WHO: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ! - covid 19 virus expected to continue to transmit for very long time says who
close
Updated : 29/09/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WHO: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ!

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్‌ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ‘మనం వైరస్‌ ఆధీనంలో ఉన్నాం అని కానీ.. వైరస్‌ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించకూడదు’ అని ఈ సీనియర్‌ అధికారిణి వ్యాఖ్యానించారు. కొవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిపై వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌  పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ వైరస్ చాలాకాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నా. వ్యాధి త్వరలోనే అంతమవుతుందా? సుదీర్ఘ కాలం కొనసాగుతుందా? అనే విషయం పలు రకాల అంశాల మీద ఆధారపడి ఉంది. సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలే ఉన్నప్పటికీ.. టీకాలు, రోగనిరోధక శక్తి కారణంగా కరోనా ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశం ఉంది’ అని తెలిపారు. వ్యాధి నిర్మూలన అసంభవం అయినప్పుడు దాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. దీని ద్వారా ఆసుపత్రిలో చేరడం, మరణాలను అరికట్టవచ్చని.. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

బూస్టర్‌ డోస్‌ను నిలిపివేస్తే 40 దేశాలకు టీకాలు

ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్‌ డోస్‌ వినియోగాన్ని ఆమె వ్యతిరేకించారు. బూస్టర్‌ డోస్‌ వినియోగం కారణంగా.. పలు దేశాల్లో మొదటి డోసు కోసం వేచి చూస్తున్న మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ సరఫరా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ‘బూస్టర్‌ డోసు వినియోగంపై డబ్ల్యూహెచ్‌లో ఈ ఏడాది చివరి వరకు మారటోరియం విధించింది. బూస్టర్‌ డోసును నిలిపివేస్తే అన్ని దేశాల్లోని కనీసం 40 శాతం మందికి టీకాలు అందుతాయి. ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారు సహా హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. అందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితం కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. మూడో డోసు అందరికీ అవసరం ఉండకపోవచ్చని కూడా తెలిపారు. శాస్త్రీయంగా నిరూపితం అయిన తర్వాతే మూడో డోసు వినియోగంపై డబ్ల్యూహెచ్‌లో మార్గనిర్దేశం చేయనుందని వెల్లడించారు.

థర్డ్‌వేవ్‌ మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంది

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందనే వార్తలపై పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌ స్పందించారు. అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనందరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వైరస్‌ ఎక్కువ మందికి సోకే అవకాశం లేదని తెలిపారు. వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృతిచెందుతున్న వారిలో టీకాలు తీసుకోనివారే అధిక శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని