ఆ వ్యాధి ఉన్న కరోనా రోగులకు ప్రమాదం ఎక్కువే! - covid patients with gum disease
close
Updated : 11/02/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వ్యాధి ఉన్న కరోనా రోగులకు ప్రమాదం ఎక్కువే!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికే ప్రమాద తీవ్రత ఎక్కువని ఇప్పటికే నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇక వీటిలో చిగుళ్ల వ్యాధి కూడా చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు వైరస్‌ బారినపడితే, సాధారణ రోగుల కంటే తొమ్మిది రెట్ల ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. అందుకే కరోనా వైరస్‌ నియంత్రణలో నోటి పరిశుభ్రత, ఇతర ఆరోగ్య సంరక్షణ పద్ధతులు పాటించడం ఎంతో కీలకమని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

‘చిగుళ్ల వ్యాధి-కరోనా ప్రభావం’పై అధ్యయనంలో భాగంగా ఖతార్‌లో పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ సోకిన దాదాపు 568మంది బాధితుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో చిగుళ్ల వ్యాధితో బాధపడుతోన్న వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందించే అవకాశం 3.5రెట్లు పెరగగా, వెంటిలేటర్‌ అవసరం 4.5రెట్లు పెరిగినట్లు జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ పీరియాడోంటాలజీలో ప్రచురితమైన తాజా నివేదక వెల్లడించింది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధి ఉండి, కరోనా బారినపడిన రోగుల్లో ఇతరుల కన్నా 8.81రెట్ల ఎక్కువ ప్రాణపాయం ఏర్పడే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు.

చిగుళ్ల వ్యాధి ఉన్న రోగుల నోటిలో రక్తపు గుర్తులు, శరీరంలో కరోనా ప్రభావం వల్ల కలిగే వాపు(ఇన్‌ఫ్లమేషన్‌) సంక్లిష్టతను తెలియజేస్తాయి. అయితే ‘నోటిలో ఏర్పడే ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల కరోనా వైరస్‌ మరింత ప్రభావం చూపడానికి దారులు తెరుస్తుంది’ అని ఇజ్రాయెల్‌లోని హిబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లయర్‌ షాపిరా వెల్లడించారు. చిగుళ్ల వ్యాధితో బాధపడేవారి నోటిలో ఉండే బాక్టీరియా లోనికి వెళ్లి ఊపిరితిత్తులకు మరింత ప్రమాదకరంగా మారుతుందని స్పెయిన్‌లోని కంప్లూటెన్స్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మరియానో శాంజ్‌ పేర్కొన్నారు. ఇవే కరోనా బాధితుల్లో వైరస్‌ ప్రమాద తీవ్రత పెంచడానికి కారణమవుతున్నాయని తెలిపారు. అందుకే కరోనా వైరస్‌ తీవ్రతను తగ్గించడంలో నోటి సంరక్షణను కూడా ఆరోగ్య సిఫార్సుల్లో భాగంగా ఉంచడంతో పాటు చికిత్స సమయంలో యాంటీసెప్టిక్‌లను వాడడం వల్ల ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

పరిశోధనలో భాగంగా, చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్న వారిలో శరీర బరువు, ఉబ్బసం, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. చిగుళ్ల సమస్య చిన్నదే అయినప్పటికీ..నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుందని నిపుణుల అభిప్రాయం. అందుకే నోటి సంరక్షణ జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్‌ బారిన పడినా.. ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
కరోనా వైరస్‌ జీవాయుధం కాకపోవచ్చు!
కరోనా వైరస్‌ బలహీనత ఇదే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని