రోమాలు నిక్కబొడుచుకున్నాయ్‌: చిరు - chiranjeevi appriciates wilddog team
close
Updated : 05/04/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోమాలు నిక్కబొడుచుకున్నాయ్‌: చిరు

ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ‘వైల్డ్‌డాగ్‌’: చిరు ప్రశంసలు

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ను ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని మెగాస్టార్‌ చిరంజీవి కితాబు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా అహిషోర్‌ సాల్మన్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తాజాగా చిరు వీక్షించారు. తర్వాత చిత్రబృందాన్ని ప్రశంసించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు.

‘‘గొప్ప విషయాలు జరుగుతున్నప్పుడు వాటి గురించి మళ్లీ మళ్లీ అందరితో పంచుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూశాక నాకు అదే అనిపించింది. మనమందరం గర్వపడే సినిమా చేశారు. మొదట్లో ఈ సినిమాలో పాటలు లేవు, కామెడీ లేదు, రొమాంటిక్‌ సీన్స్‌ లేవు అనే భావనతో ఉన్నాను. కానీ సినిమా చూస్తుంటే గగుర్పాటుకు లోనయ్యాను. రెండున్నర గంటలు ఎలాంటి బ్రేక్‌ లేకుండా, ఆఖరికి ఇంటర్వెల్‌ కూడా తీసుకోకుండా ఈ చిత్రాన్ని వీక్షించాను. అంతలా నేను ఉత్కంఠకు లోనయ్యాను. సినిమా పూర్తయిన వెంటనే నాగ్‌కు ఫోన్‌ చేసి - ఈ సినిమా గురించి మీరు ఎందుకంత తక్కువగా ప్రమోట్‌ చేశారు. ఇది చాలా గొప్ప చిత్రం. అద్భుతంగా ఉందని చెప్పాను’’ అని అన్నారాయన.

‘‘బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఉరి’ చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు మనమెందుకు చేయలేకపోతున్నామనే భావన నాలో కలిగింది. మిత్రుడు నాగార్జున ఇలాంటి సినిమా చేయడం నాకెంతో గర్వంగా అనిపించింది. తెలుగువాళ్లు కూడా ఇలాంటి చిత్రాలు అత్యద్భుతంగా చేయగలరు అనిపించేలా సినిమా రూపొందించారు. కొన్ని పోరాట సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలు చూసి ఓ భారతీయుడిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఓ సీన్‌లో విలన్‌ని పట్టుకున్నప్పుడు నాగ్‌ చెప్పిన డైలాగ్‌కి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమా మొత్తం పూర్తయ్యాక  నా నోటివెంట జైహింద్‌ అనే మాటలు వెలువడ్డాయి. తక్కువ బడ్జెట్‌తో, అల్ప సమయంలో ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాల్మన్‌, నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు. ప్రేక్షకుల అభిరుచి కూడా ఎంతో మారింది. కొత్త తరహా చిత్రాలను వాళ్లు ఆహ్వానిస్తున్నారు. ఈ సినిమా చూసిన వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే అందరూ ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని కోరుకుంటున్నా’’ అని చిరు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని