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు సమావేశ హాలు నుంచి బయటకు పంపారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని నిరసిస్తూ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. నిన్న  జరిగిన ఈ ఘటనకు సంబంధించి... ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చౌటుప్పల్‌ తహశీల్దార్‌ గిరిధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని