కరోనా బాధితుడు ఏమయ్యాడు! - corona patient missing in tirupati
close
Updated : 05/08/2020 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితుడు ఏమయ్యాడు!

●ఆస్పత్రి.. మార్చురీలోనూ కనిపించని వైనం

●చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం

తిరుపతి(వైద్యం): జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి-2(రుయా) లో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 6.40కి చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో కడచూపు కోసం ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని చూపించకపోవడంతో మార్చురీలోకి వెళ్లి చూసినా కన్పించలేదు. ఆస్పత్రిలో లేక, మార్చురీలో లేక ఏమయ్యాడని కుటుంబసభ్యులు అధికారులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలానికి చెందిన మాజీ సర్పంచి(49) తీవ్ర దగ్గు, ఆయాసంతో తిరుపతి రుయా అత్యవసర విభాగానికి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని పరీక్ష చేశారు. పాజిటివ్‌ రావడంతో ఆ రాత్రి కొవిడ్‌ ఆస్పత్రిలోకి మార్చారు. రెండు మూడు రోజుల వరకు కుటుంబ సభ్యులతో చరవాణిలో మాట్లాడారు. ఆదివారం నుంచి చరవాణి స్విచ్చాఫ్‌లో ఉంది. ఏమయ్యాడనే భయాందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం చనిపోయాడనే సమాచారం అందింది. భార్య, పిల్లలు చివరి చూపు కోసం ఆస్పత్రి వద్దకు వచ్చారు. గోవిందధామానికి తీసుకెళ్లేటప్పుడు ముఖం చూపిస్తామని, మార్చురీ వద్ద ఉండమని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకురాలేదు. చివరకు లోపలకు వెళ్లగా ఆ బాధితుడి మృతదేహం లేదని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తూ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో కలసి మార్చురీలో పరిశీలించి మృత దేహం లేనట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కొవిడ్‌ ఆస్పత్రిలోకి వెళ్లి పరిశీలించారు.

వివరాలు తప్పుగా రాసి..

అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని పక్క పడకలో ఉన్న కరోనా బాధితుడు చనిపోతే.. ఆ వివరాలు ఇతని కేసష్‌ీట్‌లో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా నమోదు చేసినట్లు గుర్తించారు. చనిపోయిన బాధితుడి మృతదేహం మార్చురీలో ఉంది. అయితే 49 ఏళ్ల బాధితుడు ఏమయ్యాడంటూ ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో పరిశీలించారు. అతని పడక వద్ద చరవాణి ఛార్జర్‌, సంచి ఉండటాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం ఆస్పత్రి బయట నిలబడి ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెప్పినట్లు తెలిసింది. కొవిడ్‌ ఆస్పత్రిలో లేకుండా ఎక్కడికెళ్లాడో తేల్చాలని కుటుంబ సభ్యులు ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని