
తాజా వార్తలు
ఆ హీరోపై కోపం నాపై చూపారు..!
నటి సారా అలీ ఖాన్
ముంబయి: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా.. కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు సారా అలీ ఖాన్. ‘కేదార్నాథ్’, ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’తో అలరించిన ఆమె ‘కూలీ నెం.1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సారా, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రమిది. డేవిడ్ ధావన్ దర్శకుడు. సారా తండ్రి పాత్రలో పరేష్ రావల్ నటించారు. డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్ వేదికగా చిత్రం విడుదల కాబోతోంది. ప్రచారంలో భాగంగా షూటింగ్ అనుభవాల్ని సారా పంచుకున్నారు.
‘చిత్రంలో ఓ పాట షూటింగ్ సమయంలో డేవిడ్ సర్‌కు నా వల్ల చిరాకు వచ్చింది. కోపంతో అరిచారు. ఎందుకంటే.. నా షాట్ కోసం సిద్ధమౌతున్నా. నా కాస్ట్యూమ్స్‌కు కొన్ని జత చేస్తున్నారు. దానికి చాలా సమయం పట్టింది. మరోపక్క వరుణ్ తన వ్యాన్‌లో కాస్ట్యూమ్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు (సరదాగా). ఎంతసేపటికీ రాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యమౌతోందని డేవిడ్‌కు అతడిపై కోపం వచ్చింది. నిజానికి ఆయనకు వరుణ్‌పై చిరాకు వచ్చినా.. దాన్ని నాపై చూపించారు. అది నన్ను కాస్త ఇబ్బందిపెట్టింది. కానీ కాసేపటికి మొత్తం సర్దుకుంది’ అని ఆమె తెలిపారు.
చిత్రంలో తన పాత్ర నిడివి తక్కువగా ఉంటే బాధపడనన్న సారా.. ‘రణ్వీర్ సింగ్, వరుణ్‌లాంటి హీరోలతో కలిసి నటించే స్థాయికి నేనింకా రాలేదు. కాబట్టి వారితో పోల్చుకోవడం సరికాదు. అలాంటి స్టార్స్ నాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషించాలి’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.