రాజమహేంద్రవరంలో కొత్తరకం వైరస్‌ కలకలం - covid positive case identification in rajamahendravaram
close
Updated : 24/12/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమహేంద్రవరంలో కొత్తరకం వైరస్‌ కలకలం

యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌
కరోనా స్ట్రెయిన్‌ కావొచ్చని యంత్రాంగం అప్రమత్తం

రాజమహేంద్రవరం: కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. యూకే నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సంబంధిత మహిళ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 22న దిల్లీలో బయలుదేరి, బుధవారం రాత్రి రాజమహేంద్రవరం చేరారు. రాజమహేంద్రవరం చేరుకున్న మహిళను రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళతోపాటు ఆమె కుమారుడికి సైతం పీపీఈ కిట్లు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోమల అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామకృష్ణానగర్‌లోని పలువురు ఆంగ్లో ఇండియన్లు, మహిళ బంధువులు రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. ఇవాళ వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

వైరస్‌ కొత్తదా... పాతదా: బ్రిటన్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు జన్యు మార్పిడి చెందిన వైరస్సా లేక పాత కరోనానా అనే సంగతి ఇంకా నిర్ధారణ కాలేదు. సెప్టెంబరు నుంచే బ్రిటన్‌లో కొత్త వైరస్‌ ప్రబలుతున్నట్లు వెల్లడి కావడంతో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. లండన్‌ నుంచి సోమవారం రాత్రి దిల్లీకి వచ్చిన మహిళ క్వారంటైన్‌లో ఉండకుండానే ఇక్కడికి వచ్చారని ప్రచారం జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ఇంటికి చేరుకుని వివరాలు ఆరాతీశారు.


విమానాశ్రయంలో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కోమల

విమానాశ్రయంలో పరీక్షలు: వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి విమానాశ్రయంలో దేశీయ సర్వీసులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ముప్పు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. విమాన ప్రయాణికులకు కొంచెం శరీర ఉష్ణోగ్రత పెరిగినా, ఆక్సిజన్‌ స్థాయి తగ్గినా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఫలితం వచ్చిన తరువాత మాత్రమే వారిని ప్రయాణానికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.

జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు: తాజా పరిణామాల నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో రెండు ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. కొత్త వైరస్‌ జాడను కాకినాడలోని వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారించే పరిస్థితి లేదు. అందుకే ఈ నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.

ఎప్పుడు.. ఎలా: రాజమహేంద్రవరంలోని రామకృష్ణానగర్‌లో ఉంటున్న ఓ ఆంగ్లో ఇండియన్‌ దంపతులు నగరంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో జీతభత్యాలు చాలకపోవడంతో లండన్‌లో ఉద్యోగం వెతుక్కుని ముందుగా భర్త అక్కడికి వెళ్లారు. తరువాత కుమార్తెతో కలిసి సంబంధిత మహిళ వెళ్లారు. ప్రస్తుతం కుమారుడి కోసం ఆమె ఇక్కడికి తిరిగి వచ్చారు.

ఇదీ చదివారా..
నిమ్స్‌లో జన్యువిశ్లేషణ కేంద్రం!

మరో వేషంలో మహమ్మారి!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని