కరోనా పరిశోధనలపై డ్రాగన్‌ కన్ను! - china research on covid19
close
Updated : 31/12/2020 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరిశోధనలపై డ్రాగన్‌ కన్ను!

సమాచారం పొక్కకుండా అడ్డుకుంటున్న చైనా

పరిశీలనలో కీలకాంశాలు వెలుగులోకి..

మోజియాంగ్‌: ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్‌ తమవద్ద పుట్టలేదని అందరినీ నమ్మించేందుకు చైనా ‘విశ్వ’ప్రయత్నాలూ చేస్తోంది. మహమ్మారి వ్యాప్తికి తాము బాధ్యులం కాదన్న వాదనను బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో చైనాలో కరోనా ఆనుపానులను తెలుసుకునేందుకు చేపట్టే పరిశోధనలన్నింటిపైనా డ్రాగన్‌ నిఘావేసి మరీ అడ్డుకుంటోంది. ఇందుకు సంబంధించిన కీలకాంశాలను ‘అసోసియేటెట్‌ ప్రెస్‌ (ఏపీ)’ వార్తాసంస్థ ప్రతినిధుల బృందం బయటపెట్టింది. చైనా ప్రభుత్వం ‘అంతర్గతంగా’ వేలకొద్దీ ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. విదేశీ శాస్త్రవేత్తలు, అధికారుల ఇంటర్వ్యూలతో పాటు.. పబ్లిక్‌ నోటీసులు, ఈ-మెయిళ్లు, చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రచురించిన పత్రాల ద్వారా విస్మయకర విషయాలను ఈ బృందం వెలుగులోకి తెచ్చింది. కరోనా విషయంలో చైనా ఆది నుంచీ గోప్యత పాటిస్తున్న విషయాన్ని తేటతెల్లం చేసింది.

జిన్‌పింగ్‌ ఆదేశాలు..

కరోనాపై శాస్త్రవేత్తలు జరుపుతున్న అధ్యయన ఫలితాలపై చైనా కన్ను వేసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రత్యక్ష ఆదేశాల మేరకు చైనా కేబినెట్‌ నిర్వహించే కొత్త ‘టాస్క్‌ఫోర్స్‌’ కరోనాపై అధ్యయన ఫలితాలను పరిశీలిస్తోంది. ఆ పత్రాల్లో కరోనా చైనాలోనే ఉద్భవించిందన్న అంశాలు లేకపోతేనే ప్రచురణకు ఆమోదం తెలుపుతోంది. చైనా సీడీసీ కూడా తమకు అనుగుణంగా ఉండే ఉద్యోగులనే నియమించుకుంటోంది. సమచారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని భయంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రపంచంలోని మోజార్టీ శాస్త్రవేత్తలు వుహాన్‌లోని గబ్బిలాల గుహల నుంచే కరోనా పుట్టిందని అభిప్రాయపడుతుండగా.. అలాంటి గుహలను (దక్షిణ చైనాలో) కూడా అధ్యయన బృందం పరిశీలించింది. అక్కడి స్థానికులతో మాట్లాడింది. వీరిని కూడా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల ఈ గుహల నుంచి ఓ ‘గబ్బిలాల పరిశోధన బృందం’ నమూనాలను సేకరించగా.. వెంటనే అక్కడి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వుహాన్‌ మార్కెట్‌ కట్టుదిట్టం

కరోనా పుట్టుకకు కారణంగా భావిస్తున్న వుహాన్‌ మార్కెట్‌ను కూడా చైనా కట్టుదిట్టం చేసింది. ఇక్కడ తమ చేతుల్లో ఏమీ ఉండదని వ్యాపారులే చెబుతున్నారు. ‘‘నోటీసు ఇవ్వకుండా మా వ్యాపారాలను మూసేశారు. బయటవారెవరూ లోపలకు రాలేరు. మా వస్తువులను మేం తీసుకోలేం. ఏ వస్తువునూ బయటకు తీయడానికి మాకు అనుమతి లేదు. ప్రభుత్వం ఈ నగరాన్ని ‘లాక్‌’ చేసింది. అన్ని వస్తువులను తొలగించింది’’ అని జియంగ్‌ దఫా అనే వుహాన్‌ మార్కెట్‌ వ్యాపారి తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌ చైనాలోనే ఉద్భవించిందన్న అధ్యయనాలు చాలావరకు నిజమేనని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. ‘‘చిన్న గబ్బిలాల సమూహాల నుంచి సార్స్, కరోనా వైరస్‌ వ్యాపించి ఉండొచ్చు. ఈ గబ్బిలాల గుంపుల్లో అనేక ఇతర సార్స్‌ సంబంధిత కరోనా వైరస్‌లను కూడా గుర్తించాం. ఇవి గుహల్లో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ గుహలు చైనా, అగ్నేయాసియాల్లో వ్యాపించి ఉన్నాయి’’ అని అమెరికా పరిశోధకురాలు జోనా మాజెట్‌ చెబుతున్నారు. ఆంక్షలతో కరోనా పరిశోధనలను అడ్డుకుంటున్న చైనా ప్రభుత్వం భవిష్యత్తు పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ మూలాలు కనుగొంటేనే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవడం సులువవుతుందని చెబుతున్నారు.

‘చీకటి’ గుహలవి..

కరోనా వైరస్‌ మూలాలు ఉన్నాయని భావిస్తున్న చైనా దక్షిణ ప్రాంతంలో ఉన్న లోయల్లో ఖనిజాల కోసం తవ్విన గుహలున్నాయి. ఈ ప్రాంతంపై అందరి దృష్టీ ఉన్నా.. చైనా నియంత్రణల కారణంగా దీని సమాచారమేదీ బయటకు రావడం లేదు. కాగా కరోనా వైరస్‌కు సంబంధించిన ఏ పరిశోధననూ చైనా ఎందుకు నియంత్రిస్తోందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని