ముందు డబ్బు.. తర్వాతే వైద్యం - corona treatment
close
Published : 09/04/2021 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముందు డబ్బు.. తర్వాతే వైద్యం

కరోనా బాధితుల పట్ల ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై విమర్శలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 

రాజధానిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. కరోనాను అడ్డుపెట్టుకుని బాధితులను అడ్డగోలు దోపిడీకి గురి చేస్తున్నాయి. కావాల్సిన కరోనా వ్యాక్సిన్‌ వేయాలంటే డోసుకు రూ.3 వేలు, ఆపై వసూలు చేస్తున్నాయి. ఇక వైద్యానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీ కింద మాట్లాడుకుని మరీ దండుకుంటున్నాయి. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి. 

మహా నగరంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. చాలా మందిలో కరోనా లక్షణాలు కన్పిస్తున్నా, సొంతగా మందులను మింగుతున్నారు తప్పించి, లక్షణాలు తీవ్రమయ్యాకే నిర్ధారణ పరీక్షకు వెళుతున్నారు. అప్పటికే పరిస్థితి తీవ్రం అవుతుండడంతో ఏదో ఒక ఆస్పత్రిలో వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వ పరంగా ప్రస్తుతం కేవలం గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో మాత్రమే కరోనా వైద్యం లభిస్తోంది. గాంధీలో సీరియస్‌గా ఉన్న వారినే చేర్చుకుంటున్నారు. మిగతా రెండింటిలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపడంలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో లేవు. పెద్ద ప్రైవేటు వైద్యశాలల్లో వారం కిందటే పడకలన్నీ నిండిపోయాయి.  ఇతర రోగాలతో ఉన్న రోగులు ఉండటంతో పెద్ద ఆస్పత్రులు కరోనా రోగుల కోసం పడకలను పెంచే ఉద్దేశంలో లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని దండుకొనేందుకు పలు ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. బాధితుల బంధువులతో ముందే బేరం మాట్లాడుకుంటున్నాయి. ‘ఆరు రోజులకు రూ.5 లక్షల ప్యాకేజీ అవుతుంది. నగదు రూపంలో చెల్లిస్తే వైద్యం మొదలుపెడతాం’ అంటూ చెబుతున్నాయి. రెండు రోజుల కిందట కూకట్‌పల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని మరో ఆస్పత్రి ఇలాగే దోపిడీకి పాల్పడుతోందని వాపోతున్నారు.   

అదే వ్యాక్సిన్‌ కావాలంటే..  
నగరంలో కొవాగ్జిన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఆస్పత్రులు కొవాగ్జిన్‌ ఒక్కో డోసుకు రూ.3 వేలు, ఆపైన వసూలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి ఈటల ఆగ్రహంగా ఉన్నారు. కొవిడ్‌ చికిత్సలు, వాక్సిన్‌కు అధిక ధర వసూలు చేయడంపై నిఘా పెట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.   

కొవిడ్‌ బాధితుడినీ వదల్లేదు..
నారాయణగూడ, న్యూస్‌టుడే: కొవిడ్‌ బాధితుణ్నీ సైబర్‌ నేరస్థులు వదల్లేదు. ఓ వ్యక్తి కొవిడ్‌కు లక్డీకాపూల్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇంట్లో విడిగా ఉండే సౌకర్యం లేక హోటల్‌లో ఉండాలనుకున్నారు. గూగుల్‌లో ఓయో కస్టమర్‌ కేర్‌ నంబరు తెలుసుకొని ఫోన్‌ చేయగా.. స్పందించలేదు. కొద్దిసేపటికే ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఓయో ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. గది ఏర్పాటు చేస్తానని చెప్పాడు. బాధితుడి ఖాతా యూపీఐ నంబరు తెలుసుకొని రూ.3 లక్షలు కాజేశాడు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని