close

తాజా వార్తలు

ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డమే క‌ష్ట‌మైంది

హైదరాబాద్‌: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌క‌నిర్మాల దృష్టంతా క‌థ‌పైనే. ర‌చ‌యిత‌లంతా మెగాఫోన్ ప‌ట్ట‌డంపైనే దృష్టి పెడుతుండ‌టంతో ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌కి క‌థలు దొర‌క‌డం క‌ష్ట‌మైంది. సొంత క‌థ‌లతో సినిమాలు తీసే ద‌ర్శ‌కులు కొద్దిమందే కాబ‌ట్టి, మిగిలిన వాళ్లంతా కూడా మంచి క‌థ ఎవ‌రు చెబుతారా అని ఎదురు చూస్తుంటారు. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు మాత్రం ‘నా ద‌గ్గ‌ర బోలెడు క‌థ‌లున్నాయి. వాటికి ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డ‌మే క‌ష్టంగా ఉంది’ అంటున్నారు.  ఆయ‌న  కాంపౌండ్‌లో ఎప్పుడూ కొత్త క‌థ‌లు సిద్ధ‌మ‌వుతూ ఉంటాయి. అలాగే ఇటీవల పొరుగు భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాల రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్నారు. అలా ఆయ‌న ద‌గ్గ‌ర బోలెడ‌న్ని క‌థ‌లు పోగ‌య్యాయి. వాట‌న్నింటినీ వ‌రుస‌గా తెర‌కెక్కించ‌డ‌మే త‌న క‌ర్త‌వ్యం అంటున్నారు. ఇటీవ‌ల టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌తో క‌లిసి ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మించారు సురేష్‌బాబు. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 13న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ  సంద‌ర్భంగా సోమ‌వారం సురేష్‌బాబు, హైద‌రాబాద్‌లో  విలేక‌ర్ల‌తో మాట్లాడారు. ఆ విష‌యాలివీ... 

అందుకే విడుదల తేదీలో గందరగోళం

* ‘‘నా కెరీర్‌లో తొలిసారి విడుద‌ల విష‌యంలో గంద‌ర‌గోళానికి గుర‌య్యా. చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత ‘వెంకీమామ’ని ఈ నెల 13న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ సినిమాని మొద‌ట ద‌స‌రాకే విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ, నా జీవితంలో గ‌తేడాది చాలా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందుకే రెండు నెల‌ల‌పాటు అమెరికాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది.  అయినా ద‌స‌రాకి విడుద‌ల చేద్దామ‌ని ప్ర‌య‌త్నించాం కానీ... వెంక‌టేష్ కాలికి గాయ‌మైంది. ఆ త‌ర్వాత దీపావ‌ళికి అనుకున్నాం కానీ, రాశీఖ‌న్నా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో మిగిలిన ఒక్క పాట‌ని చిత్రీక‌రించ‌లేక‌పోయాం. అలా దీపావ‌ళికి కూడా రాలేక‌పోయాం. దాంతో సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌నే పుకారొచ్చింది. కానీ మేం ఆ దిశ‌గా అస్స‌లు ఆలోచ‌న చేయ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే మూడు సినిమాల విడుద‌ల తేదీలు ఖ‌రార‌య్యాయి. మేం కూడా అప్పుడు రావ‌డం భావ్యం కాదు. పైగా వెంక‌టేష్‌కి అంద‌రితో మంచి అనుబంధం ఉంది.  అందుకే మ‌ధ్యేమార్గంగా మేం క్రిస్మస్‌ కూడా క‌లిసొస్తుంద‌ని ఈ నెల 13న విడుద‌ల తేదీగా ఖ‌రారు చేశాం. మ‌హిళ‌ల‌కి కూడా న‌చ్చే అంశాలు ఉన్నాయి కాబ‌ట్టి, నా థియేట‌ర్ల‌లో సంక్రాంతి వ‌ర‌కు కూడా ఈ సినిమా ఆడుతుంద‌నే భ‌రోసా ఉంది’’.

ఈ సినిమాలో అన్నీ ఉంటాయి

‘‘వెంక‌టేష్ ‘ఎఫ్‌2’ చేయ‌డం కంటే ముందే ఈ సినిమా క‌థ మా ద‌గ్గ‌ర ఉంది. జనార్ధ‌న మ‌హ‌ర్షి చెప్పిన ఈ క‌థ‌ని మొద‌ట వివేక్ కూచిభొట్ల మా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. క‌థ న‌చ్చింది కానీ, దీనికి చాలా మెరుగులు దిద్దాలి అనిపించింది. అప్పుడు కోన‌ని పిలిచి ఈ క‌థ వినిపించి ఏమైనా మార్చ‌గ‌ల‌మా అని అడిగా. మార్చొచ్చు అని చెప్పి ద‌ర్శ‌కుడు బాబీని ప‌రిచ‌యం చేశాడు. బాబీ, ఆయ‌న బృందం క‌లిసి ఈ క‌థ‌ని కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో క‌లిపి స్క్రిప్టు చేశారు. ఆ సీక్వెన్స్ గురించి చెప్ప‌గానే నాకు క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పుడైనా సినిమాని ఒక టెంప్లేట్ ప్ర‌కారం చేస్తుంటాను. దాని ప్ర‌కారం నాకున్న సందేహాల‌న్నింటినీ బాబీ ముందు పెట్టా. వాట‌న్నిటికీ పరిష్కారం వెదుక్కుంటూ ఈ సినిమాని పూర్తి చేశాడు బాబీ. భావోద్వేగాలు, విలువ‌లు, మంచి హాస్యం, కుటుంబ అంశాలు... అన్నీ మేళ‌వించిన చిత్ర‌మిది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాని చూశాక మ‌నం కూడా ఇలా ఉండాలి, ఇలాంటి విష‌యాల్ని అనుస‌రించాల‌ని ఒక నిర్ణ‌యానికొస్తారు’’ 

అలా చేస్తే ఎక్కువగా రోజులు ఆడతాయి

* ‘‘ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమాని అందించాలి. కొన్ని ఊళ్ల‌లో ఒక‌ట్రెండు థియేట‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. వాటిలో ప్ర‌ద‌ర్శ‌న మ‌ల్టీప్లెక్స్‌ల త‌ర‌హాలో ఉండాలి. రోజుకి మొత్తం ప‌ది షోలు ప‌డ‌తాయంటే అందులో మూడు నాలుగు సినిమాల్ని ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దాంతో అన్ని ర‌కాల సినిమాలు ప్రేక్ష‌కులకి అందుబాటులోకి వ‌స్తాయా. పైగా ఒక్కొక్క‌సినిమా ఇదివ‌ర‌క‌టిలాగా  ఎక్కువ రోజులు ఆడే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే, తాను అనుకున్న సినిమా థియేట‌ర్‌లో లేదంటే ప్రేక్ష‌కుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటాడు.  డిజిట‌ల్ మాధ్య‌మాలు, పైర‌సీల్ని ఆశ్ర‌యిస్తాడు. అందుకే మ‌నం సినిమాని ప్రేక్ష‌కుల ముందు స‌మ‌ర్థ‌ంగా తీసుకెళ్లాలి’’. 

దర్శకుల్ని ఎంపిక చేయడం కష్టంగా ఉంది

* ‘‘క‌థ‌లు చాలా ముఖ్యం. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోలంటే ఖాన్ త్ర‌య‌మే. కానీ ఇప్పుడ‌క్క‌డ ఆయుష్మాన్‌ఖురానా, రాజ్‌కుమార్ రావువంటి హీరోల సినిమాలు కూడా వంద‌ల కోట్లు వ‌సూళ్లు చేస్తున్నాయి. అక్ష‌య్‌కుమార్ అన్ని ర‌కాల క‌థ‌లు చేస్తున్నాడు.  వాళ్ల శైలిలో క‌థా బ‌ల‌మున్న చిత్రాలు చేయాలి. అప్పుడు అన్ని  సినిమాల్ని, అంద‌రి సినిమాల్నీ చూడ‌టానికి ప్రేక్ష‌కుడు ఆస‌క్తి చూపుతాడు. తెలుగులో కూడా క‌థానాయ‌కులు అలా మారే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంది. డిజిట‌ల్ మాధ్య‌మాల వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచ‌న లేదు. నా ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల‌కి ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డ‌మే ఇప్పుడు క‌ష్టంగా మారింది’’

అందుకోసమే శ్రమిస్తున్నాం

* ‘‘హాలీవుడ్‌లో ఒకొక్క క‌థ కోసం రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. ప్రి ప్రొడ‌క్ష‌న్ చాలా ముఖ్యం. ఇక్క‌డ కూడా క‌థ‌లు బాగానే ఉంటాయి. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని... మ‌రిన్ని మెరుగులు దిద్ద‌మ‌ని చెబుతుంటాం. సినిమా తీసే విధానం ఉత్త‌మంగా ఉండాలి. అప్పుడు అనుకున్న ఫ‌లితాలొస్తాయి. `హిర‌ణ్య‌` కోసం మూడేళ్లుగా మా బృందం క‌ష్ట‌ప‌డుతోంది.  అత్యుత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమా తీయాల‌నేదే మా క‌స‌రత్తంతా. అందుకోస‌మే శ్ర‌మిస్తున్నాం. వెంక‌టేష్ కోసం త‌రుణ్ భాస్క‌ర్ క‌థ‌ని సిద్ధం చేస్తున్నాడు. త్రినాథ‌రావు న‌క్కిన కూడా ఇంత‌కుముందు అనుకున్న క‌థ కాకుండా, మ‌రొక‌టి సిద్ధం చేస్తున్నాడు’’.

దాసరి తరహాలో నాయకుడు కావాలి

* ‘‘ఎప్ప‌ట్నుంచో సినిమాలు తీస్తున్నాం కానీ, మ‌న విధానం మాత్రం ఇంకా మార‌లేదు. హిందీ యాభై శాతం మారింది. అక్క‌డ కొన్ని సంస్థ‌లు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా సినిమాని తీస్తున్నాయి. ఇక్క‌డ నిర్మాత‌లకి త‌ప్పులు క‌నిపిస్తున్నా, వాటిని అలానే  చేయ‌నిస్తున్నారు. దాంతో అన్ని విభాగాల్లోనూ ఎఫిషియ‌న్సీ లోపించింది. దానివ‌ల్లే స‌మ‌స్య‌లు. అంద‌రూ స‌మ‌ర్థ‌త‌తో ప‌నిచేస్తే  ప‌రిశ్ర‌మ క‌చ్చితంగా మంచి దారిలో ప‌య‌నిస్తుంది. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర‌హాలో  మ‌న ప‌రిశ్ర‌మ‌కి ఒక నాయ‌కుడు అవ‌స‌రం నిజంగానే ఉంది. నాలాంటివాళ్లు ఆ బాధ్య‌త‌ని తీసుకుంటే స్వార్థం కోణాల్ని వెదుకుతారేమో అనిపిస్తుంటుంది’’.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.