సుప్రీం ‘పీఠం’పై తెలుగు తేజం - cji bobde recommends name of justice nv ramana as his successor
close
Updated : 06/04/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుప్రీం ‘పీఠం’పై తెలుగు తేజం

హైదరాబాద్‌: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను న్యాయశాఖ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ రమణ కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు మరో తెలుగు వ్యక్తికి ఆ అవకాశం దక్కలేదు.

వ్యవసాయ కుటుంబం నుంచి..

కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్‌ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. ఎన్‌. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్‌ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్‌.వి.వి.ఎన్‌ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

సివిల్‌, క్రిమినల్‌ చట్టాల్లో దిట్ట..

సివిల్‌, క్రిమినల్‌ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్‌ రమణ దిట్ట. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు. రైల్వేతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తూ 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో ఆంధ్రపదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

ప్రజా సమస్యలపై సుమోటోగా కేసులు

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై సుమోటోగా పిటిషన్‌లను విచారణకు స్వీకరించి అప్పటి దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ దిల్లీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 20ఏళ్ల విద్యార్థి నిడో తానియాను దుకాణాదారులు కొట్టి చంపిన విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా విచారించారు. అదనపు కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అంతేగాక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి దిల్లీ హైకోర్టులో ఇ-ఫైలింగ్‌ను ప్రారంభించారు.

తెలుగు భాషపై మక్కువ

జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. రాష్ట్ర న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయడానికి చాలా కృషి చేశారు. కేసు విచారణ ప్రక్రియ కక్షిదారుకు అర్థమయ్యే స్థానిక భాషలో ఉండాలని, న్యాయవాదులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియని స్థితిలో వారుండరాదన్నది జస్టిస్‌ రమణ భావన. అందుకే న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయాల్సిన అవసరం ఉందని, జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడిగా అధికార భాషా సంఘంతో కలిసి సెమినార్‌ నిర్వహించారు. న్యాయవ్యవస్థలో తెలుగు భాష అమలు నిమిత్తం ఈ సెమినార్‌ పలు తీర్మానాలు అప్పటి ప్రభుత్వానికి పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సమ్మతించి తెలుగు అమలుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని