Cricket News: ముందు భారత్‌.. 12 ఏళ్లకు పాక్‌ - centuries for top four batsmen india and pakistan only does this
close
Published : 26/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: ముందు భారత్‌.. 12 ఏళ్లకు పాక్‌

టెస్టు ఇన్నింగ్స్‌లో టాప్‌-4 శతకాల మోత

టెస్టు.. వన్డే.. టీ20.. ఫార్మాట్‌ ఏదైనా టాప్‌ ఆర్డర్‌ రాణించాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. టాప్‌-5లో నలుగురు అర్ధశతకాలు చేస్తేనే మంచి స్కోరు అవుతుంది. అదే టాప్‌-4 సెంచరీలు బాదేస్తే ఇక పరుగుల సునామీ సృష్టించినట్టే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి రికార్డులు అంత సులభం కాదు. కానీ 2007లో టీమ్‌ఇండియా, 2019లో దాయాది పాకిస్థాన్‌ సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఘనత అందుకోవడం విశేషం.


మొదట జాఫర్‌-ద్రవిడ్‌

టీమ్‌ఇండియా 2007లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడింది. క్రికెట్‌ చరిత్రలో మునుపెన్నడూ ఎరగని ఘనతను లిఖించింది. వరుసగా నలుగురు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శతకాల మోత మోగించారు. మొదట ఓపెనర్లు దినేశ్‌ కార్తీక్‌ (129; 212 బంతుల్లో 16×4), వసీమ్‌ జాఫర్‌ (138; 229 బంతుల్లో 17×4) పరుగుల వరద పారించారు. బంగ్లా బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టారు. జాఫర్‌, కార్తీక్‌ తొలి వికెట్‌కు 175 (321 బంతుల్లో) పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అదే స్కోరు వద్ద భారత్‌ తేనీటి విరామం తీసుకుంది. 80 పరుగులతో ఉన్న డీకే ఆ తర్వాత మైదానంలోకి రాలేదు. రిటైర్డ్‌ హర్ట్‌గా డ్రస్సింగ్‌ రూమ్‌లోనే ఉండిపోయాడు. దాంతో రాహుల్‌ ద్రవిడ్‌ (129; 176 బంతుల్లో 15×4, 1×6) క్రీజులోకి వచ్చాడు. జాఫర్‌తో రెండో వికెట్‌కు 106 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. అజేయం ఎందుకంటే.. శతకం తర్వాత జాఫర్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 281/0. ఆ తర్వాత ద్రవిడ్‌ (88*), సచిన్‌ (9*) 326/0తో తొలిరోజు ఆటను ముగించారు.


డీకేతో కలిసి సచిన్‌

రెండోరోజూ ఢాకాలో పరుగుల వరద అలాగే కొనసాగింది. మిస్టర్‌ డిపెండబుల్‌ ద్రవిడ్‌ 144 బంతుల్లో శతకం అందుకున్నాడు. సచిన్‌తో కలిసి 127 (188 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 408 వద్ద అతడిని మహ్మద్‌ రఫీక్‌ పెవిలియన్‌ పంపాడు. 175- 408 మధ్య రిటైర్డ్‌ హర్ట్‌గా ముందురోజు వెనుదిరిగిన డీకే.. సచిన్‌ (49)తో జత కలిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 85 (130 బంతుల్లో) పరుగులు సాధించారు. కార్తీక్‌ 180 బంతుల్లో శతకం చేయగా.. తేనీటి విరామానికి (142 ఓవర్లు) టీమ్‌ఇండియా 528/3తో నిలిచింది. సచిన్‌ (122*; 226 బంతుల్లో 8×4, 1×6) 200 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్‌ ధోనీ (51*; 50 బంతుల్లో 3×4, 4×6) అర్ధశతకం కాగానే 610/3 వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. జహీర్ 5 వికెట్లతో విజృంభించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లకు 118కే ముగిసింది. ఫాలో ఆన్‌ ఆడిన రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 253కు ఆలౌటైంది. టీమ్‌ఇండియా  ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో విజయం అందుకుంది.


12 ఏళ్లకు పాక్‌

భారత్‌ సాధించిన 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ ఇలాంటి రికార్డు నెలకొల్పడం గమనార్హం. కరాచీ వేదికగా 2019 డిసెంబర్లో ఆ జట్టు శ్రీలంకతో తలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌191 పరుగులు చేసింది. శ్రీలంక 271తో బదులిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయకపోతే గెలవలేమని పాక్‌ పట్టుదలతో ఆడింది. 131 ఓవర్లకు 555/3 వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (135; 198 బంతుల్లో 7×4, 3×6), అబిద్‌ అలీ (174; 281 బంతుల్లో 21×4, 1×6) తొలి వికెట్‌కు 278 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత  కెప్టెన్‌ అజహర్‌ అలీ (118; 157 బంతుల్లో 13×1), బాబర్‌ ఆజామ్‌ (100*; 131 బంతుల్లో 7×4, 1×6) శతకాలు బాదేశారు. ఆ తర్వాత బౌలర్లు లంకను 212కే పరిమితం చేయడంతో పాక్‌ 263 పరుగులతో గెలిచింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని