అందుకే ‘సైరా’ 150వ సినిమాగా చేయలేదట! - chiranjeevi speaking about sye raa narasimha reddy
close
Published : 07/12/2020 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘సైరా’ 150వ సినిమాగా చేయలేదట!

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. రాజకీయాల తర్వాత చిరు ‘ఖైదీ నంబర్‌ 150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తన రీఎంట్రీ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందని కూడా అనుకున్నారట. కానీ, ఎందుకు ఆ కథను చేయలేదో ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘నా సినీ జీవితంలో చెప్పుకోదగ్గ పాత్రలు ఓ పది ఉంటాయి. అవన్నీ ఆ సీజన్‌లో అప్పుడు హిట్‌ అయ్యాయి, నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. కృష్ణ గారికి ‘అల్లూరి సీతారామరాజు’ ఉంది. ఎన్టీఆర్‌ అంటే పౌరాణిక పాత్రలు గుర్తొస్తాయి. నాకు ‘ఖైదీ’, ‘ఇంద్ర’, ‘చూడాలని ఉంది’, ‘స్టాలిన్‌’ వంటి హిట్లు ఉన్నాయి. కానీ.. చరిత్రలో నిలిచిపోయే పాత్రలేదు అనే అసంతృప్తి ఉండేది. నాకు వ్యక్తిగతంగా స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలని ఉండేది. భగత్‌సింగ్‌ కథ చేయాలని ఉండేది. ఏ నిర్మాత గానీ, కథకుడు గానీ ఆ కథతో నా ముందుకు రాలేదు. అప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ గురించి తెలిసింది. దీన్ని కమర్షియల్‌ కథగా కూడా చేయొచ్చని పరుచూరి బ్రదర్స్‌ నాకు చెప్పారు. నాకు కథ నచ్చింది. కానీ దర్శకత్వం వహించేవారు, అంత భారీ బడ్జెట్‌ను పెట్టేవారు ముందుకు రాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లా’’

‘‘విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నా 150వ సినిమా ఎలాంటి కథతో తీస్తే బాగుంటుందని చాలా ఆలోచించాం. ‘సైరా’ కథ కూడా అందులో ఉంది. అయితే, నా రీఎంట్రీలోనే ఈ పాత్ర చేస్తే వైవిధ్యమైన పాత్రలే చేయాల్సి వస్తుందనే మీమాంస ఉంది. అందుకే పదేళ్ల కిందట నన్ను చూసి ప్రేక్షకులు ఏవిధంగా ఆనందపడ్డారో అలాగే రీఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అందుకే రీమేక్‌ కథను ఎంచుకున్నా. అందులోనూ సందేశం ఉండటంతో మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత నా క్రేజ్‌ అలానే ఉందని అర్థమైంది. ఈ తరుణంలో చరిత్రలో కనుమరుగు అవుతున్న వీరుడి సినిమాను బయటికి తీసుకురావాలి అనుకున్నాం. దాన్ని తెరపైకి తీసుకురావాలి.. పాన్‌ ఇండియాగా రూపొందించాలనుకున్నాం. కానీ, బడ్జెట్‌ చూసుకుంటే రూ.300 కోట్లు కనిపిస్తోంది. అంత బడ్జెట్‌ పెట్టి తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని, బలాన్ని, ధైర్యాన్ని ‘బాహుబలి’ రూపంలో రాజమౌళి మాకు ఇచ్చారు. ఆయనకు థాంక్యూ. మనమే బడ్జెట్‌ పెట్టి తీద్దామని చరణ్‌ అన్నాడు. అలా సినిమా తెరపైకి వచ్చింది’’ అని చిరు చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని