Covishield: ‘డెల్టా’పై ఒక్క డోసుతో 61% సామర్థ్యం - covishield single dose had up to 61 per cent effectiveness against the delta
close
Updated : 17/06/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covishield: ‘డెల్టా’పై ఒక్క డోసుతో 61% సామర్థ్యం

దిల్లీ: కొవిషీల్డ్ టీకా ఒక్కడోసు డెల్టా వేరియంట్‌పై 61 శాతం ప్రభావం చూపినట్లు వెల్లడైంది. భారత్‌లో జరిపిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య అంతరంపై చర్చ నడుస్తోన్న వేళ.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఆ వ్యవధి పెంపుపై చేసిన పరిశోధన, తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. 

జనవరి 16న కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని నాలుగు వారాలుగా నిర్ణయించింది. ఆ సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా రోగనిరోధక ప్రతిస్పందన మెరుగ్గా ఉందని అరోరా పేర్కొన్నారు. అయితే, యూకే మాత్రం అప్పటికే రెండు డోసుల అంతరాన్ని 12 వారాలకు పెంచింది. 

ఆ తరవాత ఆ వ్యవధిని 6 నుంచి 8వారాలకు పెంచడం మంచి ఆలోచన అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే, వర్కింగ్‌ గ్రూప్ మాత్రం యూకే సమాచారాన్ని విశ్లేషించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

 రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధితో టీకా సామర్థ్యం 65 శాతం నుంచి 80 శాతం మధ్య ఉన్నట్లు పబ్లిక్ హెల్త్‌ ఇంగ్లండ్ ఏప్రిల్‌లో వెల్లడించింది. మళ్లీ కొద్ది రోజుల తరవాత ఒక డోసుతో 33 శాతం రక్షణ మాత్రమే లభిస్తున్నట్లు చెప్పింది. కానీ, ట్రయల్స్‌లో ఆ డోసు పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

 ఈ క్రమంలో మే 13న రెండు డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ సమయంలో దేశంలో కరోనా రెండోదశ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. మరోపక్క టీకాల కొరతపై వార్తలు వెల్లువెత్తాయి. మూడు నెలల్లో వరుసగా రెండు సార్లు డోసుల మధ్య అంతరాన్ని కేంద్రం పెంచింది. దాంతో కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 

 మరోపక్క యూకే ఫలితాలతో అరోరా బృందం ఒక అంచనాకు రాలేకపోయింది. ఆ తరవాత భారత్‌లో వెల్లూరులోని క్రిస్టియన్ వైద్య కళాశాలలో జరిపిన పరిశోధన గణాంకాలను పరిశీలించింది. కొవిషీల్డ్ ఒక డోసు డెల్టా వేరియంట్‌పై 61 శాతం ప్రభావం చూపినట్లు వెల్లడైంది. రెండు డోసులతో ఆ సామర్థ్యం 65 శాతానికి పెరిగిందని ఆ బృందం గుర్తించింది. ఆ సమయంలో దేశంలో వైరస్‌ ఉద్ధృతికి డెల్టా వేరియంటే కారణమేనని నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

 కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ డోసులు తీసుకుంది ఒక్కటైనా, రెండైనా.. స్వల్పకాలంలో వ్యాధి పరంగా రక్షణ, ఆస్పత్రుల్లో చేరడం, మరణాలు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయని ఆయన తెలియజేశారు.

ఇదిలా ఉండగా.. రెండు డోసుల మధ్య విరామాన్ని 8-12 వారాలకు పెంచడంపైనే చర్చ జరిగిందని ముగ్గురు శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. 12-16 వారాలకు కాదని తెలిపింది. ఆ ముగ్గురులో ఒకరు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడెమాలజీ మాజీ అధినేత అని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం.. శాస్త్రీయ సమాచారం ఆధారంగానే ఈ అంతరం పెంపుపై పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇంకోపక్క కొందరు నిపుణులు కొవిషీల్ట్ కాలపరిమితిని 8 వారాలకు తగ్గించడం మేలని సూచిస్తున్నారు. బ్రిటన్‌లో గత డిసెంబర్‌లో అప్పటి ఒరిజినల్ రకం వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని పెంచారని అంటున్నారు. ఆ తర్వాత డెల్టా వేరియంట్ ప్రాబల్యం పెరడగంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు. మన దేశంలో 50 శాతం డెల్టా రకం వైరస్ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనాలే సూచిస్తున్నాయని, వ్యవధిని తగ్గించి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి గరిష్ఠ రక్షణ కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని